యువతకు శిక్షణ
మహిళా సంఘాలతో ప్రచారం
ఆలయాల్లో తప్పనిసరి వినియోగం
మంత్రి నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పైపులైన్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) విస్తరణను వేగవంతం చేయాలని, ఎల్‌పిజికి ప్రత్యామ్నాయంగా పిఎన్‌జి వినియోగాన్ని పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. పిఎన్‌జి గ్యాస్ కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోడ్లు, భవనాలశాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రజలకు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నగరాలు, పట్టణాల్లో పిఎన్‌జి విస్తరణకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తున్నామని, సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. పిఎన్‌జి ఫిల్లింగ్ సెంటర్ల కోసం అవసరమైన స్థలాలను లీజు విధానంలో కేటాయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. పిఎన్‌జి రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తలెత్తకుండా యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఐటిఐ, పాలిటెక్నిక్‌తో పాటు ఇతర విద్యార్థులకు నైపుణ్య సంస్థలు పిఎన్‌జి టెక్నికల్ స్కిల్స్‌పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన ప్రతి జిల్లాలో 15 రోజులకు ఒక బ్యాచ్‌గా 100 మంది యువతకు ఉచిత వసతి, భోజనం, ఉపకార వేతనంతో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పిఎన్‌జి వినియోగం వల్ల ఖర్చు తగ్గడం, భద్రత మెరుగుపడడం వంటి అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సెర్ప్, మెప్మా ద్వారా మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్యాస్ కంపెనీలు మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుని వారికి ప్రోత్సాహకాలు అందిం చాలన్నారు. రాష్ట్రంలో అన్నదానం నిర్వహించే ప్రధాన ఆలయాల్లో పిఎన్‌జి వినియోగాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే కొన్ని ఆలయాలు పిఎన్‌జికి మారాయని, మిగిలిన ఆలయాల్లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాల వద్ద నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అద్దె ఇళ్లలో నివసించే వారికి పిఎన్‌జి కనెక్షన్ల వినియోగంపై సరళ నిబంధనలు తీసుకురానున్నట్లు తెలిపారు. వినియోగదారులకు కూడా ‘దీపం-2’ పథకం కింద ఏడాదికి రూ.2,400 రాయితీ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గ్రూప్ హౌస్‌లలో వేగంగా పిఎన్‌జి విస్తరణకు కంపెనీలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)