test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసహజ ప్రసవం నుంచి సిజేరియన్ వైపు…

3 రోజుల క్రితం

baby
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 05, 2026, 05:45 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రజారోగ్య సవాలు

మన దేశంలో మాతా-శిశు ఆరోగ్య రంగం గత రెండు దశాబ్దాల్లో విశేషమైన పురోగతి సాధించింది. అత్యధిక ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. మాతా శిశు మరణాల రేటు తగ్గింది. గర్భిణీల ఆరోగ్య పర్యవేక్షణ మెరుగుపడింది. ఇది ఒక గొప్ప ప్రజారోగ్య విజయ గాథ. అయితే దీని వెనుక మరో ప్రశ్న నిశ్శబ్దంగా పెరుగుతోంది. సహజ ప్రసవాలు తగ్గిపోతున్నాయా? సిజేరియన్ శస్త్ర చికిత్సలు అవసరానికి మించి పెరుగుతున్నాయా? ఈ ప్రశ్నకు కారణం తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌.ఎఫ్‌.హెచ్‌.ఎస్‌-6) గణాంకాలే.

తెలంగాణలో మొత్తం ప్రసవాల్లో 62.2 శాతం సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటు 52.2 శాతం. దేశ సగటు 27.2 శాతం మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాలు జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెండింతల స్థాయిలో ఉన్నాయి. తెలంగాణలో ప్రతి పది ప్రసవాల్లో ఆరు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పది ప్రసవాల్లో ఐదు ప్రసవాలు శస్త్రచికిత్స ద్వారానే జరుగుతున్నాయి.
ఇవి కేవలం గణాంకాలు కావు. సమాజంలో, ఆరోగ్య వ్యవస్థలో, వైద్య సేవల్లో, కుటుంబాల ఆలోచనల్లో వచ్చిన మార్పులకు అద్దం పడుతున్నాయి.

ప్రసవాల్లో తెలుగు రాష్ట్రాల ప్రత్యేకత

వాస్తవానికి తెలుగు రాష్ట్రాలు ప్రసూతి సేవల విస్తరణలో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. గర్భిణీలకు వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహార కార్యక్రమాలు, అత్యవసర రవాణా సేవలు, ప్రసూతి ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆసుపత్రి ప్రసవాలు పెరగడం ఎంత మంచి విషయమో, అదే సమయంలో సిజేరియన్ ప్రసవాలు అసాధారణంగా పెరగడం అంతే ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 83.9 శాతం సిజేరియన్లు. ఎ.పి లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ రేటు రాష్ట్ర సగటు కంటే గణనీయంగా ఎక్కువగా వుందని సర్వేలు సూచిస్తున్నాయి.

సిజేరియన్ ఎందుకు అవసరం?

ఈ చర్చలో ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సిజేరియన్ శస్త్రచికిత్స అనేది శత్రువు కాదు. ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటి. గర్భస్థ శిశువుకు ఆక్సిజన్ సరఫరా తగ్గినప్పుడు, ప్రసవం ఎక్కువసేపు నిలిచిపోయినప్పుడు, గర్భంలో బిడ్డ అడ్డంగా ఉన్నప్పుడు, మావి సమస్యలు ఉన్నప్పుడు, తీవ్రమైన రక్తపోటు వంటి పరిస్థితుల్లో సిజేరియన్ తల్లి, శిశువు ప్రాణాలను కాపాడుతుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు ఈ శస్త్రచికిత్స వల్ల రక్షించబడ్డాయి. కాబట్టి ప్రశ్న సిజేరియన్ మంచిదా చెడ్డదా అనేది కాదు. అవసరమైనప్పుడు తప్పనిసరిగా జరగాలి. కానీ అవసరం లేనప్పుడు కూడా జరుగుతోందా అనే అంశమే పరిశీలించాల్సి వుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఎక్కువ?

సిజేరియన్ రేట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిగా, మహిళల జీవనశైలి మారింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆలస్య వివాహాలు ఎక్కువ. 30 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే మహిళల సంఖ్య పెరిగింది. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు కూడా పెరిగాయి. ఇవన్నీ కొంతమేరకు సిజేరియన్ అవసరాన్ని పెంచుతాయి. రెండవది, వంధ్యత్వ చికిత్సలు. ఐవిఎఫ్ వంటి పద్ధతుల ద్వారా గర్భం దాల్చే మహిళల సంఖ్య పెరుగుతోంది. చాలామంది వైద్యులు, కుటుంబాలు ఇలాంటి గర్భధారణలను “అమూల్య గర్భాలు”గా భావించి అధిక జాగ్రత్తలు తీసుకుంటారు. మూడవది, చిన్న కుటుంబాల ధోరణి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమవుతున్న కుటుంబాలు ఎటువంటి ప్రమాదం తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. “ఆపరేషన్ అయితే సురక్షితం” అనే భావన బలపడుతోంది. నాలుగవది, ప్రసవ నొప్పుల పట్ల భయం. సహజ ప్రసవం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మహిళలు, కుటుంబాలు ముందుగానే సిజేరియన్‌ను కోరుతున్నారు.

అధికంగా వినవస్తున్న “రిస్క్”

ప్రజారోగ్య నిపుణులు మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రసవం సహజమైన జీవ ప్రక్రియ. కానీ క్రమంగా అది పూర్తిగా వైద్య నిర్వహణ అవసరమయ్యే ప్రక్రియగా మారుతోంది. గర్భధారణ ప్రారంభం నుంచే అనేక పరీక్షలు, స్కానింగ్‌లు, పర్యవేక్షణల మధ్య మహిళలు “రిస్క్” అనే పదాన్ని ఎక్కువగా వింటున్నారు. దాంతో సహజ ప్రసవంపై నమ్మకం తగ్గి సిజేరియన్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రుల నిర్వహణ, సమయ ప్రణాళిక, చట్టపరమైన భయాలు కూడా వైద్య నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి

సిజేరియన్ ప్రసవాలకు సంబంధించి తెలంగాణ 62.2 శాతం, ఆంధ్రప్రదేశ్ 52.2 శాతం రేట్లతో దేశంలో అగ్రస్థానాల్లో ఉండగా, నాగాలాండ్‌లో కేవలం 13.2 శాతం మాత్రమే ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా రేట్లు చాలా తక్కువ. అయితే తక్కువ రేటు ఉన్న రాష్ట్రాలనే ఆదర్శంగా చెప్పలేం. ఎందుకంటే అక్కడ అవసరమైన సిజేరియన్లు కూడా అందుబాటులో లేకపోవచ్చు. వైద్య మౌలిక వసతులు తక్కువగా ఉండటం, నిపుణుల కొరత వంటి కారణాలు ఉండవచ్చు. అందువల్ల తక్కువ రేటు కూడా సమస్య కావచ్చు. ఎక్కువ రేటు కూడా సమస్య కావచ్చు. ప్రజారోగ్య దృష్టిలో సరైన ప్రశ్న ఏమిటంటే – అవసరమైన మహిళకు సిజేరియన్ అందుతోందా? అవసరం లేని మహిళకు సిజేరియన్ జరగడం లేదా?

మహిళల ఆరోగ్యంపై ప్రభావం

సిజేరియన్ కూడా ఒక పెద్ద శస్త్రచికిత్సే. ఆధునిక వైద్య సదుపాయాల వల్ల ఇది సురక్షితంగా మారినప్పటికీ కొన్ని ప్రమాదాలు ఉంటాయి. సహజ ప్రసవంతో పోలిస్తే కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తరువాతి గర్భధారణల్లో కూడా కొన్ని ప్రత్యేక ప్రమాదాలు పెరుగుతాయి. ఆర్థిక భారం కూడా ఎక్కువే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజేరియన్ ఖర్చు సహజ ప్రసవంతో పోలిస్తే అనేక రెట్లు అధికంగా ఉంటుంది.

ఇక ఏం చేయాలి?

ఈ సమస్యకు పరిష్కారం సిజేరియన్లను బలవంతంగా తగ్గించడం కాదు. అలాగే వాటిని యథేచ్ఛగా పెరగనివ్వడం కూడా కాదు. మొదటిగా, ప్రతి ఆసుపత్రి తన సిజేరియన్ రేటును బహిరంగంగా ప్రకటించాలి. ప్రజలకు సమాచారం అందుబాటులో ఉండాలి. రెండవది, గర్భిణీలకు ప్రసవంపై శాస్త్రీయ అవగాహన కల్పించాలి. సహజ ప్రసవం ఎప్పుడు సాధ్యం? సిజేరియన్ ఎప్పుడు అవసరం? అనే విషయాలు స్పష్టంగా తెలియాలి. మూడవది, ప్రసూతి సేవల్లో మిడ్‌వైఫ్‌ల పాత్రను బలోపేతం చేయాలి. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో మిడ్‌ వైఫ్ ఆధారిత ప్రసూతి సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. నాలుగవది, సిజేరియన్ అవసరాన్ని శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా క్రమం తప్పకుండా సమీక్షించాలి.

సమతుల్యతే పరిష్కారం

తెలుగు రాష్ట్రాలు మాతా-శిశు ఆరోగ్య రంగంలో గణనీయమైన విజయాలు సాధించాయి. ఇప్పుడు వాటి ముందు ఉన్న కొత్త సవాలు ప్రసవాల సంఖ్య కాదు, ప్రసవాల నాణ్యత. సహజ ప్రసవం, సిజేరియన్ రెండూ పరస్పర విరుద్ధాలు కావు. రెండింటికీ వైద్యపరంగా తమదైన స్థానం ఉంది. కానీ ఏ మహిళకు ఏది అవసరమో అది శాస్త్రీయంగా నిర్ణయించబడాలి. ప్రతి సిజేరియన్ వెనుక ఒక స్పష్టమైన వైద్య కారణం ఉండాలి. ప్రతి సహజ ప్రసవానికి తగిన మద్దతు ఉండాలి. ప్రసవం ఒక వ్యాపార నిర్ణయం కాకూడదు; అది ఆరోగ్య నిర్ణయం కావాలి. తెలుగు రాష్ట్రాలు రెండూ ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలిచాయి. ఆసుపత్రి ప్రసవాలను సాధారణం చేసిన తర్వాత, ఇప్పుడు అవసరమైన వైద్య జోక్యం, సహజ ప్రసవం మధ్య సరైన సమతుల్యతను సాధించడం వాటి ముందున్న అసలు ప్రజారోగ్య సవాలు. అదే తల్లి ఆరోగ్యాన్ని, శిశు ఆరోగ్యాన్ని, భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని మరింత బలపరుస్తుంది.

dr-rama-

-వ్యాసకర్త ఆరోగ్య రంగ విశ్లేషకులు డా. ఎం. రమాదేవి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్