సినిమా గురించి మాట్లాడితే మనకు ముందుగా గుర్తొచ్చేది భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, పాటలు, పోరాటాలు, వందల కోట్ల వసూళ్లు. అయితే భారతీయ సినిమాకు మరో ముఖం కూడా ఉంది. అది సమాంతర సినిమా. ఈ సినిమాలు ప్రేక్షకులను కేవలం వినోదపరచడానికే కాకుండా ఆలోచింపజేయడానికి ప్రయత్నిస్తాయి. మనుషుల జీవితాలను, సామాజిక సమస్యలను, అన్యాయాలను, కుటుంబ సంబంధాలను, రాజకీయాలను, గ్రామీణ జీవితాన్ని, సాధారణ ప్రజల అనుభవాలను కథలుగా చెబుతాయి. మన దేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి ప్రాంతాల్లో సమాంతర సినిమా కొత్త శక్తితో ముందుకు వచ్చింది. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా భారతీయ సినిమాకు కొత్త దిశను చూపించాయి.
కేరళలో కథే హీరో : భారతదేశంలో ప్రస్తుతం సమాంతర సినిమాకు కేంద్రంగా నిలిచింది కేరళ. అక్కడి చిత్ర పరిశ్రమలో కథకు, రచయితకు, దర్శకుడికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. హీరో కోసం కథను తయారు చేయరు. కథకు సరిపోయే నటుడిని ఎంచుకుంటారు. ఫహాద్ ఫాసిల్, దిలీష్ పోతన్, లిజో జోస్ పెల్లిశెరి, జియో బేబీ, మహేష్ నారాయణన్ వంటి దర్శకులు, నటులు కొత్త తరహా సినిమాలను రూపొందించారు. "కుంబళంగి నైట్స్", "జోజి", "ది గ్రేట్ ఇండియన్ కిచెన్", "జల్లికట్టు", "ఈ.మా.యౌ" వంటి చిత్రాలు కుటుంబ సంబంధాలు, పితృస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక ఒత్తిడులు వంటి అంశాలను ఎంతో సహజంగా చూపించాయి. ఈ సినిమాల్లో హీరో అజేయుడు కాదు. అతను కూడా మనలాగే బలహీనతలు కలిగిన మనిషే. అందుకే ప్రేక్షకులు ఆ పాత్రలతో సులభంగా అనుసంధానమవుతారు.
తమిళ పరిశ్రమలో ... : తమిళ చిత్ర పరిశ్రమలో కూడా గత దశాబ్ద కాలంగా సమాంతర సినిమా బలపడింది. వెట్రిమారన్, పా. రంజిత్, మారి సెల్వరాజ్ వంటి దర్శకులు ప్రధానంగా సామాజిక సమస్యలను తమ కథల కేంద్రంగా ఎంచుకున్నారు. "పరియేరుం పెరుమాళ్", "కర్ణన్", "విసారణై", "అసురన్" వంటి చిత్రాలు కుల వివక్ష, పోలీసు హింస, సామాజిక అసమానతలు, గ్రామీణ సంఘర్షణలను గట్టిగా ప్రశ్నించాయి. ఈ దర్శకులు సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే కాదని, సమాజంతో సంభాషించే సాధనమని నమ్ముతారు. అందుకే వారి చిత్రాల్లో వాస్తవ జీవితపు వాసన ఎక్కువగా కనిపిస్తుంది.
వాస్తవిక కథల ఉద్యమం : మరాఠీ చిత్ర పరిశ్రమ గత పదిహేను సంవత్సరాల్లో భారతదేశానికి అత్యుత్తమ సమాంతర చిత్రాలను అందించింది. నాగరాజ్ మంజులే, చైతన్య తమ్హానే వంటి దర్శకులు గ్రామీణ సమాజం, కుల వ్యవస్థ, న్యాయవ్యవస్థ, యువత సమస్యలను తెరపైకి తీసుకువచ్చారు. "ఫాండ్రీ", "సైరాట్", "కోర్ట్", "ది డిసైపుల్" వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. "సైరాట్" ఒక ప్రేమకథ అయినప్పటికీ, కులవ్యవస్థ ఎంత క్రూరంగా పనిచేస్తుందో చూపించింది. "కోర్ట్" సినిమా భారత న్యాయవ్యవస్థలోని సంక్లిష్టతలను అత్యంత సహజంగా ఆవిష్కరించింది. మరాఠీ సినిమాల్లో రచయితలు సమాజాన్ని లోతుగా పరిశీలించి కథలను నిర్మిస్తారు. అందుకే వాటికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
బెంగాల్ మేధో సంప్రదాయం : సత్యజిత్ రే, మృణాళ్ సేన్ వంటి మహానుభావులు నిర్మించిన సంప్రదాయం నేటికీ పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతోంది. అక్కడి దర్శకులు కుటుంబ సంబంధాలు, రాజకీయ మార్పులు, మానసిక సంఘర్షణలు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై దృష్టి పెడతారు. బెంగాలీ చిత్రసీమలో ఇప్పటికీ రచయితలకు, సాహిత్యానికి అత్యంత గౌరవం ఉంది. అందువల్ల అక్కడి సినిమాలు ఎక్కువగా ఆలోచనాత్మకంగా ఉంటాయి. వాణిజ్య విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకుండా కళాత్మక విలువలను కాపాడటానికి ప్రయత్నిస్తారు.
అస్సాంలోనూ... : అస్సాం చిత్ర పరిశ్రమ పరిమాణంలో చిన్నదే. కానీ కళాత్మకంగా ప్రయోగాలు చేస్తోంది. రీమా దాస్ వంటి దర్శకులు గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. "విలేజ్ రాక్‌స్టార్స్", "బుల్‌బుల్ క్యాన్ సింగ్" వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమాల్లో భారీ సెట్లు ఉండవు. పెద్ద స్టార్‌లు ఉండరు. కానీ జీవిత సత్యాలు ఉంటాయి. అందుకే అవి అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్‌లో భారీ వాణిజ్య చిత్రాలు ఒకపక్క సాగుతుండగా, అనురాగ్ కశ్యప్, నీరజ్ ఘయ్వాన్, పాయల్ కపాడియా వంటి దర్శకులు కొత్త కథలను చెబుతున్నారు. "మసాన్", "అగ్లీ", "గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్", "ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్" వంటి చిత్రాలు భారత సమాజంలోని విభిన్న కోణాలను చూపించాయి.
సమాంతర సినిమా దర్శకులు ఏ సినిమా తీస్తే ఎంత డబ్బు వస్తుంది అని ఆలోచించరు. "సమాజం గురించి ఏమి చెప్పాలి?" అని ఆలోచిస్తారు. అందుకే వారి సినిమాల్లో రైతులు కనిపిస్తారు. కార్మికులు కనిపిస్తారు. మహిళల అనుభవాలు కనిపిస్తాయి. కుల వివక్ష కనిపిస్తుంది. నిరుద్యోగ యువత కనిపిస్తుంది. చిన్న పట్టణాలు, గ్రామాలు కథానాయకులుగా మారుతాయి. వారు ప్రేక్షకుడిని కేవలం నవ్వించడం లేదా ఉత్కంఠపరచడం మాత్రమే కాదు. ఆలోచింపజేయాలని కూడా కోరుకుంటారు. ప్రధాన స్రవంతి సినిమాలు మనకు కలలను చూపిస్తాయి. సమాంతర సినిమాలు మన వాస్తవాలను చూపిస్తాయి. ప్రధాన సినిమాలు హీరోలను సృష్టిస్తాయి. సమాంతర సినిమాలు మనుషులను చూపిస్తాయి. సామాజిక చైతన్యాన్ని విస్తరించడంలో సమాంతర సినిమాల పాత్ర ఎంతో కీలకం, అవసరం.
తెలుగు సినిమా నేర్చుకోవాల్సిన పాఠాలు
తెలుగు చిత్ర పరిశ్రమ సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సమాంతర సినిమా విషయంలో తగినంత కృషి జరగటం లేదు. తెలుగు సినిమా ముందుగా రచయితకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కథను కేంద్రంగా ఉంచాలి. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పించాలి. చిన్న బడ్జెట్ చిత్రాలకు ప్రోత్సాహం అందించాలి. గ్రామీణ జీవితం, వ్యవసాయ సంక్షోభం, కుల సంబంధాలు, మహిళల అనుభవాలు, వలస కార్మికుల జీవితం, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై మరిన్ని కథలు రావాలి. "సి/ఓ కంచరపాలెం", "మల్లేశం", "బలగం" వంటి చిత్రాలు మంచి కథలకు ప్రేక్షకులు ఆదరణ ఇస్తారని ఇప్పటికే నిరూపించాయి.
ఒక దేశ సాంస్కృతిక గొప్పదనం భారీ బడ్జెట్లలోనూ, కోట్ల రూపాయల వసూళ్లలోనూ ఉండదు. సాధారణ మనుషుల జీవితాలను, వారి ఆశలను, బాధలను, పోరాటాలను నిజాయితీగా చెప్పగల సామర్థ్యంలో ఉంటుంది. సమాజం ఎదుర్కొంటున్న ప్రశ్నలను ముందుకు తీసుకురావడంలో, చర్చకు అవకాశం కల్పించడంలో ఉంటుంది. సమాంతర సినిమా ఆ బాధ్యతను నిర్వర్తిస్తోంది. తెలుగు సినిమా కూడా ఆ మార్గంలో మరింత ధైర్యంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
- శాంతిమిత్ర








కామెంట్‌లు (0)