- నేడు పిడుగులతో కూడిన వర్షాలు : విపత్తు శాఖ
ప్రజాశక్తి- యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు రాయలసీమ జిల్లాల్లోని వాగులు జలకళను సంతరించుకున్నాయి. శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్ కడప జిల్లాల్లోని పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. అయితే, పలుచోట్ల ప్రధాన రహదారులపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద ఉధృతి తగ్గకపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపివేసి దారి మళ్లించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మోటుమర్ల వాగు ఉధృతంగా ప్రవహించడంతో ధర్మవరం, పుట్టపర్తికి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గిన అనంతరం రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. వంక పరవళ్లు తొక్కడంతో సమీప గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి ముద్దనూరు-పులివెందుల రహదారిలోని టెలిఫోన్ ఎక్సేంజ్ సమీపంలో ఉన్న పుల్లేరు వంక పొంగి పొర్లింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పులివెందుల - ముద్దనూరు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పులివెందులకు వెళ్లాల్సిన వాహనదారులు, ప్రయాణికులు ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల, వేంపల్లి మీదుగా ప్రయాణాలు సాగించారు. ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా హిందూపురం వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం కోసం పక్కన తాత్కాలికంగా వేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోయింది.
50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
తూర్పు విదర్భ నుండి దక్షిణ కేరళం వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో మంగళవారం పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు పోలవరం, ఏలూరు, ఎన్‌టిఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురంమన్యం, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో సోమవారం 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
01 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 12:39 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)