బ్యాంకు రుణాలు, సంక్షేమానికి దూరమవుతున్న కౌలు రైతులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : నిజమైన సాగుదారుడికి బ్యాంక్ రుణం అందాలన్నా, ప్రభుత్వ పథకాలు వర్తించాలన్నా పంటల సాగు కార్డు ‘సిసిఆర్‌సి’ కార్డు కీలకం. అలాంటి కార్డుల జారీలో ప్రభుత్వం ఏటికేడు వెనకడుగు వేస్తోంది. గతేడాది నిర్దేశిత లక్ష్యాలను అందుకోలేకపోయామనే నెపంతో ఈసారి ఏకంగా కార్డుల సంఖ్యను కుదించింది. కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డులు లేకపోతే ప్రభుత్వ రాయితీలు, బీమా, పెట్టుబడి సాయానికి దూరమవుతారు. కార్డులు ఇవ్వకుండా కౌలు రైతులను బ్యాంకుల చుట్టూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేలా ప్రభుత్వం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పది లక్షల మందికి సిసిఆర్ సి కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 5.99 లక్షల మందికి కార్డులను అందించారు. కార్డుల జారీకి లక్ష్యాలు తీసుకుంటున్నా, ఏ సంవత్సరమూ వాటిని చేరుకోలేని పరిస్థితి నెలకొంది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లోనూ పది లక్షల మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకుని 8.31 లక్షల మందికే ఇచ్చారు. 2025లో కూడా పది లక్షల కార్డులు ఇవ్వాలని నిర్ధేశించుకున్నా 5.99 లక్షల మందికే ఇచ్చారు.ఈ ఏడాది మళ్లీ అదే పది లక్షల మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
యజమానుల దయాదాక్షిణ్యానికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
సిసిఆర్ సి కార్డుల జారీకి గ్రామాల్లో సభలు నిర్వహించి, కొత్తగా కార్డులు ఇవ్వాల్సిన ప్రభుత్వం అటువంటి ప్రక్రియ చేపట్టడం లేదు. గ్రామాల్లో ఎక్కడా మచ్చుకైనా సభలు నిర్వహించడం లేదు. కార్డుల రెన్యువల్ అక్కడక్కడా జరుగుతున్నా కొత్త కార్డుల జారీ సాగడం లేదు. కొత్త కార్డులు ఇవ్వడానికి యజమానులు అంగీకారం తెలపకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కార్డుల కోసం సంతకాలు అడుగుతుంటే కొత్త వారికి కౌలుకు ఇచ్చుకుంటామంటూ యజమానులు బెదిరిస్తుండడంతో, కార్డుల మాట పక్కన పెట్టి గ్రామాల్లో పరస్పరం అంగీకరంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాటినే ప్రభుత్వం కార్డుల జారీ చేసినట్టు లెక్కల్లో రాసుకుంటున్నట్లు తెలుస్తోంది.
భరోసా ఇవ్వని సాగు హక్కుదారుల చట్టం-2019
2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు హక్కుదారుల చట్టం-2019 చట్టం ఎందుకూ కొరగాకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని చెప్పిన నాటి ప్రభుత్వం భూయజమానులపై దయాదాక్షిణ్యానికి వదిలేసింది. సంతకాలు చేసేందుకు ఎక్కడా భూ యజమానులు ముందుకు రాకపోవడంతో, లక్ష్యం మేర కార్డులు అందించలేకపోయింది. 2024లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం సాగు హక్కుదారుల చట్టాన్ని సవరించి కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు అందిస్తామని అసెంబ్లీ తొలి సమావేశాల్లో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించినా, సవరణల జోలికి పోకుండా పాత చట్టాన్నే యధావిధిగా కొనసాగిస్తోంది.









కామెంట్‌లు (0)