అధికారాంతంబునందు చూడవలె నయ్యంగారి సౌభాగ్యముల్...అని పాతకాలపు పద్యం. దీన్నే మామూలుగా అధికారంతమునందు చూడవలె నా యమ్మ సౌభాగ్యముల్ అంటుంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్, మూడు సార్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిస్థితి చూస్తే అదే గుర్తుకు వస్తుంది. నిజానికి ఇందిరా గాంధీ వంటి వారు కూడా 1977లో ఎమర్జన్సీ పెట్టి ఓడిపోయాక స్వంత పార్టీ వారే దూరం పెట్టారు. ఆమె నియమించిన ముఖ్యమంత్రి జలగం వెంగళరావే గెస్ట్‌హౌస్ కూడా ఇవ్వకుండా చేశారని ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుంటారు. అంతదాకా ఎందుకు రిటైరైన అధికారులు, ఓడిపోయిన ప్రజాప్రతినిధులు చాలా మంది బాధ చెప్పడానికి లేనిదే. ఆ కథలన్ని వేరేగా చెప్పుకుందాం. ఉక్కు వనిత, అగ్గి బరాటా వంటి బిరుదాలతో అరాచక రాణిగా వెలుగొందిన మమతా దీదీ కూడానా? అంటే పాలక పార్టీలే అంత మరి. వారు, వారిని ఆడించే నడిపించే కార్పొరేట్ శక్తులకూ స్వార్థ రాజకీయ నేతలకు అధికారమే కొలబద్ద. ఓడిపోయిన దీదీ పార్టీకి 89 మంది ఎమ్మెల్యేలు వచ్చారు గాని ఇందులో రెండు వంతులు ఇప్పటికే చెక్కేశారు. ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీతో సహా నిర్ణయించి నియమించిన ప్రతిపక్ష నాయకుడు శోభన్ దేవ్‌ను పక్కన పెట్టి రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడుగా ప్రకటించుకున్నారు. ఆయనను మేము తొలగించామని దీదీ పరివారం గింజుకున్నా ససేమిరా పట్టించుకోలేదు. ఏమంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన సువేందు అధికారి కూడా ఒకప్పుడు ఆమె అనుచరుడే మరి! తల్లి పుట్టిల్లు మేనమామకు తెలుసని దీదీ రాజకీయ రహస్యాలన్నీ సువేందుకు కరతలామలకం. ఇకపోతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన రితబ్రతుడు కూడా ఒకప్పుడు సిపిఎం నుంచి బహిష్కృతుడేనన్నది మరో విశేషం. సిపిఎం నాయకత్వం, నాటి ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఎంతో ప్రోత్సహించి రాజ్యసభ సభ్యుడుగా పంపిస్తే పద్ధతులు పాటించలేక పార్టీ వేటుకు గురయ్యాడు. రాజ్యసభ పదవీ కాలం ముగియగానే తృణమూల్‌లో దూకాడు.
బెంగాల్‌లో కుట్రల చరిత్ర
వాస్తవానికి మమతా బెనర్జీ స్వయంగా 1998లో కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి స్వంత పార్టీ పెట్టుకున్నారనేది చెప్పనవసరం లేని విషయం. ఆ తర్వాత బిజెపితో కలిసి వామపక్ష ప్రభుత్వంపై విషం కక్కుతూ విద్వేషంతో సంఘ వ్యతిరేక ముఠాలను కూడగట్టి తమ స్వంత సేనను ఏర్పాటు చేసుకున్నారు. సిపిఎం ను దెబ్బ తీయాలనే ఏకైక లక్ష్యంతో, తొలి దశలో, మలి దశలో కాంగ్రెస్ బిజెపి ఆమెతో దోస్తీ చేశాయి. కుటల్రూ కుహకాలతో కూలదోశారు. 34 ఏళ్ల వామపక్ష పాలనను ఓడించినందుకు కీర్తనలాలపించారు. ఇప్పుడు ఆమెను ఓడించి సువేందు వచ్చాక మళ్లీ తొలిసారి బిజెపి విజేత అని ఆకాశానికెత్తుతున్నారు. 34 ఏళ్ల వామపక్ష పాలనతో పోలిస్తే వీరంతా కలిసినా సగం కాలం కూడా పూర్తి కాలేదు. మమతకు బడా పార్టీలూ కమ్యూనిస్టు వ్యతిరేకులు, మావోయిస్టులు సహా ఎవరు ఎలా సహకరించారనేది అలా వుంచితే ఆమె 15 ఏళ్లకే దిగిపోక తప్పలేదు. రాష్ట్ర సారథ్యం అటుంచి స్వంత పార్టీపైన కూడా పట్టు కోల్పోయిన దుస్థితి చెప్పేదేంటి? సిపిఎం ఓటమికి కారణాలేమిటనేది ఒకటైతే...ఇప్పటికీ ఆ పార్టీ యువ కార్యకర్తలను సమీకరిస్తూ పోరాడుతున్నదే గాని దిగాలు పడింది లేదే? కేరళంలోనూ గెలిచిన కాంగ్రెస్ సిి.ఎం ను ఎంచుకోవడానికి పదిహేను రోజులు కావలసి వస్తే సిపిఎం-ఎల్‌డిఎఫ్ లు నేరుగా ప్రజల్లోకి వెళ్లి పని చేసుకుపోతున్నాయి? స్వంత ఎజెండాలతో నడిచే స్వార్థపూరిత పాలక పార్టీలకూ ప్రజల కోసం నిలిచే ఆశయ నిబద్దమైన పార్టీలకూ తేడా అదే! ఇప్పుడు బెంగాల్‌లో జరుగుతున్నది గతంలో చాలా చోట్ల చూసిందే. మహారాష్ట్రలో బాల్‌థాకరే అనంతరం ఉద్ధవ్ రాజ్‌థాకరేలు చీలిపోయారు. ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే ఆ పార్టీ నుంచి చీలిపోయి మొదట ముఖ్యమంత్రిగా వెలిగినా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకుంటున్నారు. చిన్నదిగా మారిన ఎన్‌సిపి లోనూ శరద్ పవార్ తర్వాత అజిత్ పవార్, సుప్రియా సూలేల మధ్య రెండు చీలికలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ వుండగానే అఖిలేశ్ యాదవ్, శివలాల్ యాదవ్‌ల మధ్యన తగాదాలు ఓటమి పాలు చేశాయి. బీహార్‌లోనూ తేజస్వి యాదవ్‌కూ ఆయన సోదురుడైన తేజ్ ప్రతాప్ యాదవ్‌కూ మధ్య తగాదాకు ఆర్జేడి మూల్యం చెల్లించింది. అస్సాంలో కూడా నాటి కాంగ్రెస్ నాయకుడైన హిమంత బిశ్వ శర్మను కాదని ముఖ్యమంత్రి తరుణ్ గొగోరు తన కుమారుడు గౌరవ్‌ను పైకి తేవాలనుకోవడమే ఆ పార్టీ దెబ్బ తినడానికి ఒక కారణమంటారు. దక్షిణాదిన తమిళనాడులోనూ రెండు డిఎంకె లపై ఈ విధమైన వారసత్వ తగాదాల ప్రభావం చూశాం. ఉమ్మడి ఎ.పి లోనూ విడిపోయాక తెలంగాణ-ఎ.పి లలోనూ కూడా కుటుంబ కలహాలు పార్టీలను ఎలా దెబ్బ తీశాయో చూశాం. ఆ పరస్పర కలహాలలో ప్రజలకు కలిగే నష్టం ఏమిటన్నది మరింత పెద్ద ప్రశ్న.
అన్ని చోట్లా అదే తంతు
బెంగాల్‌లో పరిస్థితి వాటి కంటే భిన్నంగా కనిపించవచ్చు గాని మౌలికంగా ఒకటే. మమత తన మేనల్లుడు అభిషేక్‌కే పట్టం కట్టాలనుకోవడం ఇతరులకు మింగుడు పడలేదు. అంతకంతకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతుంటే ఆమె ఆయనపై ఇంకా ఎక్కువగా ఆధారపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక దశలో ఆమెకు కుడి భుజంగా మెలిగిన సువేందు దూరమైనారు. మొన్న ఓటమి దెబ్బ తిన్నాక కూడా దీదీ అభిషేక్ చెప్పినట్టే నడుస్తున్నారనేది ఆ పార్టీలో చీలికకు దారితీసింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడైన రితబ్రత కూడా బిజెపి తరపునే ఆమె వెనక పని చేశారన్నది తాజాగా పరిశీలకులు చెబుతున్న మాట. దీదీని సలహాదారుగా మాత్రమే వారు పేర్కొనడం విధేయులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఆమె గతంలో లాగే ఏవో వీధి పోరాటాలతో ఊగిపోయినా అప్పుడు పైకి లేపిన కార్పొరేట్లు, బడా మీడియా ఇప్పుడు అందుకు సిద్ధంగా వుండవు కదా! ఈ విధంగా ఒకటిన్నర దశాబ్దం పాటు వామపక్ష వ్యతిరేకతకు కేంద్ర బిందువుగా నిరంకుశత్వం వెలగబెట్టిన దీదీ కూలిపోతున్నారు. ఆమె నీడలో పెరిగిన సువేందు కూడా చిరకాలం వుంటారని చెప్పడం నిరాధారమే. ఇక ఆ పార్టీని చీల్చి ప్రతిపక్ష హోదా పొందిన రితబ్రతను విధేయ ప్రతిపక్ష నాయకుడుగా అభివర్ణిస్తున్నారు. ఒక విధంగా ఇదంతా బిజెపి మాయాజాలమే. పూర్వాపరాలు, ప్రతిబంధకాలు, కుట్రలూ గమనించకుండా వామపక్షాల లోపం వల్లనే అంతా జరిగిపోయిందని శాపనార్థాలు పెట్టేవారు ఈ పరిణామ క్రమాన్ని గమనించవలసి వుంటుంది. ఇప్పుడు తాము వచ్చాకనే కమ్యూనిస్టులు కార్యాలయాలు తెరచుకుంటున్నారని గొప్పలు పోతున్న బిజెపి ఒకప్పుడు తామే ఈ దీదీకి సోపానాలు వేశామని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఎదురీత ఈదుతున్నారే గాని బిజెపి వచ్చిందని సంతోషించే ప్రసక్తి వుండదు. 'సర్' వంటి విషయాల్లో రాజీ పడే అవకాశమూ వుండదు. కాకపోతే ఆశయ నిబద్దతతో, ప్రజాస్వామ్య లౌకిక విలువలతో నిలబడే పార్టీలకూ అవకాశవాదంతో అధికారమే పరమావధిగా పాకులాడే వారికి తేడా మాత్రం చూడవలసి వుంటుంది.
ఒక విధంగా ఇది బిజెపికి కూడా వర్తిస్తుంది. మోడీ మూడు సార్లు గెలిచారు గనక ఇక తిరుగు లేదన్న బడా మీడియా భజనలు అర్థరహితం. ఆఖరుకు 1952-1964 మధ్య కాలం తీసుకుని తొలి ప్రధాని నెహ్రూ కన్నా ఆయనే ఎక్కువ కాలం పాలించారని ఒక లెక్క చెప్పి సంతోషిస్తున్నారు. 1947 ముందున్న అయిదేళ్లు కాకి ఎత్తుకు పోతుందా? నెహ్రూ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పాలన సాగలేదా? గతంలో ఒకసారి ముఖ్యమంత్రిగా మోడీ పదవీ కాలం కూడా కలిపి ఒక లెక్క వేసి దేశంలోనే అత్యధిక కాలం పాలించిన నేత అని పొగిడారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన జిడిపి లెక్కలు ఇష్టానుసారం మార్చినట్టే ఇదీ చేస్తున్నారన్నమాట. కానీ దాంతోనే వాస్తవాలు మారిపోతాయా? 1947కు ముందు స్వాతంత్య్ర పోరాటంతో బిజెపి, ఆరెస్సెస్ లకు సంబంధమే లేదు గనక 1962నే తీసుకుందామంటే కుదురుతుందా? నిజానికి మరో ఏడాదిలో మోడీని పదవి నుంచి దించేస్తారని నెహ్రూ ముని మనవడైన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోస్యాలు చెబుతున్నారు. తనకు వివిధ అధికార వ్యవస్థల నుంచి సమాచారం అందిందని ఆయన చెబుతుంటే లోలోపల కుట్రలు చేస్తున్నారని బిజెపి ప్రతినిధి అమిత్ మాలవీయ ఆరోపిస్తున్నారు.
వీళ్లకు తెలియడం లేదా?
'విశ్వగురు' కావడంలో ఇండియా ఎందుకు వెనకబడిందో స్వయంగా ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఆయన కూడా ప్రస్తుత పరిస్థితి పట్ల పెదవి విరుస్తున్నట్టు అర్థమవుతుంది. తమిళనాడులో అన్నామలై వంటి తీవ్ర మతవాద నేత కూడా బిజెపి గెలిచే అవకాశంలేదని బయిటకు రావడం యాదృచ్ఛికం కాదు. కేరళంలో కూడా వారి ఆశలు వమ్మయిపోయాయి కాబట్టే గతంలో కావాలని తీసుకున్న మంత్రి కురియన్‌ను రాజ్యసభకు పంపించకుండా ఉద్వాసన చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ఎ.పి, తెలంగాణలలో నాయకులు మాత్రం బిజెపితో స్నేహమే గొప్ప వరప్రసాదమని పరవశించిపోవడం హాస్యాస్పదం. ఈ మధ్య హైదరాబాద్ నుంచి అమరావతి వరకూ చేసిన భాషణలన్నిటిలో అమిత్ షాను విమర్శించడమేంటని ఎ.పి ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ ఆగ్రహోదగ్రులవడం చూశాం. అమిత్ షా స్వయంగా పిలిచి చెప్పినా అన్నామలై ఒప్పుకోలేదే మరి? అన్నామలై వంటి వారు బయిటకు పోయినా బిజెపి ఏం కాదని పవన్ అన్న మరుసటి రోజునే అమిత్ షా పిలిచి మాట్లాడారే? రాజ్యసభ స్థానం కూడా ఇస్తామన్నారే? నిజానికి మోడీ హైదరాబాద్‌లో పవన్‌ను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కలుసుకున్న రోజునే కొత్త రాజకీయానికి అంకురార్పణ, కథారచన జరిగిందనే అభిప్రాయం బలంగా వుంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచందర్‌రావు ఆ మరుసటి రోజునే మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజులలో పొత్తుపై అధిష్టానం నిర్ణయిస్తుందని సంకేతాలు వదిలారు. పవన్ కల్యాణ్ బిజెపి, బిఆర్‌ఎస్ లను ఏమీ అనకుండా వదిలేశారని 'హిందూ' వార్తా కథనం. పవన్ 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినంత బలంగా జి.హెచ్.ఎం.సి ఎన్నికల గురించి చెప్పకపోవడం గమనించదగింది. బిఆర్‌ఎస్ సంగతి అటుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ నాయకులతో టచ్‌లో వుండవచ్చునని బిజెపి ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. వైసిపి, టిడిపి లలో ఎవరు వారికి తాత్కాలిక, శాశ్వత మిత్రులనే వ్యాఖ్యలు, వివాదాలు మరోవైపున నడుస్తున్నాయి. బిజెపి కి తన హిందూత్వ రాజకీయాలు కార్పొరేట్ ప్రయోజన కేంద్రీకృత ఆధిపత్యం తప్ప ఎవరిపైనా ఆసక్తి వుండదు. అందుకోసం రాజ్యంగ బద్దమైన లౌకిక ప్రజాస్వామ్యాన్ని సమాఖ్య తత్వాన్ని దెబ్బ తీసేందుకు కూడా వారు సిద్ధమవుతారు. కులమత ప్రాంతీయ తత్వాలన్నిటినీ ప్రయోగిస్తారు. వేర్వేరు పార్టీలు లౌకిక విలువలకు కట్టుబడకుండా బిజెపితో కలిసి ఊరేగడం వల్ల చివరకు వారికే చేటు అని బెంగాల్ నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ తాజా అనుభవాలు చెబుతున్న సత్యం.








కామెంట్‌లు (0)