test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఉపదేశాలిచ్చేందుకు మీరు స్వాములు కాదు

14 మే, 2026

bvr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 01:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మోడీ, చంద్రబాబు ‘పొదుపు’ సలహాలపై బివి.రాఘవులు
    నీట్‌‌ లీకు బాధ్యులను శిక్షించాలి
    వైజాగ్‌ ‌స్టీల్‌ ప్లాంట్‌ ‌భవిష్యత్తు ‌కోసం కేంద్రంపై బాబు, పవన్‌ ఒత్తిడి తేవాలి

ప్రజాశక్తి - గ్రేటర్‌ ‌విశాఖ బ్యూరో : బంగారం కొనొద్దని, విదేశాల్లో పెళ్లిళ్లు చేయొద్దని, రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాముల్లా ఉపదేశాలివ్వడం చూస్తే భవిష్యత్‌‌లో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ‌ధరలు పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు పేర్కొన్నారు. వారలా ఉపదేశాలు ఇవ్వడానికి స్వాములు కాదని, పరిపాలన సాగిస్తున్న రాజకీయ నాయకులని గుర్తెరగాలని అన్నారు. గురువారం విశాఖలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.జగన్‌‌తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు సమస్యలకు పరిష్కారం ఆలోచించాలే తప్ప, ప్రజలను బాధ్యులు చేస్తూ వారిపై ఆర్థిక భారాలు వేయకూడదన్నారు. బంగారం కొనొద్దని చెప్పే ముందు బంగారం పనులపై ఆధారపడి ఉపాధి పొందుతున్న దేశంలోని లక్షల మంది జీవనం ఏమవుతుందో ఆలోచించారా? అని ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయం చేయాలంటూ మోడీ చెప్పడాన్ని బట్టి భవిష్యత్‌‌లో ఎరువులు సరఫరా చేయలేమనడమేనని పేర్కొన్నారు. శ్రీలంకలో సంక్షోభానికి ప్రకృతి వ్యవసాయమూ కారణమని వివరించారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ప్రకృతి సిద్ధమైన పేడ ఎరువుగా వేసి వ్యవసాయం చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. ఇంధనం వాడకం 50 శాతం తగ్గించాలని, చంద్రబాబు తన కాన్వాయ్‌‌లో 50 శాతం కార్లను తగ్గించడం చూస్తే భవిష్యత్తులో చమురు, గ్యాస్‌ ‌ధరలు పెరగబోతున్నాయని సంకేతాలివ్వడమేనని పేర్కొన్నారు. కాన్వాయ్‌‌లను శాశ్వతంగా తగ్గించేస్తే మంచిదన్నారు. దేశంలో ప్రస్తుత పెట్రో, డీజిల్‌, గ్యాస్‌ ‌కొరతకు ఇరాన్‌‌పై ఇజ్రాయిల్‌, అమెరికా ‌సాగిస్తున్న యుద్ధమే కారణమని వివరించారు. హర్మూజ్‌ ‌జలసంధిని అమెరికా నిర్బంధించినా మోడీ మాట్లాడకపోవడం తో మనదేశం ఇంధనం కొరతతో నష్టపోతోం దన్నారు. విశ్వగురు అని చెప్పుకునే మోడీ... ట్రంప్‌‌నకు విశ్వ బానిసలా మారారని వ్యాఖ్యానించారు. మోడీకి రాష్ర్టంలో చంద్రబాబు, పవన్‌ మొక్కడం మానేసి రాష్ర్ట ప్రజల కోసం పనిచేయాలన్నారు.

నీట్‌ ‌లీకు సంస్థల పనిపట్టాలి
దేశంలో ప్రయివేట్‌ ‌విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి కేంద్రం షాడో విద్యా వ్యవస్థను
ప్రోత్సహిస్తోందని, లాభాల కోసం దుర్మార్గమైన తప్పుడు పద్ధతులతో కొన్ని సంస్థలు పరీక్షా పత్రాల లీకులకు పాల్పడుతున్నాయని రాఘవులు అన్నారు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌‌ ప్రభావం 23 లక్షల మందిపై పడిందన్నారు. విద్యార్థులు పుస్తకాలు కొనుక్కుని, ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాశారని, వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, నీట్‌ పశ్న్ర పత్రాన్ని లీక్ చేసిన వారిని శిక్షించేలా, ఈ ఎగ్జామ్‌ ‌నిర్వహించిన సంస్థను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

విశాఖ స్టీల్‌ ‌ప్లాంట్‌‌కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలి
విశాఖ ఉక్కు కర్మాగారానికి సిఎమ్‌‌డిగా తెలుగు వ్యక్తి వచ్చారని, ప్లాంట్‌ అభివృద్ధికి ఆయన సహకరించాలని రాఘవులు కోరారు. కోక్‌ ఓవెన్‌, సింటర్‌ ‌ప్లాంట్‌ ఆధునీకరణ, రిపేర్లకు రూ.10 వేల కోట్లు ఇవ్వాలన్నారు. సిఎమ్‌డి అందుకు తగ్గ ప్రయత్నం చేయాలని, కేంద్రం గనులు కేటాయించి ప్లాంట్‌ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్లాంట్‌‌లో ఉద్యోగ ఖాళీల‌ను భర్తీ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం వద్ద చంద్రబాబు, పవన్‌‌ పలుకుబడి అందుకు తోడ్పడి మోడీపై ఒత్తిడి తేగలిగితే ఈ ప్రాంత కార్మికులు, ప్రజలు హర్షిస్తారన్నారు. విశాఖ నగరం, చుట్టుపక్కల మండలాలన్నింటా గూగుల్‌, అదాని డేటా సెంటర్‌ ‌వంటి పేర్లతో వందల ఎకరాలను కొల్లగొడుతున్నారని వివరించారు. నిజంగా అభివృద్ధికే తీసుకుంటే నిర్వాసితులకు, భూ బాధితులకు తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులకు అన్యాయం చేసేలా భూ సేకరణ చేస్తే తమ పార్టీ ఊరుకోదన్నారు. సింహాచలం పంచగ్రామాల భూ సమస్య 30 ఏళ్లుగా పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నా అక్కడి వారికి అన్యాయం జరుగుతోందని వివరించారు. హక్కుదారులైన వారికి రిపేర్లకు, నిర్మాణాలకు అవకాశం ఇవ్వకుండా దేవస్థానం అధికారులు, ప్రభుత్వం అడ్డుకుని వేధిస్తుండడం శోచనీయమన్నారు.

భగీరథ్‌పై చర్యలు తీసుకోవాలి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కొడుకు భగీరథ్‌పై ఇటీవల లైంగిక ఆరోపణల నేపథ్యంలో రాఘవులు స్పందిస్తూ.. ‘బిజెపి మహిళలను దేవతల్లా చూస్తామని చెబుతోందని, బండి సంజయ్‌ కొడుకుపై ఆరోపణలొస్తే ఎందుకు ఊరుకుందని’ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చి, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న రాఘవులుకు పంచగ్రామాల భూ సమస్యలపై సమైక్య ప్రజా, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు సిహెచ్‌ఎస్‌ఎస్‌ ‌గోపాలకృష్ణ ఆధ్వర్యాన పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్