ఎన్నికల సంఘం (ఇ.సి.ఐ) చేపట్టిన 'సర్' ప్రక్రియకు సంబంధించిన పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు విడుదల చేసింది. అందులో ఇలా పేర్కొంది: ''ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అర్హత కలిగి వున్నారా లేదా అనేది విచారించే విషయంలో రాజ్యాంగ ఆదేశం పాటించేందు కోసం పౌరసత్వంపై పరిమిత దర్యాప్తు చేసేందుకు ఎన్నికల సంఘానికి అవసరమైన అధికారం వున్నది''. సి.జె.ఐ సూర్యకాంత్, జస్టిస్ జోరు మల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం నుంచి ఈ ఉత్తర్వు వచ్చింది. ఓటర్ల జాబితాలను కచ్చితంగా నిర్వహించేందుకు, అర్హులైన వారు మాత్రమే ఓటు వేసేలా చూడటం కోసం రాజ్యాంగం ఇ.సి.ఐ కి ఇచ్చిన రాజ్యాంగ బాధ్యత నుంచే ఈ అధికారం వస్తుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు ఇ.సి కి చాలా విస్తారమైన విశాల అధికారం ధారాదత్తం చేసిందనేది నిస్సందేహం. ఈ విచారణ క్రమంలో ఇ.సి.ఐ ఏం వాదనలు వినిపిస్తుందోనని ఆలకించేందుకు కూడా కోర్టు శ్రమ తీసుకోలేదు. 'సర్' అనేది అసాధారణ ప్రక్రియ ఏమీ కాదని ఇ.సి.ఐ వాదించింది. 2002-03 మధ్య బీహార్ లోనూ తర్వాత దేశంలో ఇతర చోట్లా ఓటర్ల జాబితాలు రూపొందించడానికి అనుసరించిన సూత్రాలపైనే స్థూలంగా ఆధారపడి జరుగుతోందని ఇ.సి చెప్పింది. అయితే 2002-03లో జరిగిన సదరు ప్రక్రియకు సంబంధించిన ఉత్తర్వుల ఒరిజినల్ ప్రతులను సమర్పించగల స్థితిలో ఇప్పుడు లేమని కూడా పిటిషనర్లు ప్రశ్నలకు సమాధానంగా కమిషన్ అంగీకరించింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన విస్తారమైన అనుమతి కారణంగా కమిషన్‌కు ఎలాంటి జవాబుదారీతనం అవసరమే లేకుండా పోయింది. కనీస పారదర్శకత అవసరమనే అంశంపైన కూడా కోర్టు నొక్కి చెప్పిందీ లేదు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించడం కూడా అవసరమనే ప్రాథమిక సూత్రానికి కూడా స్వస్తి చెప్పింది.
పారదర్శకతకు పాతర
ఇ.సి.ఐ అలాంటి పారదర్శకతకు పూర్తిగా తిలోదకాలిచ్చిందనేది మొదటి నుంచి కనిపిస్తూనే వుంది. ఈ ప్రాతిపదికన తొలగింపులు జరిగాయనేది అటుంచి అసలు తొలగింపుల జాబితాను ఇవ్వడానికైనా అది సిద్ధం కావడం లేదు. ప్రజా తనిఖీకి వీలుగా ఆ తొలగింపుల జాబితాను డిజిటల్ రూపంలో, కంప్యూటర్‌లో చదవదగిన రూపంలో ఇవ్వడానికి కూడా తిరస్కరించడం మరింత తీవ్రమైన అంశం. ఈ కీలకమైన ప్రశ్నకు కమిషన్ జవాబివ్వలేదు కూడా. ఎలాంటి ప్రజా తనిఖీ పట్ల దానికి ఏ మాత్రం ఆసక్తి లేదని నిర్ధారించుకోవలసి వుంటుంది.
కాని కమిషన్‌కు పౌరసత్వం విషయంలో చివరి తీర్పునిచ్చే పాత్ర అప్పగించడం కుదిరేది కాదని అత్యున్నత న్యాయస్థానానికి తెలుసు. రాజ్యాంగ రీత్యా పౌరసత్వం సమస్యల ప్రాతిపదికన ఎవరినైనా ఓటర్ల జాబితాలో చేర్చడానికి లేదని కమిషన్‌కు సందేహం కలిగితే గనక ఆ విషయంలో నిర్ణయాధికారంగల కేంద్ర హోంశాఖకు నివేదించాలని పేర్కొంది. ఈ ఆదేశాన్ని వివరిస్తూ కోర్టు ఇలా చెప్పింది: ఎన్నికల ప్రయోజనాలకే పరిమితమైన కమిషన్ పౌరసత్వ నిర్ధారణ విషయంలో చివరి మాట కాజాలదు.''
ప్రజా ప్రాతినిధ్య చట్టం 16వ సెక్షన్‌ను ప్రస్తావిస్తూ కోర్టు కేవలం పౌరులైన వారికే ఓటు హక్కు వుంటుందని వ్యాఖ్యానించింది. అందువల్ల ఓటరుగా నమోదు కావడానికి పౌరసత్వం తప్పనిసరి షరతు. అందువల్ల ముందు ఈ కనీస షరతుపై సంతృప్తి చెందకపోతే ఎన్నికల సంఘం తన బాధ్యతలు నెరవేర్చజాలదని చెప్పింది. ఈ వాదనకే ముగింపుగా ఇలా ముక్తాయించింది: ప్రజా ప్రాతినిధ్య చట్టం 16వ సెక్షన్ ప్రకారం కమిషన్ ఓటరు జాబితాల రూపకల్పన సమయంలో కేవలం పౌరులైన వారికే ఓటు హక్కు షరతు అనే సూత్రాన్ని తప్పనిసరిగా పాటించవలసి వుంటుంది. ఆ రీత్యా అది పౌరసత్వ సంబంధిత సమస్యలపై పరిశీలన జరిపే అధికారం కలిగివుందనడం నిస్సందేహమే. అయితే ఈ నిర్ధారణ కేవలం ఓటరు జాబితాలో చేర్చడమా, తొలగించడమా అన్న కోణంలో మాత్రమే జరగాలి. అప్పటికే జాబితాలో వున్న పేరుకు అనుకూలంగానే నిర్ధారణ వుండొచ్చన్న ఓటరకు సానుకూలంగా వుండాలనే అంచనాతో ఈ విచారణ జరగాలి. ఈ రాజ్యాంగ పరిమితుల పరిధిలో కమిషన్ తన ముందున్న పత్రాలను పరిశీలించి ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాల కోసం ఒక నిర్ధారణకు రావలసి వుంటుంది. ఈ మొత్తం కసరత్తు న్యాయపరమైన సమీక్షకు లోబడి వుంటుందనేది అతి ముఖ్యమైన విషయం. కనుక తన విచారణ మొత్తం న్యాయంగా చట్టం నిబంధనల ప్రకారం జరిగేలా చూడవలసి వుంటుంది.''
మరింత గందరగోళం
అయితే ఇ.సి.ఐ కి క్లీన్ చిట్ ఇచ్చేసి, అది తన రాజ్యాంగ పరిధిని అతిక్రమించందనే ఆరోపణలను తిరస్కరించడం ద్వారా సుప్రీంకోర్టు మరింత గందరగోళం సృష్టించడమే గాక పరస్పర విరుద్ధంగా వ్యవహరించింది. ఇది రిపబ్లిక్ రాజ్యాంగ వ్యవస్థాపక సూత్రాలనే దెబ్బ తీసేవిగా వున్నాయి. మన రాజ్యాంగ నిర్మాణం చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఒక స్వతంత్ర ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగంగా మనం ఓటు చేయడమనే రాజ్యాంగ హక్కు ప్రాతిపదికగానే ఎన్నికల వ్యవస్థను నిర్మించుకున్నాము. అందువల్లనే మొదటి ఎన్నికల కమిషన్ నుంచి కూడా మనం ఓటర్ల జాబితాలో చేర్చుకోవడానికి లేదా తొలగించడానికి బాధ్యతను వ్యక్తిగతంగా ఆయా పౌరులపై పెట్టలేదు. దీనికి అవసరసమైన ప్రక్రియకు సంబంధించిన యంత్రాంగం, నిర్వహణ జరిగేలా చూడటం ఇ.సి.ఐ బాధ్యత. 'సర్' నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ అధికారాలు ఇ.సి.ఐ కి వున్నాయని అత్యున్నత న్యాయస్థానం భావించి వుండొచ్చు. కానీ అదే సమయంలో రాజ్యాంగమే చెప్పినట్టు వ్యక్తిగతంగా ప్రతి పౌరుడూ ఓటు హక్కు కలిగివుండటం తప్పనిసరి అని అదే రాజ్యాంగం బలంగా చెప్పిన విషయానికి కూడా అంతే ప్రాధాన్యత వుందన్న అంశాన్ని సి.జె.ఐ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీల ధర్మాసనం అపాయకరమైన మౌనం వహించింది. ఎందుకంటే రాజ్యాంగమే చెప్పిన ఈ సూత్రంపై తర్వాతి కాలంలో వేర్వేరు ధర్మాసనాలు మరింతగా నొక్కి చెప్పాయి.
ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో 27 లక్షల మందికి ఓటు హక్కు నిరాకరించడటం జరిగిన వాస్తవం దృష్ట్యా ఈ ప్రశ్నలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఎన్నికల సంఘం నిర్ణయించిన కాలపరిమితి దీనికి కారణం. ఈ విషయంలో తలెత్తిన న్యాయపరమైన, రాజ్యాంగ పరమైన ప్రశ్నలను తేల్చడానికి అవసరమైన యంత్రాంగ ప్రక్రియలు కమిషన్‌కు అందుబాటులో లేకపోయాయి. చివరకు సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని ఈ వివాదాలు పరిష్కరించడానికి అవసరమైన న్యాయ ట్రిబ్యునళ్లను ప్రతిపాదించవలసి వచ్చింది. ఏమైనా ఈ ట్రిబ్యునళ్ల ప్రధానాధికారిగా వచ్చిన కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్వయంగా కొన్ని నిర్మొహమాట వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ''తేల్చవలసిన ఈ దరఖాస్తులన్నింటినీ పూర్తి చేయాలంటే కనీసం నాలుగు సంవత్సరాలు పడుతుంది'. అని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తూ సుప్రీంకోర్టు ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోలేదు. వ్యక్తిగతంగా పౌరుడి రాజ్యాంగ హక్కు అన్న అంశంపై అవసరమైన సావధాన దృష్టి పెట్టలేదు.
పునాదులకే ఎసరు
గత చాలా కాలంగా ప్రత్యేకించి 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూత్వను భారత రాజ్యాంగ యంత్రం యొక్క ప్రబలమైన భావజాలంగా ముందుకు నెడుతున్నారనేది ఇప్పుడు గమనంలోకి వస్తున్న అంశం. ఒక జాతి రాజ్యంలో కార్యనిర్వాహక వర్గం, శాసన విభాగం వలె గాకుండా న్యాయ వ్యవస్థ అతీతంగా వుండిపోతుందని ఊహించడం అమాయకత్వం అవుతుంది. భారత రాజ్యాంగం ఎప్పుడూ హక్కుల ప్రాతిపదికన వుండేదే. అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ హక్కులకు రక్షణదారుగా వుంటూ వస్తున్నది.
భారతీయ మీడియా సంస్థలు కొన్నిటిలో వస్తున్న కథనాల ప్రకారం చూస్తే దేశ న్యాయస్థానాల ప్రాంగణాలలో బార్‌లు, బెంచ్‌లలో భారతీయ అధివక్త పరిషత్ నిరంతరాయంగా పట్టు పెంచుకుంటున్నది. ఈ పరిణామం వల్ల మన భారత రిపబ్లిక్ రాజ్యాంగాన్ని దెబ్బ తీసే దిశగా ప్రయత్నాలకు దారితీస్తుంది. పునాదిలోని పౌరుల బలం పెంచి హక్కుల ప్రాతిపదికన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బదులు కేంద్రీకృత ఆధిపత్యాన్ని మరింతగా రుద్దడానికి వీలుగా భారతీయ న్యాయ చట్రానికి చోటు కల్పించే దిశలో ఇవి పనిచేస్తాయి. సూక్ష్మ బుద్ధులైన పాఠకులకు ఈ ఆధారం సరిపోతుంది. కనక ఎన్నికల సంస్కరణల కోసం దీర్ఘకాలిక పోరాటాన్ని తీవ్రం చేసే ప్రయత్నాల ద్వారా సార్వత్రిక ఓటు హక్కును లాగేసే పన్నాగాలను అడ్డుకోవాలి. భయం పక్షపాతాలు లేకుండా ఓటు వేసేందుకుగల రాజ్యాంగ హక్కును ఆ విధంగానే రక్షించుకోవాలి.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం, జూన్ 3)








కామెంట్‌లు (0)