పితృస్వామ్య సమాజంలో శతాబ్దాలుగా మహిళల పాత్రను కేవలం వంటింటికీ, పిల్లల్ని కనడానికే పరిమితం చేస్తూ వచ్చారు. మహిళల పునరుత్పత్తి హక్కులు, పితృస్వామ్య సమాజంలో గర్భంపై, స్వేచ్ఛపై జరిగే రాజకీయాలను తట్టుకుని, పోరాడుతూనే వున్నారు. అంతరిక్ష పరిశోధనల నుండి దేశ రక్షణ రంగం వరకు మహిళలు తమ సత్తా చాటుతూనే వున్నారు. జనాభా సమతుల్యత పేరిట మహిళల గర్భాన్ని ఒక సాధనంగా మార్చాలనుకోవడం కొత్త ఆలోచనేమీ కాదు. శతాబ్దాలుగా పితృస్వామ్య సమాజం, వ్యవస్థలు స్త్రీ శరీరాన్ని, ఆమె పునరుత్పత్తి శక్తినీ తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ‘సమాజం, కుటుంబం కలిసి ఒక స్త్రీ గర్భాన్ని ఎలా నియంత్రిస్తాయో, ఆమె ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా సంతానం కోసం ఎలా ఒత్తిడి తెస్తాయో ‘గర్భగుడి` కథలో చిత్రిస్తారు రచయిత్రి పి.సత్యవతి. ‘స్త్రీ శరీరం కేవలం వంశాన్ని ఉద్ధరించే ‘గుడి’ కాదు, అది ఆమె ప్రాణమని` చాటిచెపుతారు. ‘జనాభా క్షీణించిపోతున్న ఒక ఊహాజనిత సమాజంలో, పాలకులు అధికారాన్ని చేజిక్కించుకుని, పిల్లల్ని కనగలిగే సత్తా ఉన్న మహిళలను కేవలం ‘సంతానోత్పత్తి యంత్రాలు (హ్యాండ్ మెయిడ్స్)` గా మార్చేస్తారు. వారికి చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, కనీసం సొంతగా పేరు పెట్టుకునే హక్కు కూడా ఉండని ఒక సందర్భాన్ని ‘హ్యాండ్ మెయిడ్స్ టేల్` అనే నవలలో మార్గరెట్ అట్‌వుడ్ చిత్రిస్తారు. ఇదే నవలలో ‘నా శరీరం నా ఆధీనంలో లేనప్పుడు, నేను స్వతంత్రురాలినని ఎలా చెప్పుకోగలను?` అంటారు రచయిత్రి.
తాజాగా ఇలాంటి సందర్భమే ఆంధ్రప్రదేశ్ మహిళలకూ ఎదురైంది. ‘మహిళలు సృష్టికర్తలు, పిల్లల్ని భారంగా భావించొద్దు. పిల్లలే మన సంపద. ఎంత మందికి వీలైతే అంతమందిని కనండి. మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే…రూ.40 వేలు పురిటి మంచంపైనే అందజేస్తాం` అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త నినాదం అందుకున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకే అష్టకష్టాలు పడుతుంటే… ముగ్గురు, నలుగురిని కనాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మంది పిల్లలను కనాలని.. పిల్లల బాగోగులు తానే చూస్తానని చెప్పడం నిజంగానే విడ్డూరం. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతుందని, ప్రతి ప్రసవం తల్లికి పునర్జన్మ అన్న విషయం తెలియనట్లే నటించడం పట్ల నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది వున్నా… వారందరికీ ప్రతి ఏడాది తలో రూ.15 వేలు ఇస్తామని సూపర్ సిక్స్ లో చెప్పినది రెండేళ్లవుతున్నా… అమలు అంతంత మాత్రంగా వుంది. ఇప్పుడు మాత్రం ఆదాయం పెరుగుతోంది, జనాభా తగ్గుతోందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దీనిపై మహిళా సంఘాలు, అభ్యుదయవాదులు మండిపడుతున్నారు. ‘మహిళల జీవితం కేవలం పిల్లల కోసమేనా? వారి ఉద్యోగాలు, కలల మాటేమిటి? పిల్లల్ని కనడం అనేది పూర్తిగా మహిళల సొంత నిర్ణయం. వారి వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? తల్లి గర్భంపై కూడా రాజకీయమా?` అంటూ భారత మొదటి ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ, ఐద్వా సీనియర్ నేత బృందాకరత్ వంటి వారు అనేక మంది పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రభుత్వాలు చేయాల్సింది జనాభాను పెంచమని పిలుపులు ఇవ్వడం కాదు; ఉన్న జనాభాకు ఉపాధి కల్పించడం, మహిళలకు భద్రతను పెంచడం, వారి చదువులకు, ఉద్యోగాలకు భరోసానివ్వడం. మహిళ సాధికారత సాధించినప్పుడే నిజమైన సమాజ వికాసం సాధ్యమవుతుంది. ‘స్త్రీ తన శరీరంపై, తన ప్రాణంపై పూర్తి హక్కును కలిగి ఉండనంత కాలం ఈ సమాజానికి స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత లేదు` అంటాడు చలం ‘మైదానం’ నవలలో. బిజెపికి ఊతమివ్వాలనో, రాజకీయ ప్రయోజనాల కోసమో… గర్భగుడి వంటి మహిళల గర్భాన్ని అస్త్రంగా వాడుకోవాలనుకునే కుటిలనీతిని సాగనివ్వకూడదు. ‘స్త్రీ శరీరం ఒక ప్రయోగశాల కాదు, పాలకుల జనాభా లెక్కలను సరిచేసే వేదిక అసలే కాదు.’ చైతన్యంతోనే మహిళలు తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గళం విప్పాల్సిన అవసరం ఉంది.








కామెంట్‌లు (0)