test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపట్టణాలన్నీ ప్రైవేటుకే – కూటమి ప్రభుత్వ ఘాతుకం

4 రోజుల క్రితం

tdp alince
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 04, 2026, 05:30 పూర్వాహ్నం | 6 నిమిషాల చదవడం

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలు (యు.ఎల్‌.బి), పట్టణాభివృద్ధి సంస్థలు (యు.డి.ఎ), మౌలిక సదుపాయాలు, పౌర సేవలు, ఆస్తులన్నింటిని ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేయాలని ఆదేశిస్తూ 673 జీఓ విడుదల చేసింది. ఇది అత్యంత ప్రమాదకర నిర్ణయం. దీనిని వెనక్కి తీసుకోకపోతే మొత్తం మున్సిపల్‌ పట్టణ వ్యవస్థే ప్రైవేట్‌ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళుతుంది.
ప్రస్తుత రాష్ట్ర జనాభా 5.37 కోట్లు ఉందని, ఇందులో 30 శాతం పట్టణ జనాభా ఉంటుందని, పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలు తీర్చడానికి కనీసం రూ. 45 వేల కోట్లు పెట్టుబడి అవసరమని ప్రభుత్వం జిఓలో పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చలేని స్థితిలో ఉందని, అలాగే పట్టణ స్థానిక సంస్థలు కూడా నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధి లోని 14 రకాల మౌలిక సదుపాయాలు, పౌర సేవలు, ఇతర ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం ద్వారా పట్టణ, స్థానిక సంస్థలు ఆర్థిక బలోపేతం కావడమేకాకాక, స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించబడుతుందని, 2047 నాటికి ఏటా 15 శాతం వృద్ధిరేటు చొప్పున ఆంధ్రప్రదేశ్‌ రెండు ట్రిలియన్‌ డాలర్ల (రూ.200 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థతో, 42 వేల డాలర్లు (రూ.40 లక్షలు)కు చేరి దేశంలోనే సుసంపన్న రాష్ట్రంగా మారుతుందని ఉపదేశించారు. ఇప్పుడు ఈ లక్ష్య సాధన పేర మున్సిపల్‌ సంస్థలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయబోతున్నారు.
ఈ విధానం ప్రకారం రాష్ట్రంలోని 123 నగర పాలక, మున్సిపల్‌ సంస్థల అధీనంలోని ఖాళీ స్థలాలన్నీ ప్రైవేట్‌ సంస్థలకు నగదీకరణ పేర ధారాదత్తం చేయనున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్లలోనే కాదు, ప్రతి చిన్న మున్సిపాలిటీలో కూడా వాటి భవిష్యత్‌ సామాజిక అభివృద్ధి కోసం, పౌర సేవలు, రిక్రియేషన్ల విస్తృతి కోసం వీటిని వినియోగించుకుంటారు. ఇప్పుడు ఈ స్థలాలను ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేయడం ద్వారా అక్కడ బహుళ వాణిజ్య భవనాలు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. అలాగే ప్రైవేట్‌ పెట్టుబడితో సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లను, నూతన అధునాతన పట్టణాలను కూడా ఏర్పాటు చేయాలి.
ఇప్పటికే మున్సిపాలిటీలు నిర్వహిస్తున్న వాణిజ్య భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల ఆధునీకరణ, పున: అభివృద్ధి పేర వాటిని కూలగొట్టి ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వనున్నారు. ఇవన్నీ ఎక్కువ భాగం నగర, పట్టణ ప్రధాన కూడళ్లలో ఉన్నాయి. వీటిలో ప్రైవేట్‌ సంస్థలు తిరిగి బడా షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య భవనాలు నిర్మించి వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకుంటాయి. మున్సిపల్‌ సంస్థల అధీనంలో ఉండే బస్టాండ్లు, బస్‌ బేలు, బస్‌ స్టాప్‌లను కూడా వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా పునర్‌ నిర్మాణాలు చేపట్టాలి. మున్సిపల్‌ కార్యాలయాలను కూడా షాపింగ్‌ కాంప్లెక్స్‌లుగా మార్చాలి. ఒకవేళ అవి ప్రధాన వ్యాపార కూడళ్లలో ఉంటే ఆ కార్యాలయాలను వేరే చోటకి మార్చాలని, స్థలాలను పూర్తిగా ప్రైవేటుకు అప్పజెప్పాలని పేర్కొన్నారు.
ఆడిటోరియంలు, ఇండోర్‌ స్టేడియంలు, స్టేడియంలు, క్రీడా మైదానాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, కళ్యాణ మండపాలు వంటి వాటిని ఈ జీవో ప్రకారం ప్రైవేటీకరణ చేయాలి. అంతేగాక, వీటిల్లో ప్రైవేట్‌ మెగా షాపింగ్‌ మాల్స్‌ నిర్మించాలి. కూరగాయలు, పండ్లు, మాంసం వంటి ప్రజా అవసరాల కోసం మున్సిపల్‌ సంస్థలు నిర్వహిస్తున్న మార్కెట్లనింటినీ ప్రైవేట్‌ వారికి అప్పజెప్పాలి. వీటి కింది భాగాన్ని మార్కెట్లుగాను, పైన బహుళ అంతస్తుల రూపంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకునేలా వీటిని పునర్‌ నిర్మాణాలు చేపట్టాలి. పట్టణ ముఖ్యమైన కేంద్రాల్లో ఉన్న మార్కెట్లను అవసరమైతే వాటిని వేరే ప్రాంతాల్లోకి తరలించి అక్కడ పూర్తిగా మెగా మాల్స్‌, స్టార్‌ హోటళ్లు వంటివి నిర్మించాలి. పార్కులు, రిక్రియేషన్‌ కార్యకలాపాలన్నీ చివరికి శ్మశానాలు సైతం మున్సిపల్‌ సంస్థలు నిర్వహించకూడదు. అవన్నీ ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేయాలి. దీనివల్ల విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, రాజమండ్రి, కాకినాడ లాంటి పెద్ద నగరాల్లో ఉండే పెద్ద పెద్ద పార్కులన్నీ ప్రైవేటుకు వెళ్ళిపోతాయి. రోడ్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలు, ట్రాఫిక్‌ సిగల్‌ కూడళ్లు, ప్రధాన రోడ్ల మధ్య భాగం ( మీడియన్స్‌) నిర్వాహణ కూడా ప్రైవేట్‌ వారికివ్వనున్నారు. ప్రైవేట్‌ సంస్థలు వీటన్నిటినీ లాభాపేక్షతో నిర్వహిస్తాయి.
మంచినీరు, పారిశుధ్యం, మురుగు నీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి శుద్ధి, వీధి లైట్లు వంటి అత్యవసర పౌర సేవల ఆపరేషన్‌, మెయింటినెన్స్‌ పూర్తిగా ప్రైవేట్‌కు ఇవ్వాలని జీవో చెప్తోంది. అంతేగాక, వీటికయ్యే పూర్తి ఖర్చును వినియోగదారుల నుండి వసూలు చేయాలి. అన్ని ప్రాంతాల్లో పార్కింగ్‌ ఫీజులు, చెత్తపై యూజర్‌ చార్జీలు, వీధి లైట్ల నిర్వహణా చార్జీలు ఇలా అనేకమైన పన్నులు కొత్తగా అమలులోకి వస్తాయి. ఈ జిఓ 123 పట్టణ స్థానిక సంస్థలకే పరిమితం కాదు. రాష్ట్రంలో ఉన్న 21 పట్టణ అభివృద్ధి సంస్థల ఆస్తులు, మౌలిక సదుపాయాలు, సేవలన్నీ కూడా ప్రైవేట్‌ పరం చేయాలి. విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి పట్టణ అభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో వేల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఇవన్నీ ప్రైవేటుకు తరలిపోతాయి. అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్న సి ఆర్‌ డీ ఏ ఆరు జిల్లాల పరిధి లో విస్తరించి ఉంది. ఈ సంస్థల ఆధీనంలోని భూములను ప్రైవేట్‌ సంస్థలకు మెగా బహుళ అంతస్తుల నివాస భవనాలు నిర్మాణానికి బదిలీ చేయాలి. ఈ సంస్థలు కేవలం ప్రైవేట్‌ పెట్టుబడులకు ఫెసిలిటేటర్లుగా రూపాంతరం చెందనున్నాయి. ఈ ఆస్తులన్నింటిని ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం ( పి.పి.పి ), పి4, జాయింట్‌ వెంచర్‌, నిర్మాణం-సొంతం-నిర్వహణ (బి ఒ ఒ), పునరావాసం-నిర్వహణ-బదిలీ (ఆర్‌ ఒ ఎం టి) లీజు, లైసెన్స్‌, అమ్మకం, ఇలా అనేక పేర్లతో ప్రైవేట్‌ వారికి అప్పజెప్పనున్నారు. ఈ ఒప్పందాలు, బదిలీల ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం ఎంత ఉంటుందో కూడా చెప్పారు. భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువలో కేవలం 1 శాతాన్ని లీజుగా వసూలు చేయాలని, ప్రతి మూడేళ్ల కొకసారి 5 శాతం చొప్పున లీజును పెంచుకోవచ్చని తెలిపారు. పౌర అత్యవసర సేవలకు ఖాళీ స్థలాలను ఒక్క రూపాయి లీజుకే ఇవ్వొచ్చు. వీటి కాల పరిమితి ఎంతుండాలో కూడా పేర్కొన్నారు. రూ.50 కోట్లు పెట్టుబడి కలిగిన ప్రాజెక్టులను 33 ఏళ్లకు, రూ.50 నుండి రూ.250 కోట్ల ప్రాజెక్టులను 66 ఏళ్లకు, రూ.250 నుండి రూ.500 కోట్లు వరకు లేదా రూ.500 కోట్లు పైబడిన ప్రాజెక్టులను 99 ఏళ్లకు లీజుకి ఇవ్వాలని తెలిపారు. అవసరమైతే ఖాళీ స్థలాలను పూర్తిగా అమ్మవచ్చని కూడా ఆదేశించారు.
మున్సిపల్‌ సంస్థల మౌలిక సదుపాయాలు, ఆస్తులు, పౌర సదుపాయాలు పొందే ప్రైవేట్‌ సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా నిధులు, గ్రాంట్లు కూడా ఇస్తాయి. పి.పి.పి కింద చేపట్టే వాటికి ముఖ్యంగా మంచినీరు, పారిశుధ్యం, మురుగు నీరు, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి లైట్లు వంటి వాటికి పట్టణ చాలెంజ్‌ ఫండ్‌ (యు సి ఎఫ్‌), అమృత్‌ పథకం, ప్రాజెక్ట్‌ను లాభసాటిగా మార్చడానికి అవసరమైన నిధులు (వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌), పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్‌ (యు.ఐ.డి.ఎఫ్‌) ఇలా అనేక పథకాల నుండి 25 శాతం నుండి 60 శాతం వరకు నిధులు ప్రైవేట్‌ సంస్థలకు సమకూరుస్తారు. అంతేగాక మున్సిపల్‌ బాండ్లు, స్టాక్‌ ఎక్చేంజ్‌ మార్కెట్‌ ద్వారా రుణాలు సేకరించి పట్టణ స్థానిక సంస్థలు ఇవ్వాలి. ఈ ప్రాజెక్టులన్నింటిని రాష్ట్ర స్థాయిలో ఉన్న పి.పి.పి సెల్‌ పర్యవేక్షణ చేస్తుంది. ఇంకా విచిత్రమైన ప్రతిపాదన ఏమంటే పి.పి.పి ద్వారా మున్సిపల్‌ ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తే ప్రతి ప్రాజెక్టుకు రూ. 5 కోట్ల చొప్పున నగదు బహుకరణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రైవేట్‌ ప్రాజెక్టులన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు, గ్రాంట్లు, ఆదాయ చెల్లింపుల గ్యారెంటీ లెటర్లు కూడా ఇస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపల్‌ అకౌంట్ల నుండి వేరు చేసి ప్రత్యేక ఖాతా (ఎస్క్రో అకౌంట్‌)లో జమ చేస్తారు. మొత్తం పి.పి.పి ప్రాజెక్టులపై గాని, వాటి నిర్వహణ, ఆదాయ, వ్యయాలపై ఎన్నికైన మున్సిపల్‌ కౌన్సిళ్లకు ఎలాంటి అధికారం ఉండదు.
మున్సిపల్‌ సంస్థల అన్ని రకాల సేవలు, కార్యకలాపాలు, ఆస్తులను పూర్తిగా ప్రైవేట్‌ సంస్థలకు బదిలీ చేయటానికి, వాటిపై గుత్తాధిపత్యం కల్పించేందుకు గత మూడు దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు భారత దేశంలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధానాలను తీవ్రతరం చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బిజెపి పట్టణ ప్రైవేటీకరణ వ్యూహాన్ని పెద్దఎత్తున అమలకు పూనుకున్నది. ఒకవైపు స్థానిక సంస్థలకు నిధులివ్వకుండా, ఆ సంస్థల నిధులను కూడా రాష్ట్ర ఖజానాకు తరలించుకుపోతూ రెండో వైపు ప్రైవేట్‌ పెట్టుబడుల పూర్తి స్వేచ్ఛకు రాష్ట్రంలో మున్సిపల్‌ చట్టాలను, నిబంధనలను అన్నింటిని కూడా మార్చేయటానికి పూనుకున్నది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర వాణిజ్య కార్యకలాపాలకు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఆటంకంగా ఉన్న చట్టాన్ని పూర్తిగా సరళతరం చేశారు. పట్టణ ప్రణాళిక, జోనింగ్‌ విధానాలను ప్రైవేటు పెట్టుబడికి అనుకూలంగా మార్చేయటానికి తలపడ్డారు. భవన నిర్మాణ ఏరియా, ఎత్తైన బహుళ భవనాల నిర్మాణానికి (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌) ఉన్న నిబంధనలన్నింటినీ తొలగిస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్లు అన్నింటిని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు, పెట్టుబడులకు అనుకూలంగా మారుస్తున్నారు.
మున్సిపల్‌ పరిపాలనా పరమైన విధానాలను సరళతరం చేస్తున్నారు. పాలనలో పట్టణ స్థానిక ప్రభుత్వాల పాత్రను, జోక్యాన్ని, అధికారాలను నామమాత్రం చేస్తున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధుల మున్సిపల్‌ కౌన్సిళ్ల పరిధి నుండి మున్సిపల్‌ మౌలిక సదుపాయాలు, పౌర సేవలను విడగొట్టి పట్టణ లిమిటెడ్‌ సంస్థలుగా కంపెనీ చట్టం కింద రిజిస్టర్‌ చేస్తున్నారు. ప్రత్యేక వాహక సంస్థల (ఎస్‌.పి.వి)ను ఏర్పాటు చేస్తూ ప్రత్యేక పరిపాలన కిందకు తీసుకొచ్చి ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తునారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నాయి. వికేంద్రీకరణ, స్థానిక స్వయం పాలన స్థానంలో నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారు.
పట్టణ రంగం లోనే కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా రాష్ట్రాన్ని ప్రధాన నగరాల కేంద్రంగా, వాటి చుట్టూ ఉన్న విస్తారమైన ప్రాంతాలను కలిపి ఆర్థిక రీజియన్‌ నమూనాను ముందుకు తీసుకొచ్చింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా మూడు ఆర్థిక రీజియన్లను ప్రకటించారు. వీటి పరిధిలోని రైతుల భూములను, సహజ వనరులను, ఖనిజ సంపదను, సముద్ర తీరాన్ని ఇలా అన్నింటినీ కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రాన్నే ప్రైవేట్‌ పెట్టుబడులతో అష్ట దిగ్బంధనం చేస్తున్నారు.

gangarao

వ్యాసకర్త :- డా|| బి. గంగారావు

సెల్‌ :9490098792 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్