సామాన్యులకు డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరల్ని పెంచుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం విమాన ఇంధన ధరను అమాంతం తగ్గించడాన్ని బట్టి దాని స్వభావం తేటతెల్లమవుతోంది. సామాన్యుల పట్ల కక్షపూరితంగానూ, సంపన్నులకు వరాల మూట కట్టబెట్టడం దాని నైజమని ఇట్టే బోధపడుతుంది. మే 15 నుంచి 10 రోజుల వ్యవధిలోనే సాధారణ ప్రజానీకం వినియోగించే పెట్రోలు, డీజిల్‌పై నాలుగుసార్లు భారాలు వేసిన మోడీ ప్రభుత్వం, తాజాగా వాణిజ్య సిలిండర్‌పై మరో 42 రూపాయలు వడ్డించింది. పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్దేశంతో సిఎన్ జి వాహనాలను నడిపే ఆటో, క్యాబ్ యజమానులు, వినియోగదారులపైనా ఇటీవల కిలోపై 2 రూపాయలు వడ్డించింది. మరోవైపు విమాన ఇంధనం (ఎటిఎఫ్) ధరలను గతంలో ఎన్నడూ లేనివిధంగా 27 శాతం తగ్గించింది.
విజయవాడలో ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.117.78, డీజిల్ ధర రూ.105.45గా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ విమానాలకు సరఫరా చేస్తున్న ఎటిఎఫ్ (కిలో లీటరు రూ.1,04,927) లీటరు రూ.104.92గా ఉంది. ఇందులో అంతర్జాతీయ విమానాల కోసం 27 శాతానికి తాజాగా కోత పెట్టింది. పశ్చిమాసియా సంక్షోభంతో ముడిచమురు ధర పెరగడం వల్ల విమానయాన సంస్థలు ఇంధన భారాలు మోయలేక ఇబ్బంది పడిపోతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పెద్దల ఉవాచ. అంటే మన రైతులు ట్రాక్టర్లలో వినియోగించే, నిత్యావసర సరుకుల రవాణాకు లారీల్లో వినియోగించే డీజిల్ కంటే దాదాపు 28 రూపాయలు తక్కువ ధరకు విమానయాన సంస్థలు ఎటిఎఫ్‌ను పొందగలుగుతున్నాయన్న మాట! ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పొలాల్లో శ్రమిస్తూ… అన్నం పెడుతున్న రైతన్నపై ఏ మాత్రం కనికరం లేకుండా గత నెలలో భారాలు మోపేసిన కేంద్రం సంపన్నుల ఆకాశ యానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వారి వర్గ ప్రాధాన్యతకు అద్దం పట్టేదే. ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోతున్న చిన్న, సన్నకారు, కౌలు రైతులు ఎకరాకు మూడు వేల రూపాయల కంటే అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం గోరుచుట్టుపై రోకలి పోటే. డీజిల్ ధర పెంపుతో ఆటోలు, ట్యాక్సీలు, లారీలు నడుపుకుని బతికేవారు, వాటిలో పనిచేసేవారూ, గిగ్‌వర్కర్లు మరిన్ని కష్టాల పాలవడం కేంద్రం వైఫల్యమే. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడల్లా ప్రజలపై భారాలు వేయడం, తగ్గినప్పుడు ఎక్సైజ్ డ్యూటీలు, సర్ ఛార్జీలు పెంచేసి ఆ మిగులును తన ఖాతాలో వేసుకోవడం మోడీ సర్కారుకు పరిపాటిగా మారింది.
వంట గ్యాస్ ధరలను సైతం అడ్డూఅదుపూ లేకుండా పెంచేయడం, కమర్షియల్ గ్యాస్ ధరను అమాంతం రూ.995 పెంచేశాక, ఇప్పుడు మరో 42 రూపాయలు పెంచడం సామాన్యులతోపాటు హోటల్ రంగాన్ని ప్రమాదంలోకి నెట్టేసింది. బయట కొనుక్కోలేక అర్ధాకలితో అలమటించే అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులు, నిరుద్యోగుల సంఖ్యను పెంచే విధానాన్ని అనుసరించడమే మోడీ పొదుపు సూత్రాల లోగుట్టు. పెట్రో ధరలు పెరిగితే మిగతా వస్తువులన్నింటి ధరలూ పెరుగుతాయి. ప్రజల కొనుగోలు శక్తి ఆ మేరకు పెరగనందున వినియోగం తగ్గిపోతుంది. గొలుసుకట్టు ప్రభావం ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్తుంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఇంకా తీవ్రతరమవుతుంది. నిరుద్యోగం, పేదరికానికి కారణమవుతున్న ఈ విధానాలను విడనాడి, సామాన్యుడి పక్షాన ఆలోచించగలగడమే ఈ పరిణామాలకు విరుగుడు. ఆ దిశగా అడుగులు వేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం ప్రధానం. అందుకు ఐక్య ప్రజాపోరాటాలే మార్గం.
Print Editionసంపన్నులకు రాయితీలు!
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)