మన రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్.ఐ.ఆర్-సర్) ఈ నెల 5 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో పూర్తవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) షెడ్యూలు ప్రకటించగా ఇక్కడి అధికార యంత్రాంగం అందుకు సమాయత్తమవుతోంది. వివాదాస్పద ‘సర్’ను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది ఇసినే అయినా వెనకుండి నడిపిస్తున్నది కేంద్రంలోని మోడీ ప్రభుత్వమన్నది బహిరంగ రహస్యం. కాగా రాష్ట్రంలోని అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపి అధినేతలు చంద్రబాబు, జగన్.. ఇద్దరూ ‘సర్’ ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని ఒక వైపు భయపడుతూనే ‘సర్’ను తీసుకొచ్చిన ఇ.సి.ని, సదరు రాజ్యాంగబద్ధ సంస్థను ప్రభావితం చేస్తున్న బిజెపిని, ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట్లాడకపోవడం ఆ రెండు పార్టీల రాజకీయ అవకాశవాదాన్ని తెలుపుతుంది. అధికార కూటమిలోని భాగస్వామ్యపార్టీ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వివాదాస్పద ‘సర్’ను ప్రశ్నించలేదు. కాని ఆ పక్రియపై అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను కోరారు.
టిడిపి నిర్వహించిన ‘మహానాడు’లో ‘సర్’పై జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు హెచ్చరించారు. మంగళవారం తమ పార్టీ ఎంఎల్ఎలతో ‘సర్’పైనే ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. సరిగ్గా టిడిపి ‘మహానాడు’ రోజునే జగన్ తమ పార్టీ నేతలతో నడిపిన సమావేశంలో ప్రధానంగా ‘సర్’పైనే ఎక్కుపెట్టారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలు అక్కడి ప్రభుత్వాల ఓటమి, వ్యక్తిగతంగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరాజయాలను గణాంకాలతో విశదీకరించారు. జగన్ ఇంకో అడుగు ముందుకేసి కేవలం ఉద్దేశపూర్వక ఓట్ల తొలగింపులే కాదు చేర్పింపులు కూడా డేంజరేనంటున్నారు. చంద్రబాబు, జగన్.. ఇద్దరూ ‘సర్’పై గుబులుగా ఉన్నారని వారి వ్యాఖ్యలతో అర్థమవుతుంది.
ఇ.సి. ‘సర్’ను చివరిగా వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002లో చేపట్టింది. అయితే అప్పటికి ఇప్పటికీ ‘సర్’కు ఇ.సి. ప్రవేశపెట్టిన నిబంధనలు, ఓటు హక్కు కోసం పౌరులను చూపించమంటున్న కొన్ని పత్రాలే సమస్య. పౌరులు తాము ఓటర్లుగా జాబితాలో కొనసాగాలన్నా, కొత్తగా చేరాలన్నా పౌరసత్వం నిరూపించుకోవాలన్న షరతు రాజ్యాంగ విరుద్ధమైనది. ఇది సార్వత్రిక ఓటు హక్కును దెబ్బతీస్తుంది. ‘సర్’ను చేపట్టిన పలు రాష్ట్రాలలో చిన్న కారణాలతో ఓటు తొలగించబడిన, అనుమానాస్పద జాబితాలో చేర్చి ఓటు నిరాకరించబడిన వారు లక్షలాదిగా ఉన్నారు. వీరందరూ వారి ఓటు హక్కును కోల్పోయారు. పశ్చిమబెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారు. న్యాయస్థానం ద్వారా 27 లక్షల ఓట్లకు పరిష్కారం లభించినా వారు ఓటు వేయలేకపోయారు. తొలగించిన 91 లక్షల ఓట్లనూ ప్రత్యేకంగా పరిశీలించాలంటే కనీసం నాలుగైదేళ్లయినా పడుతుందని ప్రత్యేక ట్రిబ్యునల్ జడ్జి వెల్లడించారంటే పరిస్థితి ఎంత లోపభూయిష్టమో తెలుస్తుంది. ‘సర్’ ప్రక్రియలో ఓట్లు కోల్పోయిన వారికి బీహార్, బెంగాల్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిలిపివేయడం దారుణం. ఈ ప్రమాదాన్ని గుర్తెరగాలి. ఓట్లు కోల్పోయిన వారిలో అత్యధికంగా బలహీనులు, వలసదారులు, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, సమాజంలో ఇతర వెనకబడిన తరగతులే ఎక్కువ. మోడీ ప్రభుత్వం ‘సర్’ ద్వారా దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన జాతీయ పౌర పట్టిక (ఎన్‌సిఆర్)ను పరోక్షంగా ప్రవేశపెట్టేందుకు కుట్రలు పన్నింది. ఆ కొనసాగింపుగా పార్లమెంట్లో సి.ఎ.ఎ. బిల్లుకు టిడిపి, వైసిపి పోటీపడి మద్దతిచ్చాయి. ఒక్క సి.ఎ.ఎ. బిల్లే కాదు కేంద్రం తీసుకొచ్చే ప్రతి బిల్లుకూ టిడిపి, వైసిపి, జనసేన ఓటేసి గెలిపించి బిజెపిని, మోడీని మెప్పిస్తున్నాయి. ‘సర్’ నిజస్వరూపాన్ని వామపక్షాలు మాత్రమే బయటపెట్టి ఎండగట్టాయి. ఇ.సి. వద్ద జరిగిన సమావేశంలో నిజాయితీగా, పారదర్శకంగా ‘సర్’ నిర్వహించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకూడదని డిమాండ్ చేశాయి. ‘సర్’తో జాగ్రత్తని తమ శ్రేణులను అప్రమత్తం చేస్తున్న టిడిపి, వైసిపి తమ రాజకీయ లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నాయి తప్ప ఆ ప్రక్రియను తమ విద్వేష రాజకీయాలకు వాడుకుంటున్న బిజెపి, మోడీ పట్ల ప్రభు భక్తి ప్రదర్శించడం వంచనే కాగలదు. పాలకవర్గ పార్టీల విన్యాసాలెలా ఉన్నా ప్రజలు అప్రమత్తం కావాలి.
సర్‌పై గుబులు
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 02, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్లు (0)