ఇంటర్నెట్ : ప్రపంచీకరణ ప్రారంభ దశలో కొద్దిమంది వద్దనే సంపద కేంద్రీకృతమైనట్లు AI వల్ల కూడా అదే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా వ్యాపారాల భవిష్యత్తును మారుస్తున్న నేపథ్యంలో …. గత ఆర్థిక, పారిశ్రామిక మార్పుల్లో జరిగిన తప్పులను మళ్లీ పునరావృతం చేయకూడదని సూచించారు. AI వల్ల కలిగే లాభాలు కొద్ది టెక్నాలజీ సంస్థలకే పరిమితమైతే, అనేక పరిశ్రమలు తమ ఉనికి, నైపుణ్యం, పోటీతత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఎఐ ను మానవ శ్రమకు ప్రత్యామ్నాయంగా కాదు.. సహాయక సాధనంగా చూడాలి ….
భవిష్యత్తులో మనుషులు, AI వ్యవస్థలు పరస్పరం నేర్చుకుంటూ పనిచేసే “కాగ్నిటివ్ లూప్” యుగం వస్తుందని ఆయన పేర్కొన్నారు. సంస్థలు మానవ జ్ఞానం, సృజనాత్మకతతో కూడిన మానవ మూలధనంతో పాటు, AI సామర్థ్యాలపై ఆధారపడిన టోకెన్ క్యాపిటల్‌ను కూడా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. AIని మానవ శ్రమకు ప్రత్యామ్నాయంగా కాకుండా సహాయక సాధనంగా చూడాలని, లక్ష్యాల నిర్ధారణ, కొత్త ఆలోచనల అనుసంధానం, నిర్ణయాల రూపకల్పనలో మనుషుల పాత్ర ఎప్పటికీ కీలకంగానే ఉంటుందని నాదెళ్ల స్పష్టం చేశారు.
సంపద కేంద్రీకృతమయ్యే పరిస్థితి మళ్లీ రాకూడదు ….
కొద్ది శక్తివంతమైన AI మోడళ్లపై అధిక ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరిస్తూ …. ప్రతి సంస్థ తమ సొంత జ్ఞాన వ్యవస్థలు, AI సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రపంచీకరణ ప్రారంభ దశలో సంపద కేంద్రీకృతమైనట్లే, AI వల్ల కూడా అదే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. అందుకే కొద్ది సంస్థల ఆధిపత్యంలోని “ఫ్రాంటియర్ మోడల్” కంటే, అందరికీ అవకాశాలు కల్పించే “ఫ్రాంటియర్ ఎకోసిస్టమ్” అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో Dario Amodei AI కారణంగా దీర్ఘకాలిక ఉద్యోగ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రభుత్వాలు పునఃశిక్షణ కార్యక్రమాలు, వేతన భీమా, AI కంపెనీలపై ప్రత్యేక పన్నుల వంటి చర్యలను పరిశీలించాల్సి ఉంటుందని సూచించారు. అదే సమయంలో Jensen Huang ఉద్యోగాల కోతలకు పూర్తిగా AI నే కారణమని చెప్పడం సరైంది కాదని, కంపెనీల అంతర్గత ఆర్థిక నిర్ణయాలు కూడా ప్రధాన కారణాలని పేర్కొన్నారు. మొత్తంగా, AI భవిష్యత్తు కేవలం లాభాలకే పరిమితం కాకుండా, మానవ శ్రేయస్సు, ఉద్యోగ భద్రత, ఆర్థిక సమానత్వాన్ని కూడా కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి.









కామెంట్‌లు (0)