test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్‌ ప్రైవేటీకరణ వేగవంతం

5 రోజుల క్రితం

electricity
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 06:15 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

జూన్‌ 1 నుండి ఎస్‌పిడిసిఎల్‌ పరిధిలో ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్‌ మీటర్లను ప్రీపెయిడ్‌ మీటర్లుగా మార్చి...ఇక నుండి ఏ ప్రభుత్వ ఆఫీసైనా 'ఈ' వ్యాలెట్‌ ద్వారా...తమకు అవసరమైన కరెంట్‌ యూనిట్లను రీ-చార్జ్‌ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే కాలంలో తీవ్ర అశాంతికి, సాంఘిక అసమానతలకు ఈ నిర్ణయం కారణమవుతుంది. అవి ఏమిటో కొన్నింటిని పరిశీలిద్దాం.

స్మార్ట్‌ మీటర్లు-ప్రభుత్వ వాదన
మామూలు మీటరు కంటే స్మార్ట్‌ మీటర్‌ మంచిదని నెలకు, వారానికి ప్రతి రోజు గంట గంటకు ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నారో ఎప్పటికప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా తెలుసుకుంటూ తద్వారా అనవసర వినియోగాన్ని నివారించుకొని ఆర్థికంగా లాభపడవచ్చని, స్మార్ట్‌ మీటర్‌ ఉండటం వల్ల ఎప్పుడైనా ఊరికిగాని, బయటకు గాను వెళ్ళినప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానే మీ ఇంట్లో మీటర్‌ ఆన్‌-ఆఫ్‌ చేసుకోవచ్చని చెప్పారు. విద్యుత్‌ వినియోగం, బిల్లింగ్‌ విషయాలలో పారదర్శకత కోసం స్మార్ట్‌ మీటర్‌ను ప్రీపెయిడ్‌ మీటర్‌గా మారుస్తున్నారు. ముందుగా ప్రభుత్వ ఆఫీసులు (కలెక్టర్‌, ఆర్డీఓ, ఎంఆర్‌ఓ, మున్సిపాల్టీ, హెడ్‌క్వార్టర్‌ వర్క్స్‌, వీధి లైట్లు, ప్రభుత్వ సంస్థలన్నింటికి) తరువాత పరిశ్రమలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌, చిన్న షాపుల క్యాటగిరీ 2 వారికి, అపార్ట్‌మెంట్లకు ఈ విధానం అమలు చేస్తామంటున్నారు.
ఏపి ట్రాన్స్‌కో, సిఎండి, ఎనర్జీ సెక్రటరీ ముగ్గురు డిస్కంల సిఎండీ లను పరుగు పందెం పెట్టించి ఎవరు ఎన్ని ఎక్కువ బిగిస్తే వారికి సర్కారు వారి పాట గోల్డ్‌ మెడల్‌ అన్నట్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి స్మార్ట్‌ మీటర్‌, సోలార్‌, (అదానీ, అంబానీ ప్రయోజనాల కోసం)ల జపం మినహా ఏమీ పట్టించుకున్న పాపాన పోలేదు. కాలం కలిసొచ్చి రాష్ట్రానికి చీఫ్‌ సెక్రటరీ అయినా సరే రాష్ట్రంలో ఇంకా ఏ పనీ లేనట్టు విద్యుత్‌ రంగంపై సమీక్షలపైనే కాలం కాస్తా కరిగిపోయింది. పాలక వర్గాలకు, కార్పొరేట్లకు 'పాడి ఆవు' లాంటిది విద్యుత్‌ రంగం. రిటైర్‌ అయిన తరువాత మరలా పై రెండు కీలక పదవులు వదులుకోకుండా పాలకులకు, కార్పొరేట్లకు వెలుగులు-ప్రజలకు, ఉద్యోగ, కార్మికులకు చీకట్లు పంచేదాకా వదిలేట్లు లేదు. జూన్‌ 1 నుండి రాష్ట్రంలో ప్రభుత్వ అన్ని శాఖలు విద్యుత్‌ సర్వీసులను ప్రీపెయిడ్‌ బిల్లింగ్‌ విధానం ద్వారానే కరెంట్‌ పొందాలని ఇకపై ఆయా ఆఫీసుల్లో ఉన్న అధికారులు 'ఈ' వాలెట్‌ ద్వారా మీటర్‌ను రీ-చార్జ్‌ చేసుకోవాలని ఎస్‌పిడిసిఎల్‌ 'చావు కబురు చల్లగా' ప్రకటించింది.

సాంఘిక అసమానతలకు, అశాంతికి దారి తీసే ప్రక్రియ
విద్యుత్‌ను ఎప్పుడూ వ్యాపార దృక్పథంతో చూడకూడదు. ప్రజా సంక్షేమం కోసం, ఉపాధి కల్పన, వెనుకబడిన ప్రాంతాలు, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేదిగా చూడాలి. ప్రభుత్వం, ప్రభుత్వ ఆఫీసులంటే ఎవరివి? ప్రజలు టాక్స్‌ల రూపంలో కట్టిన డబ్బుతో ప్రజలకు సేవలు అందిస్తాయి. వాటి నిర్వహణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాని ఆయా డిపార్ట్‌మెంట్లలో ప్రభుత్వ వేతనాలతో పనిచేసే అధికారులు మీటర్‌ రీ-చార్జ్‌ చేసుకొని ఆ ఆఫీసుకు విద్యుత్‌ పొందాలనే ప్రకటన, ఎస్‌పిడిసిఎల్‌ సిఎండి ఎలా ప్రకటించగలరు! వారికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? ఇటువంటి సున్నితమైన, సామాజికపరమైన సమస్యలపై ఆలోచించకుండా ప్రభుత్వం నుంచి స్పష్టమైన అధికార ప్రకటన రాకుండా ఎస్‌పిడిసిఎల్‌ అధికారులు ఎలా ప్రకటిస్తారు? ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్‌ రంగంతో సహా మున్సిపాల్టీలకు, ఆర్టీసికి ఆయా డిపార్ట్‌మెంట్లకు వందల కోట్లు బకాయిలుంది. ఉద్యోగులకు ఇంకా డి.ఎ బకాయిలు చెల్లించకుండా డిపార్ట్‌మెంట్లలో ఏ సెక్షన్‌కు ఆ సెక్షన్‌ విద్యుత్‌ కొనుగోలు చేసుకొని పౌర సేవలు అందించడం ఆచరణ సాధ్యమా? విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌ ఇటువంటి పర్యవసానాలు ఆలోచించకుండా తొందరపాటుగా, దుందుడుకుగా ప్రకటించడం ఎంత వరకు సరైంది? ఎస్‌పిడిసిఎల్‌ డిస్కం కంపెనీ రాజ్యాంగ అతీతమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కంపెనీనా!
సిఎండి ప్రభుత్వ శాఖలు బకాయిలున్నాయని తద్వారా కంపెనీ నష్టాల్లో నడుస్తుందని అందుకోసం ఈ రీ-చార్జ్‌ పద్ధతి ద్వారా డబ్బులు వస్తాయని ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అవి నడవటానికి కావాల్సిన డబ్బు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సింది ప్రభుత్వమే. కాని అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు, అధికారులకు సంబంధం ఏమిటి? కాని వాస్తవం ఏమిటంటే విద్యుత్‌ సంస్థను నష్టాల్లో నెడుతున్నది ఎక్కువ ధరకు యూనిట్లను కొనుగోలు చేస్తూ ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలతో చేసుకున్న 'పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు' కాదా? స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ఫారమ్‌లు తదితర మెటీరియల్‌ సప్లరు చేసే షిరిడీ కంపెనీకి ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చెయ్యడం ద్వారా ప్రైవేట్‌ కంపెనీలకు ప్రజల డబ్బు ధారాదత్తం చేసి ప్రభుత్వ శాఖలపై, ప్రజలపై ఆ నష్టాల భారం నెట్టడం ఎంత వరకు సబబు? ప్రైవేటీకరణ మంత్రం, చార్జీలు పెంచడం, ఉద్యోగుల, కార్మికుల బకాయిలు చెల్లించకపోవడం, వేతనాలు పెంచకపోవడం, వంటివి యాజమాన్యం చేయడం దుర్మార్గం కాదా?
అంతెందుకు, విద్యుత్‌ సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడంలేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఎ లు, సకాలంలో చెల్లించలేదు. పెన్షన్‌ సౌకర్యం ఎత్తేశారు. ఒకే పనిచేస్తున్న కార్మికులకు సమాన జీతం ఇవ్వకుండా తగ్గించి ఇస్తున్నారు. ఒక రెగ్యులర్‌ ఉద్యోగికి ఇచ్చే వేతనంలో ఐదుగురు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో పని చేయించుకొని ఆర్థికంగా సంస్థ లాభపడుతుంది. వారికి ఇవ్వాల్సిన నెల నెల ఇన్సెంటివ్‌లు, పెయిడ్‌ హాలిడేస్‌, రిస్క్‌ అలవెన్స్‌లు, పెట్రోల్‌ అలవెన్సులు వంటివి సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. మన విద్యుత్‌ రంగంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రభుత్వ శాఖల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, ప్రిన్సిపల్‌ సెక్రటరీల ఆఫీసులు, వారి క్వార్టర్లలో దుర్వినియోగం అవుతున్న విద్యుత్‌ మాటేమిటి? పాలకుల, ఉన్నతాధికారుల ఆఫీసులకు విద్యుత్‌ ఆపే ధైర్యం ఈ సిఎండీలకు ఉందా? వీటి బకాయిలు ప్రకటించి ప్రభుత్వం నుంచి వసూలు చేసే ధైర్యం ఉందా? అదేం లేకుండా పౌర సేవలందించే క్షేత్రస్థాయి ఆఫీసుల పైన, ప్రభుత్వ వేతనాలతో పని చేస్తున్న ఉద్యోగులపై పడితే ఉపయోగం ఏముంది?

ఆర్టీసి
స్త్రీ శక్తి పథకం, వికలాంగులకు, వృద్ధులకు, ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి వంటి ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి పర్యటనలకు వాడిన బస్సుల బకాయిలు రూ.2 వేల కోట్లకు ప్రభుత్వం చెల్లించలేదు. డిపో మేనేజర్లు, ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే వారు కరెంట్‌ రీ-చార్జ్‌ ఎలా చేస్తారు. బస్టాండ్లలో కరెంట్‌ లేకపోతే దొంగతనాలు వంటి అసాంఘిక చర్యలు పెరిగిపోతాయి.

మున్సిపాల్టీలు
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు రూ.3 వేల కోట్లు. విద్యుత్‌ ఆఫీసులతో సహా కలెక్టర్‌, రెవెన్యూ, అన్ని ఆఫీసులు, వాటర్‌ టాక్స్‌, హౌస్‌ టాక్స్‌, చెత్త టాక్స్‌ ఏవీ కట్టడంలా. ఈ లెక్కన విద్యుత్‌ ఆఫీసుల నుండి డబ్బులు ఇస్తేనే చెత్త తీయాలి. వాటర్‌ సప్లరు నిలిపి వేయాలి. విద్యుత్‌ ఆఫీసుల ముందు స్ట్రీట్‌ లైట్స్‌ ఆపివేయాలి. బిల్డింగ్‌ టాక్స్‌ కట్టనందున విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు సీల్‌ వేయాలి లేదా వేలం వేయాలి. విద్యుత్‌ ఆఫీసులకు రక్షణ, శుభ్రత ఎక్కడ ఉంటాయి. మున్సిపల్‌ ఆఫీసుల్లో పని చేసే ఎఇ, డిఇ లు, శానటరీ ఇన్‌స్పెక్టర్లు, గవర్నమెంట్‌ ఆఫీసుల అధికారులు వారి సొంత డబ్బుతో వారి ఆఫీసులలో ఎలా రీచార్జ్‌ చేసుకుంటారు?
హెడ్‌ వాటర్‌ వర్క్స్‌లో నీరు నిరంతరం చెరువుల్లో, నదుల నుంచి తీసుకోవాలి. ఫిల్టరైజేషన్‌ చేసి ప్రజలకు అందించాలి. వాటిని ఏఇ లు వేల రూపాయలు బెట్టి ఏవిధంగా రీచార్జ్‌ చేసుకుంటారు. వారికేమి సంబంధం ఉంటుంది? ప్రభుత్వం ఇవ్వాలి కదా! సకాలంలో నీరు రాకపోతే ఫిల్టరైజేషన్‌ లేకపోతే డయేరియా వంటి ప్రమాదకరమైన జబ్బులకు లోనౌతారు. వీధి దీపాలు లేకపోతే రాత్రిపూట దొంగతనాలు, యాక్సిడెంట్లు, మహిళలపై అత్యాచారాలు వంటివి అధికమవుతాయి. అసాంఘిక కార్యక్రమాలు పెరగడానికి ఎస్‌పిడిఎస్‌ఎల్‌ సిఎండి ప్రకటన దోహదపడుతుంది.

పౌర సేవల ఆఫీసులు
ట్రెజరరీ, జైళ్ళు, సేవలందించే ఆఫీసులకు కరెంట్‌ లేకపోతే ప్రజలకు కావాల్సిన బర్త్‌, లివింగ్‌, డెత్‌ వంటి సర్టిఫికెట్లకు పౌర సేవలకు ఇబ్బంది పడతారు. అయినా వీటికి యూజర్‌ చార్జీలు ప్రజలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసులకు కరెంట్‌ బిల్లులు కట్టాల్సింది ప్రభుత్వం, కాని శిక్ష మాత్రం ప్రజలకా?

సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థలు
వీటికి బిల్లులు 6 నెలలకొకసారి వస్తాయి. హెడ్‌ మాస్టర్‌, వార్డెన్‌ రోజూ రీచార్జ్‌ చేయించి కరెంట్‌ పొందడం సాధ్యపడుతుందా? కరెంట్‌ లేకపోతే విద్యార్థుల భవిష్యత్‌ ఏమిటి? వినాశ కాలానికి విపరీత బుద్ధులు చందంగా ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్