తాజా శాసనసభ ఎన్నికల తర్వాత ప్రధాన జాతీయ ప్రాంతీయ పార్టీలు తమ తమ సమీక్షలలోనూ, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే మార్గాన్వేషణలోనూ నిమగమై వుంటే కాంగ్రెస్ పార్టీ వున్న మూడు మంత్రివర్గాల కూర్పులు మార్పులలో తలమునకలవుతున్నది. మత రాజకీయాలు, చొరబాటు దార్ల తొలగింపు, ‘సర్’ వేగవంతం వంటి అంశాలపై మోడీ ప్రభుత్వం దాడి పెంచుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం తమ వారిని సర్దుబాటు చేయడంలో మునిగితేలుతున్నారు. ఎన్నికలు జరిగిన అయిదు రాష్ట్రాలలోనూ తాము గెలిచిన ఒకే ఒక్క కేరళంలో ముఖ్యమంత్రిని ఎంచుకోవడానికి పదిహేను రోజులు పట్టడం ఒకటైతే ఆ వచ్చిన ముఖ్యమంత్రి సతీషన్ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఇ.డి దాడులు చేయించడం ప్రాధాన్యతగా పెట్టుకోవడం మరో విపరీతం. ఈ లోగానే కర్ణాటకం పునరావృతమై సిద్ధరామయ్య స్థానంలో డి.కె.శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడుతున్నారు. ఇన్నిటి మధ్యనా తమిళనాడులో యాభై తొమ్మిదేళ్ల తర్వాత మంత్రివర్గంలో దూరగలిగామన్న ఆనందం మాత్రమే కాంగ్రెస్‌కు మిగిలింది. అయితే అందుకోసం హడావుడిగా డిఎంకె కూటమిని విడిచి పెట్టి టివికెను వాటేసుకోవడం అక్కడ మాత్రమేగాక దేశంలో ఇతర చోట్ల కూడా వారిపై విమర్శ తెచ్చిపెట్టింది. 2028లో ఎన్నికలు జరగవలసిన ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన శక్తిగా వున్న సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ చర్యను నిరసించడం ఇందుకు నిదర్శనం.
రాహుల్‌పై రామచంద్ర గుహ!
ఇదే సమయంలో ప్రతిపక్ష నేతగా వున్న రాహుల్ గాంధీ పాత్రపైనా, ప్రభావంపైనా కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఉదాహరణకు ప్రముఖ చరిత్ర రచయిత రామచంద్ర గుహ అయితే రాహుల్ గాంధీ ప్రస్తుత రాజకీయ సవాళ్లను దీటుగా ఎదుర్కోలేరని తేల్చిపారేశారు. 2008లో రాహుల్ కాంగ్రెస్ నాయకత్వం చేపట్టినప్పుడు ఆ పార్టీకి దేశంలో 1204 మంది శాసనసభ్యులు వుంటే ఇప్పుడు ఆ సంఖ్య సగానికి సగం తగ్గి 676కు పడిపోయిందని గుహ లెక్క వేశారు. రాహుల్ గాంధీ క్రమపద్ధతిలో కృషి చేయలేరని, మోడీకి సమవుజ్జీ కాలేరని కూడా తీర్పునిచ్చారు. అయితే అంతమాత్రాన మోడీ సర్కారు బిజెపి ప్రయోగిస్తున్న మత రాజకీయాలు, అప్రజాస్వామిక పోకడలు చిరకాలం కొనసాగబోవని కూడా ఆశాభావం వెలిబుచ్చారు. ఎన్నికల సర్వేలు చెప్పే ప్రదీప్ గుప్తా మరో అడుగు ముందుకేసి 2034 వరకూ బిజెపి పాలన వుంటుందని ఏదో జోశ్యం చెప్పారు. దేశంలో రాజకీయ చర్చలు, అభిప్రాయ సృష్టి ఏ దిశలో వున్నాయో తెలియడానికి ఇవి కొన్ని సూచనలు మాత్రమే. కాంగ్రెస్‌పై దాడి చేయడం ద్వారా తమను గొప్ప చేసుకోవడం బిజెపి నాయకత్వ వ్యూహంగా వుంటోంది. 2012 నుంచే రాహుల్ గాంధీ కన్నా నరేంద్ర మోడీ మెరుగనే రీతిలో వారు ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో మోడీ షెహన్ షా అంటూ రాహుల్ పైనే గురి పెట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. రాహుల్ గాంధీ వైఫల్యం వల్లనే కాంగ్రెస్ ఈ స్థితికి వచ్చిందని ఆ పార్టీలో చాలామంది విమర్శిస్తుంటే ఆయనే పరిష్కార ప్రదాత అని మరికొంతమంది చెబుతుంటారు. అతి పురాతన పార్టీగా టముకు వేసుకునే కాంగ్రెస్ నేతలు మాత్రం తాము ఈ స్థితికి చేరుకోవడానికి కారణమేమిటని సమీక్షించుకోవడానికి, సవరించుకోవడానికి సిద్ధపడటం లేదు.
పి.వి టు మోడీ
అప్రజాస్వామికమైన కాంగ్రెస్ గుత్తాధిపత్యం 1970లలో దశలవారీగా బీటలు వారి 1990ల తర్వాత అది వున్న పార్టీలలో కాస్త పెద్దదిగా మాత్రమే మిగిలింది. దీనికి కారణం కూడా కాంగ్రెస్ స్వయంకృతాలే. మతతత్వ శక్తుల పెరుగుదలకు దోహదం చేసింది కూడా ఆ పార్టీయేనన్నది చారిత్రిక సత్యం. సరళీకరణకు మత మార్కెట్‌తత్వాలు బొమ్మ-బొరుసు అనుకుంటే ఈ రెంటికీ బీజాలు పడింది 1991-1996 పి.వి.నరసింహారావు పాలనా కాలంలో. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ప్రవేశపెట్టిన విధానాలు ఒకవైపు, ఇటు అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసానికి అవకాశమిచ్చిన రాజకీయాలు మరోవైపు ఇందుకు దారితీశాయి. విదేశాంగ విధానంలోనూ అలీన విధానాన్ని విడనాడి అమెరికా పంచన చేరడం పెరిగింది. ఇదంతా కాంగ్రెస్ ప్రజా పునాదిని తొలిచేస్తూ వచ్చింది. 1996-98 ప్రత్యామ్నాయ ప్రభుత్వాల తర్వాత వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో గుజరాత్ మారణహోమం, సంఘ పరివార్ శక్తుల విజృంభణ, అమెరికాకు దాసోహమనడం వంటివన్నీ కలసి వారి ఓటమికి దారితీశాయి. ఆ క్రమంలో వామపక్షాలు కూడా కీలక పాత్ర పోషించాయి. వాటి ఒత్తిడి కారణంగానే గ్రామీణ ఉపాధి హామీ వంటి మంచి పథకాలు వచ్చాయి. కాని విదేశాంగ విధానంలోనూ ఆర్థిక రంగంలోనూ కాంగ్రెస్ ధోరణులు మరింత దారుణంగా తయారైనాయి. అటు అలీన విధానాన్ని ఇటు అణుశక్తి రంగాన్ని కూడా అమెరికాకు తాకట్టు పెట్టే విధంగా అణు ఒప్పందం కుదుర్చుకున్నారు. వామపక్షాలు వ్యతిరేకిస్తే ఇతర పార్టీల సభ్యులను కొనుగోలు చేసి అధికారం కాపాడుకున్నారు. ఇదంతా ఒక జుగుప్సాకర అధ్యాయం. ఇప్పుడు మోడీకి అమెరికా బ్రహ్మరథం గురించి మురిసిపోయేవారు గతంలోకి తొంగి చూస్తే మొదట్లో మన్మోహన్‌నూ ఇలాగే మునగ చెట్టెక్కించిన సంగతి తెలుస్తుంది. ఇరాన్‌పై దురాక్రమణ తర్వాత ఇంధన సంక్షోభం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో విశ్వగురు మోడీ విలవిలలు వెక్కిరిస్తున్న తీరు కనిపిస్తూనే వుంది. విదేశాంగ విధానం విషయంలోనూ ఇప్పటికీ రాహుల్ గాంధీ చైనాకు లొంగుబాటు విమర్శనే ప్రధానంగా తీసుకొస్తుంటారు తప్ప అమెరికాతో వ్యూహాత్మక దోస్తీని ప్రశ్నించరు.
వాస్తవానికి 2024 ఎన్నికలలోనే ప్రజలు బిజెపి కి పూర్తి మెజార్టీ ఇవ్వడానికి నిరాకరించారు. లౌకిక పార్టీలకే ఆధిక స్థానాలిచ్చారు గానీ ఆ శక్తుల మధ్య ఐక్యత లేకపోవడం, వాటిలో కొన్ని ప్రాంతీయ పార్టీలు మోడీని మోసేందుకు పాకులాడటం ఆయన కొనసాగడానికి కారణమైంది. రాహుల్ గాంధీ పాఠాలు నేర్చుకున్నారనీ, పట్టు పెంచుకున్నారనీ తమ పార్టీని గట్టెక్కిస్తారని ఆయన అనుయాయులు ప్రచారం చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ కాదు ప్రియాంక గాంధీ, ఓపిక మేరకు సోనియా గాంధీ నడిపించకపోతే కుదరదని చెప్పే ఒక వర్గం కాంగ్రెస్‌లో ఇప్పటికీ బలంగా వుంది. వామపక్షాల కేంద్రమైన కేరళం నుంచే వారిద్దరినీ పోటీకి పెట్టింది వీరే. బిజెపి ప్రాబల్యానికి కీలకమైన ఉత్తర భారతంలో గాక లౌకిక శక్తుల ప్రభావం అధికంగా వున్న దక్షిణాదికి అన్నా చెల్లెలు తరలిరావడం ఒక విచిత్రమే. వారిద్దరిలో ఎవరు మెరుగనే మీమాంస ఆ పార్టీకే వదలిపెట్టినా ఇద్దరూ కలిసి కాంగ్రెస్ తీరుతెన్నులు ఏ మాత్రం మార్చారనేది అసలు ప్రశ్న.
2025, 26లో ఎన్నికలు జరిగిన బీహార్, హర్యానా, అస్సాం అన్ని చోట్లా కాంగ్రెస్ పల్టీ కొట్టింది. తామేదో పెరిగిపోయామంటూ అధిక స్థానాల కోసం పట్టు పట్టి ఐక్య పోటీకి గండికొట్టింది. సర్వేలు అనుకూలంగా వచ్చినా హర్యానాలో అత్యాశకు పోయి ఇతరులతో సర్దుబాట్లకు కాలడ్డం పెట్టింది. ఢిల్లీ ఎన్నికలలోనూ ఆప్‌ను ప్రధాన శత్రువుగా పరిగణించి బిజెపి మరింతగా గెలవడానికి ఉపకరించింది. తానే ప్రధాన ప్రతిపక్షంగా వున్న అస్సాంలో బిజెపి మత విద్వేష రాజకీయాలపై తీవ్ర నిరసన వున్నా ప్రజాస్వామిక శక్తులను కూడగట్టి ఎదుర్కోవడంలో విఫలమై అంతర్గత కలహాలతో అపజయం మూట కట్టుకుంది. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి దూకుడూ, తృణమూల్ కాంగ్రెస్ నిరంకుశ పాలనపై వామపక్షాలతో కలసి పోరాడటానికి నిరాకరించింది. డిఎంకె పాలనలోని తమిళనాడులోనైతే ముందస్తుగా మంత్రివర్గంలో భాగస్వామ్యం, అధిక స్థానాలు కావాలంటూ పేచీలు పెట్టింది. తీరా ఫలితాలు వచ్చీ రాకముందే కూటమిని వదిలేసి టివికె వైపు దూకి విమర్శలు మూటకట్టుకుంది. బిజెపి మత రాజకీయాలను ఢీకొనడంలో అగ్రగామిగా వున్న సిపిఎం-ఎల్‌డిఎఫ్ లనే దానితో కుమ్మక్కు అయినట్టుగా విషప్రచారం చేసింది. బిజెపితో పోటీ పడి ఆ ప్రభుత్వంపై బురదజల్లింది.
అనైక్యత ముప్పు
లౌకిక శక్తులతో విశాల ఐక్యత విషయం అలా వుంచి అంతర్గతంగా తమ పార్టీలో అనైక్యతను నివారించడంలోనూ విఫలమైంది. నిజానికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా అన్ని చోట్లా గత ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ ముఠాల వారి తగాదాలతో సతమతమై తనకు తానే హాని చేసుకుంది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్-జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్-సచిన్ పైలెట్, చత్తీస్‌గఢ్‌లో భూపేష్ బగేల్-టి.ఎస్.సింగ్ డియో, హిమాచల్‌లో వీరభద్ర సింగ్-సుఖ్వీందర్ సింగ్, ఇలా రెండు శిబిరాలుగా నడిచింది. వారికి రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పదవుల కేటాయింపులు, మధ్యంతర మార్పులు జరక్కపోవడం, అధికారం వున్న అశోక్ గెహ్లాట్ వంటి వారు ప్రత్యర్థులపై వేటు వేయడం వంటి పరిణామాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. క్షేత్ర స్థాయిలో పట్టుగల కొత్త నాయకత్వం-విజయం తర్వాత లోపల పాచికలు వేసే పాత నాయకత్వం మధ్య ఘర్షణలతో కాంగ్రెస్ అతలాకుతలమై అనేకమంది బిజెపిలో చేరిపోయారు. ఆ మాటకొస్తే ఇప్పుడు అస్సాంలో అందరినీ రెచ్చగొడుతున్న హిమంత బిశ్వ శర్మ కూడా కాంగ్రెస్ నుంచి వెళ్లినవారే. మొన్నటి ఎన్నికలలోనూ అక్గొ గొగొయ్ నాయకత్వంపై వివాదం నడిచింది. ఆ పార్టీ విజయం సాధించిన కేరళంలో ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి పదిహేను రోజులు పట్టింది. ఒకప్పుడు ఇందిరా గాంధీ బీహార్‌లో ఒక టర్మ్‌లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చారు. ఎ.పి లో ఎన్టీఆర్ విజయానికి ముందు కూడా నలుగురు మారారు. రాజీవ్ గాంధీ హయాంలో నాలుగేళ్లలో 22 మంది ముఖ్యమంత్రులను మార్చారు. దానివల్ల ఆ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కొడిగట్టి పోయింది. ఇప్పటికీ అందరూ గాంధీ కుటుంబం అంటున్నా వారి మాట చెల్లుబాటు కావడం లేదని ఇప్పుడు దేశమంతటికీ తెలిసిపోయింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఢిల్లీకి రావడానికి నిరాకరించడం, తన వర్గం పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నించడం ఎలాంటి ప్రభావం చూపుతుందోననే ఆందోళన కాంగ్రెస్‌లో వుంది. ఇప్పుడు కేరళం ముఖ్యమంత్రి సతీషన్ ముస్లింలీగ్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నారనే బలమైన అభిప్రాయం వుంది. సిపిఎం బిజెపితో కలిసిందని అసత్యారోపణలు చేస్తూ మళ్లీ ఆ కేంద్రం వత్తాసుతో పినరయి విజయన్‌పైనా, ఎల్‌డిఎఫ్ పైనా దాడులు చేయించడం కాంగ్రెస్ అవకాశవాదాన్ని తెల్పుతుంది. మోడీ సర్కారు నిరంకుశ పోకడలపై విశాల పోరాటం పెంచేబదులు తన స్థానిక సంకుచిత ప్రయోజనాలు అంతర్గత అనైక్యతలకే పెద్దపీట వేయడం ప్రజాస్వామ్యానికి నష్టదాయకం. 2024 ప్రజల తీర్పు తర్వాత ఓటు హక్కుకూ పౌరసత్వ ప్రతిపత్తికీ బిజెపి ఎసరుపెట్టడం ఒక యాంటీ క్లైమాక్స్‌గా మారుతున్నదని కాంగ్రెస్ గ్రహించడం అవసరం.









కామెంట్‌లు (0)