test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంస్కృతిపై బీచ్‌ షాక్స్‌ దాడి

6 రోజుల క్రితం

beach
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 07:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం మంచిదే. ఉపాధి అవకాశాలు పెరగాలి, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి. ఈ లక్ష్యాలను ఎవరూ వ్యతిరేకించరు. కానీ అభివృద్ధి పేరుతో సమాజం చెల్లించాల్సిన మూల్యం ఎంత? అనేది కూడా అంతే ముఖ్యమైన ప్రశ్నే. విశాఖపట్నం, చీరాల వంటి సముద్ర తీర ప్రాంతాల్లో గోవా తరహా పర్యాటక వినోదాన్ని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వినసొంపుగా ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న సామాజిక పర్యవసానాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మద్యం విక్రయాలకు అనుమతులతో కూడిన ఈ విధానం తెలుగు సంస్కృతిని, కుటుంబ వ్యవస్థను ఏ తీరాలకు చేరుస్తుందోనన్న ఆవేదన మేధావుల్లోనూ, మహిళాలోకంలోనూ వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం ఎంచుకుంటున్న మార్గాలు కేవలం మద్యం, విలాసాల చుట్టూ తిరగడం శోచనీయం. పర్యాటక అభివృద్ధి అంటే కేవలం విదేశీ లేదా పాశ్చాత్య ధోరణులను దిగుమతి చేసుకోవడం కాదు. పర్యాటకం అనేది ఒక ప్రాంతం యొక్క వారసత్వాన్ని, సహజ సౌందర్యాన్ని గౌరవప్రదంగా ప్రదర్శించేదిగా ఉండాలి. 'మన మధ్య వేలాది మంది తాగుబోతులు ఉండటం కంటే, భారతదేశం నిరుపేద స్థితికి పడిపోవడమే మేలని నేను భావిస్తాను. దేశాన్ని మద్యపాన రహితంగా మార్చడానికి విద్యను వదులుకోవాల్సి వస్తే, విద్య లేని భారతదేశాన్నే నేను కోరుకుంటాను (యంగ్ ఇండియా, 15-9-'27)` అంటారు గాంధీజీ. మద్యం ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ఖజానాను ఎంత నింపుతుందోగానీ, సామాన్య ప్రజల ఇళ్లలో మాత్రం అంతకంటే ఎక్కువ చీకటిని నింపుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ వల్ల విచ్చలవిడితనం పెరిగిందనే విమర్శలు ఉండగా, ఇప్పుడు నేరుగా సముద్ర తీరాలనే 'బార్'లుగా మార్చడం ప్రజాహిత నిర్ణయం అనిపించుకోదు.
తెలుగు జాతికి ఒక ఘనమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. మన సముద్ర తీరాలు కుటుంబ సమేతంగా వెళ్లి ప్రశాంతంగా గడిపే పుణ్యక్షేత్రాల వంటివి. ఇప్పుడు ఆ తీరాలలో 'బీచ్ షాక్స్` ఏర్పాటు చేసి, అక్కడ మద్యం పారుతుంటే.. సామాన్య మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు, పిల్లలు అక్కడికి వెళ్లగలరా? పాశ్చాత్య దేశాల్లోని 'క్లబ్ కల్చర్'ను మన తీరాలకు అద్దడం వల్ల మనం పొందే లాభం కంటే కోల్పోయే సాంస్కృతిక విలువలే ఎక్కువ. సంస్కృతి అంటే కేవలం పండుగలు, సంప్రదాయాలు మాత్రమే కాదు; సమాజం అనుసరించే విలువలు, జీవన విధానం కూడా. ఆ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్నట్లుగా గోవా మోడల్‌ను అనుసరించడం వల్ల పర్యాటకులు పెరిగే అవకాశముండవచ్చు. కానీ ప్రతి ప్రాంతానికి తనదైన చరిత్ర, సంస్కృతి, సామాజిక నిర్మాణం ఉంటాయి. 'సంస్కృతి అంటే మనం ఏమిటో తెలిపేది, నాగరికత అంటే మన దగ్గర ఏముందో తెలిపేది. నాగరికత కోసం సంస్కృతిని బలి ఇవ్వకూడదు` అంటారు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్. గోవాలో పర్యాటకం బాగుండవచ్చు, కానీ అక్కడ పెరుగుతున్న మాదక ద్రవ్యాల సంస్కృతి, నేరాలు, అనైతిక కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ ఆహ్వానించాలనుకుంటోందా? 'ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బీచ్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగిస్తే మహిళలు, విద్యార్థినులు, కుటుంబాలు విశాఖ బీచ్ రోడ్డుపై స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి ఉంటుందా` అని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. బీచ్ షాక్స్ వల్ల మహిళల భద్రతను, స్వేచ్ఛను తాకట్టు పెట్టడం సిగ్గుచేటని, ఈవ్ టీజింగ్, వేధింపులు పెరిగే అవకాశం ఉందని వారు మండిపడుతున్నారు. సనాతన ధర్మం గురించి గగ్గోలు పెట్టే పవన్ కల్యాణ్, హిందూ సంస్కృతి అంటూ నిత్యం మాట్లాడే బిజెపి ఈ విధానాన్ని బలపరచడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం.ఆంధ్రప్రదేశ్‌కు విశాలమైన తీరప్రాంతం ఉంది. బీచ్‌ టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే పర్యావరణహిత రిసార్టులు, కుటుంబ విహార కేంద్రాలు, జలక్రీడలు, అడ్వెంచర్ టూరిజం, స్థానిక కళలు– సంస్కృతిని ప్రతిబింబించే పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయవచ్చు. తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి స్థానిక హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికలు కల్పించాలి. ఉపాధి లభిస్తుంది, సంస్కృతి కాపాడబడుతుంది. భవిష్యత్ తరానికి మనం అందమైన ప్రకృతిని, గౌరవప్రదమైన జీవన విధానాన్ని అందించాలి. కానీ, సముద్రపు గాలిలో మద్యం వాసనను, ఇసుక తిన్నెలపై ఖాళీ సీసాలను పరిచయం చేయడం నాగరికత అనిపించుకోదు. ఈ విచ్చలవిడి సంస్కృతి రేపటి సమాజ విచ్ఛిన్నానికి పునాదిగా మారకూడదు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. మెజారిటీ ప్రజలు, ముఖ్యంగా మహిళలు వ్యతిరేకిస్తున్న 'బీచ్ షాక్' విధానాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఆదాయం కంటే సామాజిక ఆరోగ్యం ముఖ్యం. సంప్రదాయాలను కాలరాసి సాధించే ఏ అభివృద్ధీ శాశ్వతం కాదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్