పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని నాలుగు (ఉండి, పాలకోడేరు, ఆకివీడు, కాళ్ళ) మండలాల్లో ప్రభుత్వ స్థలాలు, కాలువ గట్లను నివాస యోగ్యంగా మార్చుకొని పేదలు యాబై నుండి వందేళ్ళకు పైగా నివశిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో ఆ ఇళ్లను అధికారులు అమానుషంగా కూలగొట్టారు. సిపియం, వ్యవసాయ కార్మిక సంఘం, స్థానిక ప్రజాసంఘాలు దీన్ని అడ్డుకోవటమేకాక పేదలకు భోజన వసతి ఏర్పాటు చేసి భరోసానిచ్చాయి. రాష్ట్ర కేంద్రం నుండి రెండు బృందాలు ఇటీవల ఆ నాలుగు మండలాలతోపాటు, భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామాన్ని కూడా సందర్శించాయి.
ఉండి మండలం
ఉణుదుర్రు గ్రామంలో 70 గృహాలను కూలగొట్టారు. కూల్చొద్దని కలెక్టర్, డిపిఓ చెప్పినా వినకుండా ఆర్‌ఆర్‌ఆర్ ఒత్తిడితో కూల్చారు. బాధితులంతా వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవించే బలహీనవర్గాల వారు. అక్కడ 60 సంవత్సరాల నుండి నివశిస్తున్నారు. తమ శక్తినంతా ధారపోసి కూడబెట్టుకున్న డబ్బుతో 10-15 లక్షలు ఖర్చుపెట్టి భవనాలు నిర్మించుకున్నారు. పంచాయితీ 4వ వార్డు మెంబర్‌గా టిడిపి తరపున గెలుపొందిన కండెబోయిన పద్మ తన భర్త నాగేశ్వరరావు (మాజీ ఆర్మీ) రిటైర్మెంట్ సందర్భంగా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారు. కళ్ళ ముందే ఇల్లు కూలగొడుతుంటే వారికి గుండాగినంత పనైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వారి భవిష్యత్తు ఎలాగని మావద్ద కన్నీరు మున్నీరయ్యారు. తమ ఇల్లు కూలగొడుతున్న సమయంలో కనీసం రేకులైనా తీసుకుందామని సాలిమట్ల పెద్దిరాజు ఇంటిపైకి ఎక్కారు. ప్రొక్లైన్‌తో ఇంటిని ధ్వంసం చేయగా ఆయన అక్కడి నుండి పడి కాలు, చెయ్యి విరిగి, స్పృహ తప్పి పడిపోయినా విధ్వంసానికి పాల్పడిన అధికారులెవ్వరూ పట్టించుకోలేదు. పెత్తందార్ల దాష్టీకానికి ఇలా ప్రతి కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
రొయ్యల చెరువులు, వాటి పక్కనే మురుగు కాల్వ, దాని గట్టు మీద పేదల ఇళ్ళు, దానిని అనుకుని రోడ్డు ఉన్నాయి. ఈ ఇళ్ళను తొలగిస్తే ఈపాటికే ఆక్రమించిన కాలువ భూమితోపాటు మరికొంత భూమిని పెత్తందార్లు ఆక్రమించవచ్చు. ప్రతి చెరువు నుండి డైరెక్టుగా రోడ్డు మీదకు వాహనాలు, రాకపోకలు ఏర్పాటు చేసుకునేందుకే ఇదంతా అని పేదలు అనుకుంటున్నారు.
పాలకోడేరు మండలం, గరగపర్రు
ఇక్కడ 50 కుటుంబాలను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సిపిఎం ప్రజా సంఘాల సహకారంతో పేదలు కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం తొలగింపు ఆగింది.
మోగల్లులోని సుబ్బరాజు చెరువు ఊరి మధ్యలో ఉంది. దాని గట్టు 40 మీటర్లకు పైగా వెడల్పు ఉంది. 23 బిసి కుటుంబాలు 100 సంవత్సరాలకు పైగా అక్కడ నివసిస్తున్నారు. స్థానిక పెత్తందార్లు ఆ చెరువును మంచి నీళ్ళ చెరువుగా మార్చాలనే సాకుతో ఈ ఇళ్ళు తొలగించాలని కుట్ర పన్నారు. ఆ కట్ట మీద ఇవే కాకుండా రెండు, మూడు ఇతర భవనాలు కూడా ఉన్నాయి. వాటి జోలికి వెళ్ళకుండా పేదలపై ప్రతాపం చూపుతున్నారు. సిపిఎం ప్రజా సంఘాల చొరవతో పంచాయతీ పేదలకు అనుకులంగా తీర్మానం ఇచ్చింది. ఇళ్ళు కూల్చితే తమ బతుకులు అన్యాయమైపోతాయని పేదలు భయపడుతున్నారు.
పాలకోడేరు మండలం
ఎ.ఎస్.ఆర్ నగర్‌లో 45 సంవత్సరాలుగా బిసి, ఎస్‌సి, ఇతర కులాలకు చెందిన పేదలు నివసిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఇక్కడ మొత్తం వంద ఇళ్ళు ఉండగా అందులో సగం కూల్చివేశారు. మిగిలినవి కోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంతో ఆగాయి. ఈ విధ్వంసానికి వ్యతిరేకంగా సిపిఎం, వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాలు పెద్ద పోరాటం చేశాయి.
ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటం, రవాణా మార్గం మెరుగుపడటంతో భూములకు విలువ పెరిగింది. పేదల ఇళ్ళు తొలగిస్తే ఆ భూమి అంతా ఆక్రమించుకోవచ్చని పెత్తందార్లు ఆర్‌ఆర్‌ఆర్ సహకారంతో కుట్రలు చేస్తున్నారు. పేదల ఇళ్ళను అనుకుని ఉన్న కాలువ శివాయి భూమి రెండు కిలోమీటర్ల పొడవున వుంది. సుమారు 20 మీటర్ల వెడల్పుతోవున్న దాదాపు 15 ఎకరాల భూమిని పెత్తందర్లు ఈపాటికే తమ సొంత భూముల్లో కలుపుకున్నారు. పేదల ఇంటి ముందు, కాలువ గట్టున, రోడ్డు పక్కన ఉన్న కొబ్బరి చెట్లు అన్నింటిమీద పెత్తందార్లదే ఆధిపత్యం.
భీమవరం నియోజకవర్గం
వీరవాసరం మండలం, మత్స్యపురి దళిత (అరుంధతి) వాడలో 13 ఇళ్ళు కూల్చారు. గత అనేక సంవత్సరాలుగా తమ ఇళ్ళ ముందు రోడ్డు వేయమని దళితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితం అధికారులు రోడ్డు స్థలాన్ని కొలత వేయగా అందులో కొంత భాగాన్ని పక్కన ఉన్న భూస్వాములు ఆక్రమించి తమ పొలాల్లో కలుపుకున్నారని తేలింది. వారు అక్రమంగా అనుభవిస్తున్న భూములు కోల్పోతామని దళితులపై పగబట్టి వారి ఇళ్ళు కూల్చివేయించారు. వందేళ్ళుగా దళితులు ఉంటున్న స్థలం ఆనుకుని రజకుల చెరువు, మరొక మంచినీటి చెరువు ఉన్నాయి. ఈ గట్టుపై ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళను 15-16 లక్షలు ఖర్చు పెట్టి పేదలు ఇళ్ళు నిర్మించుకున్నారు. గత నాలుగేళ్ళుగా పెత్తందార్లు కోర్టు నుండి ఈ ఇళ్ళు తొలగింపు ఆర్డరు తేవడం, పేదలు స్టే తెచ్చుకోవడం జరుగుతున్నది. ఇటీవల స్టే వేయకుండా లాయర్ వ్యవహరించినందున కంటెంట్ ఆఫ్ కోర్టు ఆర్డరు పేరుతో ఈ మే 2వ తేదీన అత్యంత వేగంగా ధ్వంసం చేశారు.
ఈ విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలి. పేదలకు అండగా కలిసి వచ్చే సంఘాలు, సంస్థలను కలుపుకొని విశాల ఉద్యమం చేపట్టాలి. బాధితులందరికీ 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చేవరకు, పక్కా గృహం నిర్మించే వరకు ఉద్యమించాలి.

రచయిత : కంకణాల ఆంజనేయులు
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి,
సెల్: 9490300370








కామెంట్‌లు (0)