test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకనీస వేతనాలు!

23 మే, 2026

workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 23, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్హణీయం. ఉమ్మడి రాష్ట్రం లో ప్రకటించిన పధ్నాలుగు సంవత్సరాల తరువాత ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడీ ప్రకటన వెలువరించింది. తెలంగాణలోని ఒక కోటి పదకొండు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది కనుక ఈ నిర్ణయం విస్తృత ప్రభావం వేస్తుంది. కనీస వేతనం పెంచుతూ ప్రకటించడం బాగానేవుంది కానీ ఆ పెంపుదల శాస్త్రీయంగా లేదన్నది వాస్తవం. ఈ పధ్నాలుగేళ్లలో పెరిగిన ధరలతో పోల్చితే ఈ పెంపుదల స్వల్పమే! కనీస వేతనాలను రాష్ట్రంలో 3 జోన్లుగా, వేతనాలను 4 క్యాటగిరీలుగా విభజించి ప్రకటించారు. అందులోనూ శాస్త్రీయత కొరవడింది. ఆయా జోన్లలో అన్ని రంగాల్లో ఒకే రీతిలో పెంచడం వల్ల గతంలో ఎంప్లాయ్‌మెంట్‌‌లో వివిధ రకాల పనులకు ఆయా రకాలుగా ఉన్న పద్ధతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువుభత్యం గురించి ప్రస్తావించకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన వేతనాలు కూడా 4 క్యాటగిరీల్లో ఒక్క అన్‌‌స్కిల్డ్‌ ‌వర్కర్లకు తప్ప మి‌గతా వారికి బేసిక్ కరువుభత్యం కలుపుకుని ఇప్పటికే వస్తున్న జీతానికి, పెరిగిన దానికి పెద్ద తేడా ఏమీ లేకపోవడం గమనార్హం. తెలంగాణ కాంట్రాక్టు లేబర్ జీవో నెం 11 ప్రకారం ఇప్పటికే కార్మికులు రూ.13,098 నుంచి రూ. 23,683 వరకు వేతనాలు పొందుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం పెంచింది పెద్దగా ఏమీ లేదు కదా! తెలంగాణ జీవో 4లో స్కిల్డ్ కార్మికుడికి వేతనం రూ.19,572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం రూ.18,500 మాత్రమే! గతంతో పోలిస్తే రూ.1072 తగ్గింది. ఇప్పటి వరకు అనుసరించాల్సిన ఏ ప్రామాణికాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని కార్మిక సంఘాలు చేస్తున్న విమర్శ సత్య దూరం కాదు. పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ ఆక్ర్టాయ్‌ ఫార్ములా, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వేతనాలు లెక్కిస్తే రూ.32 వేలు వస్తుంది. అయినప్పటికీ కార్మిక సంఘాలు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని ​తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను సవరించాలి.
​ పొరుగు రాష్ట్రం చేసింది చూసి అయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు వెంటనే ప్రకటించడం కనీస ధర్మం. ఇక్కడ 72 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో 50 లక్షల మందికి పైగా కార్మికులకు ఈ కనీస వేతనాలు వర్తిస్తాయి. ఉమ్మడి రాష్ట్రం లో ప్రకటించినదే తప్ప ఇక్కడ టిడిపి లేదా వైసిపి పాలకులు ఏనాడూ వాటిని పట్టించుకోలేదు. టిడిపి కూటమి సర్కారు ఇప్పుడైనా మేలుకోవడం అవసరం. ఇప్పటికే అన్ని నిత్యావసర సరుకులతో పాటు ధరలన్నీ పెరిగి కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయి. వాస్తవ పరిస్థితి గుర్తించి వెంటనే కనీస వేతనాలు పెంచాలి. దేశ రాజధాని ప్రాంతం లోని నోయిడా పారిశ్రామిక కార్మికుల ఆందోళన గురించి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కనీస వేతన పెంపు ప్రకటన ఆవశ్యకత ఏమిటో పాలకులకు బోధపడుతుంది. అంతేగాక పొరుగున వున్న హర్యానా సర్కారు వేతన పెంపు ప్రకటన వెల్లడించాక ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం బండ రాయిలా మిన్నకుండడం కడుపు మండి వున్న కార్మికుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకున్న తీరు జ్ఞప్తికి తెచ్చుకుంటే సర్కారు పెద్దల్లో కదలిక వస్తుంది. ఈ రెండు నెలల్లో యుద్ధం పేరిట భారాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యాన్ని పరిగణన లోకి తీసుకోవడంతో పాటు పొరుగు రాష్ట్రం ప్రకటించిన దాంట్లోని లోపాలను సవరించి తాజాగా కనీస వేతనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. ఆలస్యం అనర్ధ దాయకం అని గుర్తెరగాలి. లేనిపక్షంలో కార్మికుల ఆందోళనలకు లేదా వ్యక్తమయ్యే ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిరంతరం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదా పెట్టుబడుల ఆకర్షణ జపం చేస్తూ కార్పొరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పాలకులు శ్రమ జీవుల గురించి కొద్దిగానైనా పట్టించుకోరా? వెంటనే కనీస వేతన పెంపు ప్రకటన చేసి విజ్ఞత ప్రదర్శించండి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్