test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎఎంసిఎ దేశ‘రక్షణ’ ప్రయివేటు చేతుల్లోకి

19 మే, 2026

ఎఎంసిఎ దేశ‘రక్షణ’ ప్రయివేటు చేతుల్లోకి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 19, 2026, 11:09 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ప్రభుత్వరంగ సంస్థ ‘హాల్‌‌’కు దక్కని చోటు

  • యుద్ధవిమానాల తయారీలో అనుభవంలేని సంస్థలకే ప్రాధాన్యం

ప్రజాశక్తి అనంతపురం ప్రతినిధి : అడ్వాన్స్‌‌డ్‌ మిడ్‌ కాంబాట్‌ ఎయిర్‌‌క్రాప్టు (ఎఎంసిఎ)లోని రక్షణ రంగాన్ని ప్రయివేటుకు అప్పజెప్పేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్‌ ఎయిరోనాటికల్‌ ‌లిమిటెడ్ (హాల్‌)‌ను తప్పించేందుకు చూస్తోంది. దీన్ని ప్రయివేట్‌ పరం చేస్తే రక్షణ రంగం ఎంత వరకు సురక్షితంగా ఉంటుందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఇటీవల అట్టహాసంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎఎంసిఎ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో దేశరక్షణ రంగంలోకి తొలిసారిగా ప్రయివేటురంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ కేంద్రం అనుమతులిస్తోంది. యుద్ధవిమాన రంగంలో ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్తాన్‌ ఎయిరోనాటికల్‌ ‌లిమిటెడ్ (హాల్‌)‌కు చోటు లేకుండా చేసింది. దేశంలోనే తొలిసారిగా రక్షణ రంగంలోకి ప్రయివేటు రంగాన్ని అనుమతించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ భద్రతలో ఎంతో కీలకమైన ఈ రంగంలోకి లాభాల కోసం పాకులాడే ప్రయివేటు సంస్థల చేతుల్లో పెడితే దేశం ఎంత మేరకు సురక్షితమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఎఎంసిఎ ఉద్ధేశం ఏమిటి..?

దేశ రక్షణ వ్యవస్థలో ఇప్పుడు కీలకమైంది వాయుసేనగానే ఉంటోంది. ఇప్పుడున్న యుద్ధ విమానాల స్థానంలో ఐదవ తరం యుద్ధవిమానాలను రూపొందించాలని భారత్‌ ‌ప్రయత్నిస్తోంది. శత్రుదేశాల రాడార్ల కంటపడకుండా వెళ్లి దాడులు చేసి సురక్షితంగా రాగలిగే అత్యాధునిక ఫైటర్‌ ‌జెట్స్‌‌ను రూపొందించడం కోసం ఎఎంసిఎ ప్రాజెక్టును రక్షణ శాఖ రూపొందించింది. 2029 నాటికి ప్రోటోటైప్‌ (ప్రాథమిక విమానాలు) యుద్ధ విమానాల రూపకల్పన చేయాలన్నది లక్ష్యం. ఆ తరువాత వాటిని అభివృద్ధి చేసి 2034 నాటికి వీటికి ఫైనల్‌ ‌చేసి 2035 సంవత్సరంలో పూర్తి స్థాయి విమానాల తయారీ చేపట్టాలన్నది సంకల్పం. దీనికి రూ.15 వేల కోట్ల అంచనాతో ప్రణాళిక సిద్ధం చేశారు. దీన్ని ఏర్పాటుకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రాన్ని టెస్టింగ్‌ ‌సెంటర్‌‌గా ఎంపిక చేశారు. 650 ఎకరాల్లో దీని ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డిఆర్‌‌డిఒ అనుబంధ సంస్థ అయిన ఎయిరోనాటికల్‌ ‌డిఫెన్సు ఏజెన్సీ పర్యవేక్షణలో ఇది జరుగుతుంది.

‘హాల్‌‌’ను తప్పించి ప్రయివేటు భాగస్వామం

రక్షణ రంగంలో వాయు విమాన తయారీలో ఇప్పటి వరకు హాల్‌ (‌హిందూస్తాన్‌ ఎయిరోనాటికల్‌ ‌లిమిటెడ్‌) ‌తిరుగులేని శక్తిగా ఉంది. తేజేస్‌, సుఖోయ్‌ ‌వంటి యుద్ధ విమానాల రూపకల్పన చేసిన అనుభవం కూడా దీనికుంది. అయితే ఈ సంస్థకు ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయన్న పేరుతో ఎఎంఎసి ప్రాజెక్టు నుంచి తప్పించారు. మొదట హాల్‌‌తో కలిపి ఏడు సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్‌‌లో పాల్గొన్నాయి. హాల్‌‌కు ఆర్డర్‌ ‌బుక్‌ ‌టర్నోవర్‌ ‌కంటే ఎనిమిది రెట్లు అదనంగా ఉన్నాయని చెప్పి పోటీ నుంచి తప్పించారు.
తరువాత మూడు సంస్థలకు అర్హతల్లేవని తప్పుకున్నాయి. ఇప్పుడు టాటా అడ్వాన్స్‌‌డ్‌ సిస్టమ్‌ ‌లిమిటెడ్‌ (‌టిఎఎస్‌ఎల్‌), ఎల్‌అండ్‌‌టి, భారత్‌ ‌ఫోర్జు సంస్థలు పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వం ఈ మూడు సంస్థల్లో ఏ దానికి అనుమతిని ఇస్తే దానికి ఎఎంసిఎ ప్రాజెక్టులో భాగస్వామి కానున్నాయి. అయితే మూడు ప్రయివేటు సంస్థలు కూడా రక్షణరంగంలో నున్న అనుభవం ఏ పాటిదన్న దానిపై సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రయివేటు సంస్థకు ఇవ్వడం ద్వారా కీలకమైన రక్షణ రహస్యాల గురించి ఆందోళన కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం హాల్‌ తయారీలో తీరని జాప్యం చేస్తోందన్న కారణం చెబుతోంది. ప్రయివేటు అ‌యితే వేగవంతంగా అమలు చేయవచ్చునంటూ సమర్థించుకొంటోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్