రైతుల సంక్షేమమే కూటమి ధ్యేయం : మంత్రి దుర్గేష్
ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్ : తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ నుంచి ఖరీఫ్ సీజన్ సాగునీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85 వేల ఎకరాలకు, నిడదవోలు, కొవ్వూరు కాలువల ద్వారా మరో 41 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… రైతుల సంక్షేమమే టిడిపి కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్‌కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముందుగానే నాట్లు వేసుకొని పంటలను రక్షించుకోవాలని రైతులకు సూచించారు. ముందస్తు నీటి విడుదలతో త్వరగా పంట చేతికి వస్తోందని, దీంతో నష్టాల బారి నుంచి రైతు గట్టెక్కవచ్చాన్నారు. ప్రస్తుతం టిడిపి కూటమి ప్రభుత్వం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం రూ.148 కోట్లు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతులకు మరో రూ.13 కోట్లు విడుదల చేసి, సాగునీటి సంఘాల ద్వారా 80 శాతం పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ మాట్లాడుతూ… రైతు బాగుంటే గ్రామం, రాష్ట్రం, దేశం బాగుంటుందనే సిద్ధాంతంతో సిఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. కాకినాడ ఎంపి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… బ్యారేజ్ మరమ్మతులు, కాలువల పునరుద్ధరణ పనులు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయమన్నారు. అమలాపురం ఎంపి గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ… కాటన్ బ్యారేజ్‌లో 117 గేట్లను కొత్తవిగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తగ్గించి రైతులకు మేలు చేకూర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ మూరల శెట్టి సునీల్ కుమార్, వెస్ట్రన్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ మురళీ కృష్ణ రాజు, ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ చినబాబు, ధవళేశ్వరం ఎస్ఇ జి. శ్రీనివాస్ రావు, హెడ్ వర్క్స్ ఎస్ఇ శ్రీనివాస్, ఇఇ రామకృష్ణ, విజ్జేశ్వరం ఇఇ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)