test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రధాని రెండు నాల్కల ప్రచారం

3 రోజుల క్రితం

Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 05:15 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మే 31వ తేదీన ‘మన్‌కి బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ”నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించిన” చందంగా ఉన్నది. వివిధ అంశాలతో పాటు శాస్త్రీయ దృక్పధాన్ని పెంచుకోవలసిన అవసరాన్ని గురించి ప్రధాని దేశ ప్రజలకు ఉద్బోధించారు. శాస్త్రీయాంశాలపై యువతలో ఆసక్తి పెరుగుతున్నదని, ఆస్ట్రో కేరళ, బెంగళూరు ఆస్ట్రానామికల్‌ సొసైటీ, బిగ్‌ బ్యాంగ్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ ఆఫ్‌ రాజ్‌కోట్‌ తదితరాలు అంతరిక్ష విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ప్రశంసించారు. అంతరిక్ష పరిజ్ఞానం దీర్ఘకాలం నుండి భారతీయులకు ఇష్టమైన అంశంగా ఉన్నదని, తర్వాతి తరం శాస్త్రవేత్తలను, నూతన ఆవిష్కర్తలను ఉత్తేజపరుస్తూనే ఉంటుందని కూడా ఆయన చెప్పారు. కాని ప్రధాని, సంఘ్ పరివార్‌ శాస్త్రీయ భావజాలానికి, ప్రశ్నించటానికి వ్యతిరేకంగా ఉన్నారు. సమాజ హితం కావనుకున్న అంశాలను ప్రశ్నించడం ద్వారానే నూతన ఆలోచనలు, భావాలు అభివృద్ధి అవుతాయి. పాత, కొత్తల సంఘర్షణలోనే శాస్త్రీయ ఆలోచన, శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది.
అశాస్త్రీయ భావాలను, మత మౌఢ్యాన్ని ప్రజల మెదళ్ళలోకి ఎక్కించటానికి సంఘ్ పరివార్‌ నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి నాయకులు శాస్త్రీయ అంశాలతో పౌరాణిక గాధలలోని అభూత కల్పనలను కలగలిపి అదే సైన్స్‌ అని ప్రచారం చేస్తుంటారు. ఆ తానులో ముక్కైన ప్రధాని నరేంద్ర మోడీ ఈ తిరోగమన భావజాల ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. మన దేశంలో పురాతన కాలంలోనే ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా వినాయకునికి ఏనుగు తల అతికించారని ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సభలో మోడి చెప్పారు. మన పూర్వీకులు విమానాలను కూడా వినియోగించారని, అవి దేశంలోనే కాకుండా అంతరిక్షంలోకి కూడా వెళ్ళి వచ్చేవని కూడా చెప్పారు. టెస్ట్‌ట్యూబ్‌ బేబీని కూడా మనమే మొదట సృష్టించామని, ద్రోణుని పుట్టుక అందుకు సాక్ష్యమని సంఘ్ పరివార్‌ ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారంలో ఏ మాత్రమైనా శాస్త్రీయ దృక్పధం ఉన్నదా? పురాతన కాలంలో మనవారు చెప్పారనే పేరుతో ఎటువంటి శాస్త్రీయాధారాలు లేని కథలను వాస్తవాలుగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు. ఈ విధంగా అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్న ప్రధాని మోడి శాస్త్రీయ భావాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పటం ఎంత మోసం!
ప్రజలు విజ్ఞానవంతులైతే, శాస్త్రీయ దృక్పధంతో ఆలోచించటం ప్రారంభిస్తే హిందుత్వ ప్రచారానికి కాలం చెల్లుతుంది. అందువలన ప్రజలకు ఆధునిక విజ్ఞానం చేరకుండా, వారు వైజ్ఞానిక అంశాలను అర్ధం చేసుకోకుండా చేయటం కోసం సంఘ్ పరివార్‌ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా భావి తరాలు ప్రశ్నించకుండా, విజ్ఞానవంతులు కాకుండా ఉండటం కోసం పాఠ్యాంశాలు, విద్యా విధానంలో మార్పులు చేస్తున్నది. వలస పాలన అవశేషాలను తొలగించటం, భారతీయీకరణ పేరుతో పాఠ్యాంశాలలోని శాస్త్రీయాంశాలను తొలగించి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రబోధిస్తున్న సాంస్కృతిక జాతీయవాద దృక్పధాన్ని చొప్పిస్తున్నది. ఇందులో భాగంగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చి అండ్‌ ట్రైనింగ్‌-ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి-6 నుండి 12వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను సవరించింది. మొఘల్‌ సామ్య్రాజ్యం గురించి, హిందూ జాతీయవాదాన్ని మహాత్మా గాంధీ వ్యతిరేకించిన భాగాలు, 2002లో జరిగిన గుజరాత్‌ మారణకాండకు సంబంధించిన భాగాలను పాఠ్యాంశాల నుండి తొలగించారు. ఇవన్నీ చరిత్రలో భాగాలు. వీటిని పక్కన పెట్టి వేద చరిత్ర, పురాతన భారతీయ శాస్త్ర విజయాలను ప్రచారం చేస్తామంటున్నారు. పురాతన కాలంలో మన దేశంలో జరిగిన శాస్త్రీయాభివృద్ధిని ప్రచారం చేయటం అవసరమే. కాని యూరోపియన్‌, మార్క్సిస్టు, సోషలిజం తదితరాలు విదేశీయమైనవి అనే పేరుతో వాస్తవాలను పక్కన పెట్టి, కట్టుకథలను పాఠ్యాంశాలలో భాగంగా చేస్తే విద్యార్థులకు శాస్త్రీయ దృక్పధం అబ్బదు. భారతదేశంలోని చారిత్రక సంఘటనలను పాఠ్యాంశాల నుండి తొలగించిన తర్వాత సంఫ్‌ు ప్రచారం చేస్తున్న అశాస్త్రీయ భావాలనే చరిత్రగా బోధిస్తారు. ఈ విధానాలకు సైన్స్‌కు ఏ మాత్రం పొసగదు. పురాణ కథలతో కలిపి చరిత్ర చదివిన ఈ విద్యార్థులకు చరిత్రను గురించి సమగ్ర దృక్పధం ఉండదు. కాబట్టి వీరు అనేక తప్పులు చేయటంతో పాటు సామాన్య ప్రజలను అజ్ఞానంలో ముంచటానికి సాధనాలుగా మారతారు. వీరు విదేశాలకు వెళ్ళటం లేదా విదేశీ చరిత్రకారులతో చర్చలు చేయాల్సి వచ్చిన సందర్భాలలో తాము నవ్వుల పాలవటమే కాకుండా మనదేశంపై చులకన భావం ఏర్పడటానికి కారణం అవుతారు.
జ్యోతిష్యం, వాస్తు లాంటి అశాస్త్రీయ అంశాలను ఉన్నత విద్యలో భాగం చేస్తున్నారు. భారతీయ విజ్ఞానం పేరుతో ఈ అంశాలను బోధించాలని యూనివర్సిటి గ్రాంట్స్‌ కమిషన్‌ ఒత్తిడి చేస్తున్నది. అనేక కేంద్ర, రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీలు డిప్లొమా, డిగ్రి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులలో జ్యోతిష్యం, వాస్తులను బోధిస్తున్నాయి. గతం నుండి మన దేశంలో ప్రచారంలో ఉన్నంత మాత్రాన ఈ అంశాలు శాస్త్రీయమైనవి అవుతాయా? ఈ అంశాలలో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు చేసినవారు విద్య పూర్తయిన తర్వాత ఏం చేయాలి? జ్యోతిష్యం, వాస్తు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ జీవనోపాధిని సంపాదించుకోవాలా? ఇటువంటి అశాస్త్రీయ అంశాలను విద్యా విధానంలో భాగం చేసి, విద్యార్థులు, యువతను అజ్ఞానంలో ముంచటానికి కేంద్ర ప్రభుత్వం ఒకవైపున ప్రయత్నం చేస్తుండగా, మరోవైపున ప్రధాని శాస్త్రీయ విజ్ఞానం గురించి బోధించటం నయవంచన కాదా! ఆర్‌ఎస్‌ఎస్‌ తిరోగమన భావజాలానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక రంగంలో శక్తివంతంగా పోరాటం చేయటం ద్వారానే శాస్త్రీయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయటం సాధ్యమౌతుంది.

kotireddy

ఎ.కోటిరెడ్డి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్