“అమ్మా… నాన్నా…
మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం నాకు లేదు.”
నాగ్‌పూర్‌లో ఆత్మహత్యకు ముందు 18 ఏళ్ల ఆకాంక్ష చతుర్వేది రాసిన ఈ వాక్యం నేటి భారత విద్యావ్యవస్థ వైఫల్యానికి అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్‌కు చెందిన ఆ యువతి డాక్టర్ కావాలనే కలతో నెలల తరబడి కష్టపడి మే 3వ తేదీన నీట్-2026 పరీక్ష రాసింది. పరీక్ష బాగా రాశానని, మంచి ర్యాంకు వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పరీక్ష రద్దు చేస్తున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ) మే 12న ప్రకటించగానే ఆమె ఆశల ప్రపంచం కుప్పకూలిపోయింది. జూన్ 3న వెలుగులోకి వచ్చిన ఆమె సూసైడ్ నోట్ దేశాన్ని కలచివేస్తోంది. వంటమనిషిగా పనిచేస్తున్న ఆమె తండ్రి కృష్ణకుమార్ చతుర్వేది మూడు సార్లు గుండెపోటుకు గురైనా, అప్పులు చేసి కూతురిని కోచింగ్‌కు పంపించాడు. కుటుంబం పెట్టుకున్న ఆశలు, తనపై ఉన్న బాధ్యత, మళ్లీ మొదటి నుంచి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేశాయి. చివరకు ప్రాణాలు తీసుకునేలా చేశాయి.
నీట్ పరీక్ష ఒత్తిడి, పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల జాబితా ఆందోళన కలిగిస్తోంది. నీట్ పరీక్ష రద్దు తరువాత రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల ప్రదీప్ మేఘ్వాల్, బిహార్‌కు చెందిన శృతి కుమారి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రితిక్ మిశ్రా, ఢిల్లీలోని అన్షికా పాండే వంటి విద్యార్థుల బలవన్మరణాలు కూడా ఇదే ఆవేదనను ప్రతిబింబిస్తున్నాయి. ఒక విశ్లేషణ ప్రకారం… గత ఐదేళ్లలో నీట్ ఒత్తిడిని తట్టుకోలేక 93 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 2025లో అత్యధిక మరణాలు నమోదవగా, 2026లో ఇప్పటివరకు 14 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇవి వ్యక్తిగత విషాదాలు కావు; మన విద్యా వ్యవస్థ సృష్టిస్తున్న సామాజిక సంక్షోభానికి సంకేతాలు. ఏటా 22.8 లక్షల మంది విద్యార్థులు వైద్య విద్య కోసం పోటీ పడుతుంటే, అందుబాటులో ఉన్న సీట్లు 59,416 మాత్రమే! అంటే ప్రతి 38 మందిలో ఒకరికే అవకాశం దక్కుతోంది.
2016లో నీట్‌ను ప్రవేశపెట్టినప్పుడు పారదర్శకత, సమాన అవకాశాలు, అవినీతి నిరోధం లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ వాస్తవం భిన్నంగా ఉంది. ప్రశ్నాపత్రాల లీకులు, అవకతవకలు, ఫలితాల వివాదాలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 2024లో ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఏడాది అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు, ఏఐ నిఘా, 5జీ జామర్లు ఉన్నప్పటికీ ప్రశ్నాపత్రం అక్రమార్కుల చేతికి చేరింది. పరీక్ష రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడీ ప్రభుత్వ పాలనాకాలంలో ఇప్పటివరకూ 79 పరీక్షల పత్రాలు లీకైనట్టు వస్తున్న వార్తలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన పరీక్షలను కూడా విశ్వసనీయంగా నిర్వహించలేకపోవడం కేంద్ర విద్యా యంత్రాంగ వైఫల్యానికి నిదర్శనం. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పరీక్షల మూల్యాంకనంపై కూడా ఈ ఏడాది తీవ్ర విమర్శలు వచ్చాయి. లక్షలాది మంది విద్యార్థులు రీ-వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం, మూల్యాంకన వ్యత్యాసాలపై ఆరోపణలు రావడం, డేటా భద్రతపై సందేహాలు తలెత్తడం ఆందోళనకరం. దేశంలో అత్యంత కీలకమైన పరీక్షా వ్యవస్థలు నీట్, సీబీఎస్‌ఈ రెండింటిలోనూ ఇంతటి వివాదాలు చోటుచేసుకోవడం మోడీ ప్రభుత్వ వైఫల్యానికి సంకేతం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యం.వైద్య విద్య ప్రవేశపరీక్షను రాష్ట్రాల నుంచి తప్పించి జాతీయ పరీక్షగా నిర్వహించడంపైనా విమర్శలు ఉన్నాయి. రాష్ట్రాల విద్యా వాస్తవాలు, ప్రాంతీయ అసమానతలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే పరీక్షతో అందరినీ కొలవడం సరైంది కాదు. ప్రస్తుతం ఉన్న కేంద్రీకృత విధానం విద్యార్థులను కోచింగ్ పరిశ్రమపై ఆధారపడేలా చేస్తోంది. విద్య జ్ఞాన సాధన ప్రక్రియ కాకుండా ర్యాంకుల వేటగా మారిపోయింది! ధనిక కుటుంబాల పిల్లలకు ఖరీదైన కోచింగ్ అందుబాటులో ఉండగా, సామాన్య కుటుంబాల ప్రతిభావంతుల పిల్లలు ప్రారంభం నుంచే అసమాన పోటీలోకి నెట్టబడుతున్నారు. ఈ విధానం మారాలి. పాఠశాల విద్యలో సాధించిన ప్రతిభ, ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఇతర అర్హతలను సమన్వయం చేసే విధానాలను పరిశీలించాలి. వైద్య విద్యా సీట్ల సంఖ్యను పెంచాలి. విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ప్రత్యేక సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. విద్యను వ్యాపారంగా మార్చిన కోచింగ్ సంస్కృతిని నియంత్రించాలి. పరీక్షను ఎదుర్కొనే ధైర్యాన్ని చంపేయడం కాదు; సవాళ్లను ఎదుర్కొనే సత్తాను ఇవ్వడం విద్యావ్యవస్థ లక్ష్యంగానూ, లక్షణంగానూ ఉండాలి. ఒత్తిడితో నలగని విద్యార్థులను దేశానికి అందివ్వాలి.
Print Editionఒక పరీక్ష… లక్షల జీవితాలు!
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 05, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)