test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెట్రో మంట

27 మే, 2026

petrol fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 05:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పది రోజుల్లో నాలుగుసార్లు పెట్రో ధరల పెంపు ద్వారా సామాన్యుడి జీవితాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేయడం ఆందోళనకరం. పొదుపు చర్యల పేరుతో ప్రధాని సుద్దులు చెప్పిన కొద్ది రోజులకే లీటర్ పెట్రోలు, డీజిల్ పై దాదాపు ఎనిమిది రూపాయలు పెంచడం ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోయడమే. లీటర్ పై రూ.30 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యం కాదంటూ నిపుణుల పేరుతో కేంద్రం చేయిస్తున్న లీకులు… సామాన్యుడి బతుకును ఛిద్రం చేసేవే. పెట్రోలు, డీజిల్, సిఎన్ జి ధరలు పెరిగితే నిత్యావసర సరుకులతోపాటు ప్రయాణాలు ప్రియమవుతాయి. యావత్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఇప్పటికే ఆదాయాలు క్షీణిస్తున్న నేపథ్యంలో సామాన్యుల కష్టాలు మరింత పెరుగుతాయి. అయినా పాలకులు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. దశల వారీగా ధరలు పెంచుతున్నారు.
ఏకపక్షంగా ఇరాన్ పై యుద్ధం ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయిల్… పశ్చిమాసియాతోపాటు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసింది. 90 శాతం ఇంధన దిగుమతులపై ఆధారపడిన, ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి చేసుకునే దేశం భారత్. ఇందుకు అనుగుణంగా కేంద్రంలోని పాలకులు ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారా అంటే అదీ లేదు. చైనా లాంటి దేశాలు భారీగా చమురును నిలువ చేసుకోగా, మోడీ సర్కారు రష్యా నుంచి చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రాసెసింగ్ చేసి, ఇతర దేశాలకు అమ్ముకునే కార్పొరేట్లకు వంతపాడటం మినహా చేసిందేమీ లేదు. గోదావరి బేసిన్ లోని చమురు నిక్షేపాలను రిలయన్స్ కు కట్టబెట్టారు. అందులో రాయల్టీగా మన రాష్ట్రానికి రావాల్సిన సగం వాటా అడిగే ధైర్యం కూడా టిడిపి, జనసేన పార్టీలకు లేకపోవడం గమనార్హం. కృష్ణా జిల్లా పామర్రులోని నిక్షేపాలు వేదాంతకు కట్టబెట్టేందుకు కసరత్తు జరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దశాబ్దాల అనుభవం ఉన్న ఒఎన్ జిసి లాంటి సంస్థను పక్కనపెట్టి, తమిళనాట రక్తపాతం సృష్టించిన కంపెనీని ఎంపిక చేయడం ఎవరి ప్రయోజనాల కోసమో అందరికీ తెలిసిందే. ఒక నెల… మరో నెల… అంటూ అమెరికా బిచ్చమేసినట్లు అనుమతిస్తే… రష్యా నుంచి చేసిన కొనుగోళ్లను తాజా ఆంక్షలతో కేంద్రం నిలిపివేయడం ఆందోళనకరం. చౌకగా వస్తున్న రష్యా, ఇరాన్ చమురును కొనుగోలు చేయకుండా, అమెరికా, వెనిజులాల నుంచి దిగుమతి చేసుకోవడం స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకాలివ్వడమే.
పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 74 రోజులు గడిచే వరకూ మన దేశంలో ఇంధన ధరలు పెరగకపోవడానికి ఐదు అసెంబ్లీల ఎన్నికలు కారణం. ఎన్నికల తరువాత ధరలు పెంచేస్తారని ప్రతిపక్షాలు చేసిన ప్రచారం నిజమని తాజాగా రుజువయింది. 2024 ఎన్నికల ముందు రూ.2 తగ్గించడం, ఈ ఏడాది ఐదు అసెంబ్లీల ఎన్నికల ముందు రూ.10 పన్నులను ఉపసంహరించుకుని చమురు కంపెనీలకు ఇస్తున్నట్లు ప్రకటించడం మోడీ సర్కారు ప్రజలను మోసగించే చర్యలే. ఉపసంహరించుకున్న రూ.10 కంపెనీలకు తగ్గించారే తప్ప నేరుగా కొనుగోలుదారులకు ఎటువంటి ప్రయోజనం కలిగించలేదు. తాజాగా మనదేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఇంధన భద్రతకు భరోసా ఇస్తామని, ఎంత కొనుక్కుంటే అంత అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఆ దేశం నిర్వాకం వల్లే దేశంలో ఇంధన భద్రత ప్రమాదంలో పడిందన్నది అందరికీ తెలిసిందే. దేశంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంది. ఢిల్లీలో పెట్రోలు ధర రూ.99.51 ఉంటే రాష్ట్రంలో రూ.117.25 ఉంది. తాము అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఇకపై పన్నులు పెంచబోమని ప్రకటించడంతోపాటు ప్రస్తుత ధరలు తగ్గించేలా కేంద్రంపైనా, వ్యాట్ తగ్గించేలా రాష్ట్రంపైనా ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలే మార్గం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్