test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకౌలు రైతు గోడు పట్టదా?

5 రోజుల క్రితం

farmer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 03, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి సంబంధించిన అపారమైన డేటా కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది. ఈ-క్రాప్ నమోదులు, డిజిటల్ భూ రికార్డులు, ఎరువుల సరఫరా పర్యవేక్షణ వ్యవస్థలు, సాగునీటి విడుదల షెడ్యూళ్లు... ఇలా రాష్ట్రంలో ఇప్పుడు వ్యవసాయం డేటాబేస్‌ చుట్టూ తిరుగుతోంది. కాగితాలపై చూస్తే ఇది ఆధునికీకరణకు, పరిపాలనా సామర్థ్యానికి సంకేతంలా కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం దగ్గర డేటా పెరిగినా... రైతుల్లో అనిశ్చితి తగ్గడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

​గ్రామాల్లో రైతుల మనసులో ఒక ఆందోళన నెమ్మదిగా ముసురుతోంది. అది కేవలం యూరియా కొరత గురించి, సాగునీటి కొరత గురించి మ్రాతమే కాదు. కూటమి ప్రభుత్వం నిజంగా సాగు చేస్తున్న రైతుని గుర్తిస్తున్నదా? లేక కేవలం పట్టాలను, పత్రాలనే గుర్తిస్తున్నదా? అన్న అనుమానం పెరుగుతున్నది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న యూరియా-కార్డు విధానం ఇలాంటి చర్చలకు ఆజ్యం పోసింది. యూరియా కార్డుల ప్రతిపాదన ప్రభుత్వ దృష్టిలో ఎరువుల పంపిణీని క్రమబద్ధీకరించే సంస్కరణగా కనిపించవచ్చు. ఇది ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టే ప్రక్రియగానూ చెప్పుకోవచ్చు. కానీ కౌలు రైతుల్లో దీనిపై పూర్తిగా భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగు ఆధారంగా అందాల్సిన మద్దతు క్రమంగా పత్రాల ఆధారంగా మారుతోందని నిరాశ చెందుతున్నారు.

​ రాష్ట్రంలో 60 నుండి 70 శాతం మంది కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారు. కేవలం పట్టాదారు పాసు పుస్తకం, ఈ - క్రాప్ నమోదు వున్నవారికే యూరియా కార్డులు ఇవ్వలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. తెలంగాణ ప్రభుత్వం యూరియా కోసం రూపొందించిన యాప్ విధానం పూర్తిగా విఫలమవడంతోపాటు అసలు రైతుకు యూరియా దొరక్క ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురైంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా యూరియా కార్డులు, యాప్ వంటి విధానాలు తీసుకువస్తే ఇలాంటి అనుభవమే ఎదురయ్యే అవకాశాలున్నాయి. సచివాలయాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు యూరియా సరఫరా చేస్తే రైతులందరికీ ప్రయోజకరంగా ఉంటుంది. కార్డులు, యాప్ వంటి విధానాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నా ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు తెచ్చిపెడతాయి.

​ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఈ హామీ నెరవేరకపోవడంతో కౌలు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. జనసేన ఎన్నికల ముందు కౌలు రైతుల సంక్షేమం కోసం అనేక సమావేశాలు నిర్వహించి వారికి హామీలిస్తూ భరోసా కలిగించింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేసింది. కానీ, అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల అన్నదాత సుఖీభవ, బ్యాంకు పంట రుణాలు, పంట అమ్ముకునే సమయంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు.

​ చాలా ప్రాంతాల్లో రైతులు ఎరువులకు, విత్తనాలకు డిజిటల్ విధానాల కంటే మధ్యవర్తులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అందుకే ఇప్పుడు యూరియా-కార్డు విధానాన్ని రైతులు సౌకర్యవంతమైన వ్యవస్థగా కాకుండా, మరొక దళారి వ్యవస్థకు ఊతమిచ్చే విధానంగా చూస్తున్నారు. కాలువల నిర్వహణ, మౌలిక వసతులు... ఇలా ప్రతి అంశం రైతులు చర్చిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్నా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టి తొలగింపు పనులు, కాలువల మరమ్మతులు, డ్రైనేజీ శుభ్రపరిచే పనులు ఇంకా పూర్తికాలేదు.

​ గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, వంశధార ఆయకట్టు, కె.సి కాలువ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో సాగునీటి సరఫరాపై జరుగుతున్న చర్చలు ఈ ఆందోళనను మరింత పెంచుతున్నాయి. రైతుకు నీటి విడుదల తేదీ అంటే కేవలం ఒక ప్రకటన కాదు. అది విత్తనం ఎప్పుడు వేయాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, కూలీలను పెట్టుకోవాలి అన్న ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి చిన్న నిర్లక్ష్యం కూడా రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే చేసిన అప్పులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, మార్కెట్ అనిశ్చితి మధ్య సాగు చేస్తున్న రైతుకు ఇప్పుడు ఎరువుల లభ్యతపై కూడా అనిశ్చితి నెలకొంటే... పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుతుంది.

​ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాల పనితీరు గురించి ప్రభుత్వం నిత్యం వల్లెవేస్తున్న గణాంకాలు రైతుల మనసుకు ఎక్కడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 1,040 ఎత్తిపోతల పథకాలలో కేవలం 156 మాత్రమే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కలు వాస్తవాలా? కాదా? అన్నది పక్కనపెడితే, “కాగితాలపై కనిపిస్తున్నాయి కానీ రైతుకు భూమిపై మాత్రం నీరు కనిపించడం లేదు” అని రైతులు పెదవి విరుస్తున్నారు. కాబట్టి, ఈ ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తే రాష్ట్రంలో దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మరోవైపు ఇటీవల మొక్కజొన్న పంటను రైతులు క్వింటాల్‌ రూ.1700 చొప్పున అమ్ముకున్నారు. మెజారిటీ పంట వ్యాపారుల వద్దకు చేరిన నెల రోజులకే రూ. 2000 దాటడం రైతుల్లో అసంతృప్తికి దారి తీసింది.

​ మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా రైతు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు అంతరాయాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా భవిష్యత్తులో యూరియా కొరత వచ్చే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే రైతుల్లో కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్ వంటి అంశాలపై భయం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యూరియా సరఫరా సక్రమంగా వచ్చేలా ప్రయత్నించాలి. బ్లాక్ మార్కెట్‌పై కొరడా ఝుళిపించి, అక్రమార్కులను అణచివేయాలి.​

సాగునీళ్లు వస్తాయా? ఎరువులు అందుతాయా? పెట్టుబడి తిరిగి వస్తుందా? మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం స్పందిస్తుందా? ఇలా రైతు మదిలో మెదులుతున్న సందేహాలను నివృత్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం పరిస్థితి ఇంకా అదుపు తప్పలేదు. ధాన్యం కొనుగోళ్లు, డబ్బులు చెల్లింపు గతం కంటే కొంత వరకు మెరుగ్గా వున్నా మిగిలిన పంటల విషయంలో మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహంగా ఉన్నారు.​

వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాలు పత్రాల చుట్టూ, పట్టాలు, యాప్ ల చుట్టూ తిరిగితే, నిజంగా సాగు చేస్తున్న రైతు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అరవై శాతం కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారన్న సంగతి ప్రభుత్వానికి తెలియనిది కాదు. కాబట్టి, భూమి యాజమాన్యాన్ని గుర్తించే విధానం కాకుండా, భూమిపై నిజంగా సాగు చేస్తున్న వ్యక్తిని గుర్తించే వ్యవస్థ అవసరం. రైతు గోడు పట్టించుకుని, యూరియా కార్డులకు బదులు పంటలు సాగుచేస్తున్న రైతులందరికీ వ్యవసాయ శాఖ ద్వారా సాగు దృవీకరణ పత్రాలు జారీ చేసి, ఆ దృవీకరణ పత్రాలు ఆధారంగా కౌలు రైతులకు యూరియా, ఇతర ఎరువులను సబ్సిడీపై సరఫరా చేస్తూ, పంట అమ్ముకునే అవకాశాలు కల్పించాలి. “ఈ వ్యవస్థ నన్ను గుర్తిస్తోంది” అని భావిస్తే రైతు కష్టాల్లో కూడా సాగు కొనసాగిస్తాడు. కానీ “వ్యవస్థ నన్ను గుర్తించడం లేదు” అనే భావన మొదలైతే, మొదటికే మోసం తెస్తాయి.

dilip reddy

వ్యాసకర్త : ఆర్.దిలీప్ రెడ్డి,

రాజకీయ విశ్లేషకులు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్