test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమరో ఆర్థిక అరాచకం

2 రోజుల క్రితం

article-on-exports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 06, 2026, 07:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆర్థిక కుంభకోణాలు ఎంత చాకచక్యంగా చక్కబెట్టవచ్చో ‘లక్కీ భాస్కర్‌’ మూవీలో చూపించారు. 1980లనాటి షేర్ల స్కామ్‌‌ కింగ్‌ పిన్‌‌ బిగ్‌‌బుల్‌‌ హర్షద్‌ ‌మెహతా జీవితం ఈ సినిమాకు కథా వస్తువు. వ్యవస్థలోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకొంటున్న పలువురు భారీ అక్రమాలకు బరితెగిస్తున్నారు. వారి చేతుల్లో ఎంతోమంది అమాయకులు మోసపోతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ప్రముఖ బంగారం, ఆభరణాల దిగ్గజం రాజేష్‌ ఎక్స్‌‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఇఎల్‌) ‌భారీ ఆర్థిక అరాచకం దేశంలోనే కాదు అంతర్జాతీయ కార్పొరేట్‌ ‌రంగాన్ని షేక్‌ ‌చేస్తోంది. తన వాస్తవ ఆదాయాన్ని రూ.15.15 లక్షల కోట్లు అధికంగా చూపించి, తన షేర్‌ ‌వాల్యూను భారీగా పెంచుకొని, మదుపరులను, అలాగే ప్రభుత్వ వ్యవస్థలను మోసగించినట్లు ప్రాథమికంగా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని సెక్యూర్టీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ ‌బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబి) స్వయంగా 109 పేజీల నివేదికతో గురువారం బహిర్గతం చేసింది. ఆర్‌ఇఎల్‌ ‌కంపెనీ ప్రమోటర్‌, ప్రస్తుత ఛైర్మన్‌ అండ్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌అయిన రాజేష్‌ ‌మెహతాను సెక్యూర్టీస్‌ ‌మార్కెట్‌ ‌నుంచి తాత్కాలికంగా నిషేధించింది. ఆర్‌ఇఎల్‌ అక్రమాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలుకానీ, నిఘా విభాగాలు కానీ గుర్తించలేదు. ఒక సాధారణ ఇన్వెష్టర్‌ 2025లో ఇ-మెయిల్‌‌లో చేసిన ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలింది. సెబి రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టినా, కంపెనీకి సంబంధించిన ఆడిట్‌ ‌రిపోర్టులను చూపించమని పలు మార్లు నోటీసులిచ్చినా ఆర్‌ఇఎల్‌ ‌యాజమాన్యం సహకరించలేదు. అందుకే సెబి ఆ సంస్థ స్కాంపై నివేదిక వెల్లడించాల్సి వచ్చింది.
కార్పొరేట్‌ ‌స్కాంలన్నింటిలో దండలో దారంలో కనిపించేది విదేశాల్లో ఆ సంస్థలు ఏర్పాటు చేసే అనుబంధ షెల్‌, సూట్‌‌కేస్‌ కంపెనీలు, వాటి ద్వారా ఈ దేశంలో అక్రమాలు. ఆర్‌ఇఎల్‌ ‌కూడా అదే చేసింది. సిట్జర్లాండ్‌ ‌నుంచి కథ నడిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్‌ ‌రిఫయినరీ ‘వాల్కంబీ’ని 2015లో కొనుగోలు చేసింది. సంస్థ ఆదాయాన్ని రూ.వందల కోట్లను వేలు లక్షల కోట్లుగా తప్పుడు పద్ధతుల్లో చూపించింది. సంస్థ సి.ఎం.డి. రాజేష్‌ ‌మెహతా తన వ్యక్తిగత ఖాతాలకు సంస్థ నిధులను భారీగా నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారు. సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న మరి కొంత మంది సైతం ఇదే పని చేశారు. ఈ కఠోర విషయాలను సెబినే వెల్లడించింది. కంపెనీ కార్పొరేట్‌ ‌గవర్నెన్స్‌ ‌లోపభూయిష్టంగా ఉందని ఇప్పుడు గుర్తించడం ప్రభుత్వ వ్యవస్థల పనితీరులో డొల్లతనానికి నిదర్శనం.
ఆర్‌ఇఎల్‌ ‌స్కాం దేశ కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా చెబుతున్నారు. ఇలాంటి స్కామే 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో సత్యం కంపెనీలో జరిగింది. రూ.7,800 కోట్ల మేర కంపెనీ బ్యాలెన్స్‌‌షీట్‌‌లో తేడా వచ్చింది. ఎక్కువ ఆదాయం చూపించి సత్యం కంపెనీ షేర్‌ ‌విలువను పెంచుకుందని ఆరోపణలొచ్చాయి. ఈ కేసులో సత్యం కంపెనీ అధినేత రామలింగరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అమెరికాకు చెందిన హిండెన్‌‌బర్గ్‌ ‌రిసెర్చ్‌ సంస్థ అదానీ కంపెనీ ఆర్థిక మోసాలను ఆధారాలతో సహా 2003 జనవరిలో బయటపెట్టడం పెను సంచలనం అయింది. ఆదానీ గ్రూపు తమ షేర్‌ ‌విలువను పెంచుకునేందుకు గ్రూపు ఆదాయాన్ని అధికంగా చూపించడంతోపాటు పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న‌ది ప్రధాన అభియోగం. దాంతో అదానీ ఆర్థిక సామ్రాజ్యం రూ.లక్షల కోట్ల మేర పతనమైంది. తూతూ మంత్రంగా సెబి దర్యాప్తు సాగింది. చివరికి అదానీ గ్రూపుపై ‘హిండెన్‌‌బర్గ్‌’వి ఆధారాల్లేని ఆరోపణలుగా కొట్టిపారేసింది. మోడీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి భారత్‌‌పై వాణిజ్య దాడిగా కుహనా జాతీయవాదాన్ని లేపి అదానీపై ఈగ వాలకుండా చూసుకుంది. నయా-ఉదారవాద ఆర్థిక విధానాలే ఆర్థిక స్కాంలకు మూలం. ఆ విధానాలను మోడీ ప్రభుత్వం దూకుడుగా అమలు చేస్తుంది. స్కాంలు అనివార్యం. ‘లక్కీ భాస్కర్లు’ పుట్టుకొస్తూనే ఉంటారు. నష్టపోయేది సామాన్య ప్రజలే! అప్రమత్తం వహించాల్సింది ప్రజలే!!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్