25 శాతం తగ్గింపు ధరతో 854.97 ఎకరాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో స్థలాలు గుర్తింపు
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లాలో రిలయన్స్ గిగా స్కేల్ ఎఐ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టు ఏర్పాటు పేరుతో 854.97 ఎకరాల భూమిని కట్టబెడుతున్నారు. 25 శాతం తగ్గింపు ధరతో భూములు కేటాయించేందుకు మే 20న జిఒ నంబరు 30 విడుదల చేసింది. ఉద్యోగ, ఉపాధితో సంబంధం లేని డేటా కేబుల్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వెనుక రిలయన్సు ప్రయోజనాలు తప్ప జిల్లాకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎయిర్‌పోర్టు, విశాఖపట్నం – రాయ్ పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే, మూడో రైల్వే లైను, హెచ్‌పిసిఎల్ పైపులైన్ల పేరిట వేలాది ఎకరాల పంట భూములను ప్రజాప్రయోజనాల పేరిట ప్రభుత్వం లాగేసుకుంది. తాజాగా గుర్ల మండలంలో రెండు పంటలు పండే 1150 ఎకరాల భూమి, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ డెంకాడ మండలాల్లో ఐటి పర్రిశమలు, ఇతర అవసరాల పేరిట మరో 20 వేల ఎకరాల సేకరణకు రంగం సిద్ధం చేస్తోంది. దీనిపై ఆయా ప్రాంతాల ప్రజానీకం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న డేటా ల్యాండింగ్ స్టేషన్‌కు 854.97 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో మరోసారి ఆందోళన మొదలైంది.
రూ.వేల కోట్ల రాయితీలతో జిల్లాకు ఒరిగిందేమిటి?
ప్రభుత్వం ప్రకటించిన రాయితీల జాబితా చూస్తే మతిపోవాల్సిందే. ఆ సంస్థకు భూమి తగ్గింపు ధరకు ఇవ్వడమే కాకుండా, స్టాంపు డ్యూటీ మినహాయింపు మొదలుకుని విద్యుత్ సుంకం రద్దు వరకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యుత్ రాయితీలు, ట్రాన్స్‌మిషన్ ఛార్జీల మినహాయింపులు, నీటి రాయితీలు, జిఎస్ టి మినహాయింపులు, పెట్టుబడి సబ్సిడీలు కలిపి ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విజయనగరం జిల్లాతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు తాగునీరు, సాగునీరు, ఉపాధి, పరిశ్రమల విషయంలో వెనుకబడి ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక కార్పొరేట్ సంస్థకు రూ.వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వడం సమంజసమేనా? అంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపాదనలు పంపాం : డిఆర్ఒ
రిలయన్స్ డేటా ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం భోగా పురం, డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో ప్రజావసరాల కోసం ఇప్పటికే గుర్తించిన భూములను ప్రతిపాదించాం. భోగాపురం మండలం భోగాపురం ఈస్టు, వెస్ట్ గ్రామాలు, పోలిపల్లి తదితర గ్రామాల పరిధిలో అవసరమైనంత స్థలం ఉంది. పూసపాటిరేగ మండలం రెల్లి, చోడమ్మ అగ్రహరం గ్రామాలు, డెంకాడ మండలంలోని ఒకటి రెండు చోట్ల కూడా స్థలం ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు కేటాయింపు చేస్తాం.








కామెంట్‌లు (0)