test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైద్యం హక్కా? వ్యాపారమా?

01 జూన్, 2026

Is Healthcare a Right or a Business?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 12:49 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

‘ఒక దేశం గొప్పదనాన్ని అంచనా వేయాలంటే అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితిని చూడాలి` అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రాక్ చిషోల్మ్ అంటారు. ఈ వ్యాఖ్య నేటి భారతదేశ పరిస్థితికి అద్దం పడుతుంది.  ఆరోగ్యమే మహాభాగ్యం  అన్నది పెద్దలు చెప్పిన మాట.  నేడు సంపూర్ణ ఆరోగ్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వుండవు. తగినంత మంది వైద్యులు  వుండరు.  పరికరాలు, తగిన వసతులూ అందుబాటులో వుండవు.  గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా వసతులు వుండవు.  ఫలితంగా ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీయాల్సి వస్తోంది.  ‘వైద్యో నారాయణ` అంటారు గానీ,  ఇక్కడి వైద్యం ఒక సేవగా కాకుండా వ్యాపారంగా మారడంతో…  సామాన్యుడి జీవితం దుర్భరమవుతోంది.   అనారోగ్యం ఒక మనిషిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, కొన్నిసార్లు వారి భవిష్యత్తును కూడా అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది.  ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు విద్య, వైద్యాన్ని ప్రాథమిక హక్కులుగా గుర్తించి, ఉచితంగా లేదా అత్యల్ప ఖర్చుతో అందిస్తున్నాయి.  కానీ మన దేశంలో మాత్రం కార్పొరేట్ ఆసుపత్రుల ఆకాశహర్మ్యాలు పెరుగుతున్న కొద్దీ పేదల గుండెల్లో భయం కూడా పెరుగుతోంది.  అనారోగ్యం సంభవిస్తే ప్రాణం పోతుందో,  ఆస్తి పోతుందో తెలియని పరిస్థితి.

దేశంలో సామాన్యుడికి వైద్యం మరింత భారంగా మారిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘నేషనల్ హెల్త్ అకౌంట్స్ నివేదిక` స్పష్టంగా చెబుతోంది.  ప్రజలు తమ ఆరోగ్య అవసరాల కోసం సొంత జేబు నుంచి చేసే ఖర్చు 2021-22 నాటికి 39.4 శాతం వుండగా,  2022-23 నాటికి 43.4 శాతానికి పెరిగింది. ఇది కేవలం నివేదిక చెప్పిన గణాంకాలు కాదు.   లక్షలాది కుటుంబాల కన్నీటి కథలు.  కుటుంబంలో ఒకరికి అనారోగ్యం వస్తే- చేతిలో డబ్బులేకపోతే… బంగారం అమ్ముకోవడం, భూమి తాకట్టు పెట్టడం, అప్పుల కోసం గడపగడప తిరగడం వంటి దుస్థితులకు ఈ నివేదికే సాక్ష్యం.  కోవిడ్ మహమ్మారి మనకు ఒక గొప్ప పాఠం నేర్పింది.  బలమైన ప్రభుత్వ వైద్య వ్యవస్థ లేకుండా ఏ దేశమూ సురక్షితంగా ఉండలేదని ప్రపంచం గుర్తించింది.  కానీ కరోనా తర్వాత ప్రజారోగ్య రంగానికి నిధులు తగ్గించడం దూరదృష్టి లోపించడమే.  రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు ఎంత ముఖ్యమైనవో, ప్రజల ఆరోగ్యం అంతకంటే ముఖ్యమైనది. ఆరోగ్యవంతమైన ప్రజలే దేశానికి అసలైన సంపద.  అయితే, కేంద్రప్రభుత్వం ప్రజా వైద్యాన్ని  క్రమంగా గాలికొదిలేయడంతో ప్రజలపై అదనపు భారం పడింది.  దీంతో దేశ మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రజలు తమ సొంత నగదును  అప్పు చేసైనా ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది._ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రులు వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం, లేదా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యల వల్ల పేదలకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరడం లేదు. _

వైద్యం ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడే సంక్షేమ పథకం కాదు; ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు.   ప్రజల ఆరోగ్యాన్ని కార్పొరేట్లకు అప్పగించిన పాలకులు, ఎంత గొప్ప అభివృద్ధి కథలు చెప్పుకున్నా… అది అసంపూర్ణమే.  దేశ భవిష్యత్తు కాంక్రీట్ నిర్మాణాల్లో కాదు, ఆరోగ్యవంతమైన పౌరులలో ఉంటుంది. బడ్జెట్‌లో వైద్యానికి ఖర్చు పెట్టడం వ్యయం కాదు; అది భవిష్యత్తుపై పెట్టుబడి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలేని అభివృద్ధి, అభివృద్ధే కాదు. గర్భిణీలను డోలీల్లో మోసుకుంటూ వాగులు దాటి ఆసుపత్రులకు తీసుకెళ్లాల్సిన దుస్థితి నేటికీ కొనసాగుతుందంటే, అది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు;  ప్రజల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం.   అంతేకాదు, వైద్య విద్య సైతం పేదలకు అందుబాటులోకి రావాలి.  గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందాలి.  ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయంగా నిలబడాలి.  నేడు దేశం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే — వైద్యం హక్కా? వ్యాపారమా? అని. ఈ ప్రశ్నకు పాలకులు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది. ప్రజల జేబులు కాదు, ప్రభుత్వ విధానాలే ఆరోగ్య భారాన్ని మోయాలి. అదే నిజమైన సంక్షేమ రాజ్యం. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనుకునే జనం…  ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’  అనే పరిస్థితి రావాలి. అదే ప్రజాస్వామ్యానికి ప్రాణం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్