test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘సర్‌’పై సుప్రీం తీర్పు ఆందోళనకరం

2 గంటల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) చేపట్టడం, దాని నిర్వహణలో ఎన్నికల సంఘం అధికారాలు, పాత్రపై గత నెల 27న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక ఆందోళనకరమైన ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ కేసు బీహార్‌లో ‘సర్‌’ అమలుకు సంబంధించినదే అయినప్పటికీ, కోర్టు పరిశీలించిన అంశాలు, చేసిన నిర్ధారణలు ఓటర్ల జాబితాలో చేరాలనుకునే పౌరుల హక్కుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన 124 పేజీల తీర్పులో పిటిషనర్లు ‘సర్‌’ కి వ్యతిరేకంగా లేవనెత్తిన అన్ని ముఖ్యమైన అంశాలను తడిమింది. కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా అంగీకరించలేదు. మరోవైపు, ఎన్నికల సంఘం వాదనలన్నింటినీ కోర్టు అంగీకరించి, సమర్థించింది.


​ ఓటర్ల జాబితా సవరణల పున:పరిశీలన
​ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు 2025లో అక్కడ ‘సర్‌’ ప్రారంభమైనప్పుడు, అంత అత్యవసరంగా సమగ్రమైన ప్రత్యేక సవరణ చేపట్టడం ఎంతవరకు సమంజసం అన్నదానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ‘సర్‌’ పూర్తి చేయడానికి ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉండటంతో పాటు, ఈ ప్రక్రియకు ఉన్న చట్టబద్ధత పైన కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి. ‘సర్‌’ అమలులో ఎన్నికల సంఘం చట్టబద్ధమైన నిబంధనలను ఎలా ఉల్లంఘించిందో వివరిస్తూ గతంలో అనేక కథనాలు వచ్చాయి. కాబట్టి, ఇ.సి.ఐ చర్యలను సమర్థిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, ఓటర్ల జాబితా తయారీ, సవరణలకు సంబంధించిన చట్టపరమైన, రాజ్యాంగపరమైన నిబంధనలను పున:పరిశీలించడం, సుప్రీం కోర్టు తీర్పును అంచనా వేయడం అవసరం.
దేశంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకే ఒక సాధారణ ఓటర్ల జాబితా ఉండాలని.... మతం, జాతి, కులం, లింగ భేదాల ఆధారంగా ఎవరినీ ఓటర్ల జాబితాలో చేర్చకుండా మినహాయించకూడదని రాజ్యాంగంలోని 325 వ అధికరణం స్పష్టం చేస్తోంది. లోక్‌సభ, విధానసభ ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధారంగా జరగాలని అధికరణం 326 స్పష్టం చేస్తుంది. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటరుగా నమోదయ్యే హక్కు ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా గానీ, చట్టపరంగా గానీ అనర్హులుగా నిర్ణయించబడితే తప్ప ఏ పౌరుడికీ ఓటు హక్కు నిరాకరించరాదని ఈ అధికరణం వివరిస్తుంది. ఓటర్ల జాబితాల తయారీతో సహా ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలపై చట్టాలు చేసే అధికారాన్ని 327వ అధికరణం పార్లమెంటుకు కట్టబెట్టింది. ఓటర్ల జాబితాల రూపకల్పన, ఎన్నికలను నిర్వహించే ప్రక్రియల అధికారాన్ని 324 వ అధికరణం ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. ఓటర్ల జాబితా తయారీ, సవరణ ప్రక్రియ ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నిబంధనలు-1960 ద్వారా నియంత్రించబడతాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 21 ఓటర్ల జాబితా రూపొందించడానికి, సవరణలు చేపట్టడానికి తగిన ప్రమాణాలను వివరిస్తుంది. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు లేదా అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు ముందు లేక ప్రతి ఉప ఎన్నికకు ముందైనా ఓటర్ల జాబితాను సవరించవచ్చని సెక్షన్ 21(2), (3) లోని (ఎ) ( i) ( ii) పేర్కొంటున్నాయి. ఏదైనా నియోజకవర్గంలో లేదా నియోజకవర్గంలోని కొంత భాగంలో గానీ ఎన్నికల సంఘం ఎప్పుడైనా ప్రత్యేక సవరణ చేయవచ్చని సెక్షన్ 21(3) పేర్కొంటుంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ లోని 25వ నిబంధన ప్రకారం, సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలకు ముందు జరిగే సవరణ స్థూలంగా గానీ, సమగ్రంగా గానీ ఉండవచ్చు. అయితే, సాధారణ ఎన్నికలకు ముందు చేపట్టే సవరణ స్థూలంగా మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే నిబంధనల ప్రకారం సమగ్ర సవరణ అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ.

చట్ర పరిధి
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ ‘సర్‌’ ఏ కేటగిరీ సవరణ కిందికి వస్తుంది? కోర్టు దీనిని సెక్షన్ 21(3) కిందకు వస్తుందని పేర్కొంది. అయితే, ఈ క్లాజ్ కేవలం 'ప్రత్యేక సవరణ' (స్పెషల్ రివిజన్)కు మాత్రమే అనుమతిస్తుంది కానీ సమగ్ర సవరణకు (ఇంటెన్సివ్ రివిజన్) కాదు. కానీ ‘సర్‌’ అనేది ప్రత్యేక, సమగ్ర సవరణలు రెండూ కలిసి ఉన్న ప్రక్రియ. రూల్ 25 ప్రకారం ఇంటెన్సివ్ రివిజన్ అనేది కేవలం సెక్షన్ 21(2) కింద మాత్రమే చేయాలి, 21(3) కింద కాదు. చట్టాన్ని నిశితంగా పరిశీలిస్తే, రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు లేనప్పుడు మాత్రమే ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాలని స్పష్టమవుతుంది. ఎన్నికలు దగ్గర పడినప్పుడు ఇంటెన్సివ్ రివిజన్ చట్టం ప్రకారం తలపెట్టకూడదు, ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇక సెక్షన్ 21(3) కింద ప్రత్యేక సవరణ విషయానికి వస్తే, ఇది ఒక నియోజకవర్గంలో లేదా దానిలోని ఒక భాగంలో మాత్రమే చేయాలి. కానీ మొత్తం రాష్ట్రంలో లేదా దేశంలో కాదు. తీర్పులో "ఏదైనా నియోజకవర్గం" అంటే "అన్ని" నియోజకవర్గాలు అని అర్ధం చెప్పడం సందర్భోచితంగా లేదు. "ఏదైనా" అనే పదం కొన్ని సందర్భాల్లో "అన్ని" అని అర్ధం ఇచ్చినప్పటికీ, ఇక్కడ దాని పక్కనే ఉన్న "లేదా నియోజకవర్గంలోని ఒక భాగం" అనే పదాలు అది ఒక నిర్దిష్ట నియోజకవర్గానికి మాత్రమే పరిమితమని స్పష్టం చేస్తున్నాయి. పొరుగు ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడం వంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడే ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేక సవరణ అవసరమవుతుంది.
బీహార్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈ ‘సర్‌’ నిర్వహించారు. సెక్షన్ 21(2)(ఎ) ప్రకారం ఎన్నికలకు ముందు కేవలం 'సమ్మరీ రివిజన్' మాత్రమే చేపట్టాలి. కానీ ఎన్నికల సంఘం చట్ట నిబంధనలను పక్కనబెట్టి 'ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్' (సర్‌) కు వెళ్ళింది. దీనివల్ల ఓటర్ల జాబితాల నుండి లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. వారికి ఇప్పటివరకు సరైన పరిష్కారం ఏదీ దొరకలేదు.


పౌరసత్వ సమస్య
ఈ తీర్పు పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలను నిర్ణయించే విషయంలో ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. పౌరసత్వాన్ని నిరూపించడానికి ఏ పత్రాలు అవసరమో నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. నిజానికి పౌరసత్వ చట్టాన్ని పర్యవేక్షించే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాత్రమే ఈ పత్రాలను నిర్ణయించాలి. ఎన్నికల సంఘం పాత్ర కేవలం పౌరసత్వ పత్రాలను ధృవీకరించడం వరకే పరిమితం.
కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఎన్నికల సంఘం స్వయంగా పత్రాల జాబితాను ప్రకటించి, వాటిని సమర్పించాలని ఓటర్లను కోరింది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారాలను ఎన్నికల సంఘం తన చేతుల్లోకి తీసుకోవడమే. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను పౌరసత్వ నిరూపణకు అవసరమైన పత్రాల జాబితాతో అఫిడవిట్ దాఖలు చేయమని కోరకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.
ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం కోసం పౌరసత్వ ప్రశ్నను నిర్ణయించే అధికారాన్ని సుప్రీం కోర్టు ఇప్పుడు ఎన్నికల సంఘానికి కట్టబెట్టింది. దీనివల్ల లక్షలాది మంది భారత పౌరుల భవిష్యత్తు ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ చేతుల్లోకి వెళ్ళింది. వారు తమ జీవిత కాలంలో మళ్లీ ఓటు వేయలేకపోవచ్చు. అలాగే పౌరసత్వ నిరాకరణ వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
​ చాలా ఏళ్లుగా ఎన్నికల సంఘం కృషిని కోర్టు ఎల్లప్పుడూ అభినందిస్తూనే వచ్చింది. కానీ ఈ ‘సర్‌’ తీర్పు గతంలోని ఓటర్ల జాబితాలో నిర్మాణాత్మక లోపాలు పేరుకుపోతూ వచ్చాయని నిర్ధారించినట్లయింది. అంటే ఈ తీర్పు గతంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా రూపకల్పనపై తీవ్రమైన విమర్శ చేసినట్లే కదా. 2025 నాటి ‘సర్‌’ని సమర్థించడం కోసం సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పులో ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు.


- వ్యాసకర్త : పి.డి.టి. ఆచారి, లోక్‌సభ పూర్వ ప్రధాన కార్యదర్శి
హిందూ’ దినపత్రిక సౌజన్యంతో

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్