సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. 2014 జూన్ 2న సమైక్య రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆ ప్రక్రియ వల్ల తీవ్రంగా నష్టపోయే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తామని పార్లమెంట్ హామీ ఇచ్చింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి చేసిన ప్రకటనలు, వివిధ జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలు రాష్ట్ర ప్రజల్లో కొంత మేర నమ్మకాన్ని కలిగించాయి. హైదరాబాద్ వంటి సిద్ధంగా ఉన్న రాజధానిని, భారీ ఐటీ- సేవారంగ ఆదాయాన్ని, పెట్టుబడుల కేంద్రాన్ని కోల్పోయిన రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు, ప్రత్యేక హోదా, ఆర్థిక సహాయం, జాతీయ ప్రాజెక్టులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించి అభివృద్ధి బాటలో నిలబెడతామని అప్పట్లో చెప్పారు. కానీ పన్నెండేళ్ల తరువాత వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే పూర్తిగా భిన్నమైన దృశ్యాలు కనిపిస్తాయి. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ రెవెన్యూ లోటు ఏర్పడుతుందని అంగీకరించింది. 2014-15 సంవత్సరంలోనే రాష్ట్రానికి సుమారు రూ.16,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉందని గుర్తించారు. అలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఆర్థిక ఆక్సిజన్‌లా ఉపయోగపడాల్సింది. అయితే, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ఇదే సమయంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు నేటికీ అమలు కాలేదు. అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఈనాటికీ కొనసాగుతోంది. అలాగే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్లు, పెట్రోకెమికల్ హబ్ వంటి హామీలు కూడా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. కొన్ని కాగితాలపై నిలిచిపోయాయి. మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ అది ఇప్పటికీ పూర్తికాలేదు. వ్యయం అనేక రెట్లు పెరిగింది. ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వేలాది గిరిజన కుటుంబాల పునరావాసం ఇప్పటికీ అసంపూర్తిగా ఉంది. రాష్ట్రానికి రాజధాని నిర్మాణంలో సహకరిస్తామంటూ చట్టంలో చెప్పిన మాటను కూడా కేంద్రం పూర్తిగా నిర్వర్తించలేదు మొత్తంగా చూస్తే పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలు పన్నెండేళ్ల తరువాత కూడా అమలు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు భూముల సంతర్పణ వంటి అంశాలు ఈ కాలంలోనే ముందుకు వచ్చాయి.
మరోవైపు రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, వైసిపి లు ప్రజల హక్కుల సాధనలో ఘోరంగా విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయడానికి బదులు తమ సొంత ప్రయోజనాల పరిరక్షణకే అవి ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రజల ఆశలను, భావోద్వేగాలను, ప్రాంతీయ ఆవేదనను ఎన్నికల సమయంలో ఉపయోగించుకుని, తరువాత పక్కనపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక దురదృష్టకర సంప్రదాయంగా మారిపోయింది. రాష్ట్రభివృద్ధికి వామపక్షాలు నిరంతరం ఉద్యమిస్తూనే వున్నాయి. ఇది, రాష్ట్రానికి తీరని విద్రోహం జరిగిన పుష్కర సంవత్సరం. నెరవేరని వాగ్దానాలను గుర్తు చేసుకునే సందర్భం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుత్సిత వైఖరిని గుర్తుచేసుకునే సందర్భం. ఆంధ్రప్రదేశ్ విభజనను కేవలం చరిత్రలో జరిగిన ఒక రాజకీయ సంఘటనగా చూడటం సరైంది కాదు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక అసంపూర్ణ ప్రక్రియ. ఎందుకంటే విభజన సమయంలో ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులు పూర్తిగా అందలేదు. అభివృద్ధి అసమానతలు తగ్గలేదు. ఆనాటి గాయాలు ఇంకా మానలేదు. రాష్ట్ర ప్రజానీకం విభజన వల్ల ఒకసారి, ఆ నష్టాలను భర్తీ చేయాల్సిన హామీలు అమలు కాకపోవడం వల్ల రెండవ సారి నష్టపోయారు. పన్నెండేళ్ల తరువాత కూడా విభజన నష్టాల గురించి, హామీల అమలు వైఫల్యం గురించి మాట్లాడుతున్నామంటే దానికి ప్రధాన కారణం కేంద్ర పాలకుల విద్రోహం, రాష్ట్ర పాలకుల అవకాశవాదం! రాష్ట్ర ప్రజల సహనాన్ని బలహీనతగా భావించే పార్టీలు చరిత్ర ముందు సమాధానం చెప్పక తప్పదు. దేశ పార్లమెంట్ ఇచ్చిన మాటపై ఉన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు రాజకీయ పక్షాల బాధ్యత!
Print Editionవిద్రోహానికి పుష్కరం
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 05:45 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)