వైసిపి అధికారంలోకి వచ్చాక కులదూషణలు పెరిగాయి : పవన్ కల్యాణ్
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : వైసిపి వచ్చాక రాజకీయాల్లో కులదూషణలు బాగా పెరిగాయని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాజధాని అమరావతిలోని పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి బుధవారం ఉపముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగం భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసిందని, ఆయన ఆత్మబలిదానంతోనే ఆంధ్రప్రదేశ్‌కు ఉనికి ఏర్పడిందని చెప్పారు. మహా నాయకులను కులచట్రాల్లో బిగించడం రాజకీయాల్లో అలవాటుగా మారిందన్నారు.
కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని వాటి నాయకులు బాగుపడ్డారేమో కానీ, ఆయా కులాల ప్రజలు మాత్రం అభివృద్ధికి నోచుకోకుండా తీవ్రంగా నష్టపోయారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, నిరుద్యోగం గురించి పట్టించుకోకుండా కులాల గొడవలను ప్రోత్సహించిందని, వీటికి వ్యతిరేకంగా సేనాగళం అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాను తప్పుగా మాట్లాడలేదన్న పవన్‌కల్యాణ్... తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదే, ఎపి నుంచి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదని జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారని చెప్పారు. తెలంగాణలో పార్టీ కార్యాలయాలను తీసేసినా జనసైనికులు, నాయకులు మాత్రం ఎప్పటిలాగే నిలబడే ఉంటారని తెలిపారు. కెటిఆర్ తనకు సోదర సమానులని, ప్రాంతీయవాదం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరని అన్నారు. దేశంలో బతకడం మన హక్కని, దానిని కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)