ఈ మధ్యనే నేపాల్ ప్రధాని పదవి చేపట్టిన బలేన్ షా యువ గాయకుడు, జన్ జీ ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు కూడా. అయితే వచ్చిన కొద్ది రోజులలోనే ఆయన సహచరులు కొందరు అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చింది. తాజాగా ఆయన పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. భారత దేశం నేపాల్ భూభాగాలు ఆక్రమించుకోవడమే కాదు, నేపాల్ కూడా భారతీయ భూభాగాలు ఆక్రమించిందని ఆయన సెలవివ్వడం షాకిచ్చింది. ఇలాంటివి ఏమైనా వుంటే అంతర్గత చర్చలలో చూసుకుంటారు గానీ ఈయన ఏకంగా తామే ఆక్రమించామని చెప్పడం ద్వారా ఏం సంకేతం ఇవ్వాలనుకున్నారనే ప్రశ్న వచ్చింది. అంతేగాక ఈ సమస్యల పరిష్కారంలో బ్రిటన్‌ను కూడా భాగస్వామిని చేయాలని చెబుతున్నారు. సాధారణంగా దేశాలు ద్వైపాక్షిక సమస్యలలో మూడో దేశం జోక్యం వుండొద్దని పట్టు పడతాయి. షా మాత్రం బ్రిటన్ వుండాలంటున్నారు. గతంలో వలస పాలన చేసిన వారు వెళ్లిపోయేప్పుడు ఏ స్థితిలో వుందో చెప్పాలనేది ఆయన వాదన. బ్రిటన్ ఎలాగూ అమెరికాకు నమ్మకమైన మద్దతుదారు. అసలే నేపాల్ అనగానే భారత్-చైనాల మధ్య వివాదం వచ్చేలా మాట్లాడుతుంటారు. మరి ఈ తాజా వ్యాఖ్య ఎటు దారి తీస్తుందో తెలియదు. షా ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆయన పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్ర దళ్ ప్రతినిధి బృందం బిజెపితో స్నేహ సంబంధాలు పెంచుకోవడం కోసం భారతదేశంలో పర్యటిస్తుండటం కొసమెరుపు. అయితే చివరకు మాత్రం బయట దేశాల పాత్ర వద్దని ఇండియా చెప్పింది. ఇది లాంఛనం కాదు కదా?
దీపికా డీప్ కామెంట్స్
మామూలుగా కథానాయికలు ఆచితూచి మాట్లాడుతుంటారు. తమకు సంబంధించిన విషయాలు వివాదాలు కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే అద్దాల మేడ వంటి చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వారిపై వదంతుల కోసమే పెద్ద వ్యవస్థలు పని చేస్తుంటాయి. దీర్ఘ కాలంగా బాలీవుడ్‌ను ఏలుతున్న దీపికా పదుకునే మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆమె తన వ్యక్తిగత విషయాలే గాక సమాజానికి, ప్రజలకు సంబంధించినవి కూడా బహిరంగంగా స్పందిస్తుంటారు. కొమ్ములు తిరిగిన హీరోల కన్నా దృఢంగా వుంటారని ఆమెకు పేరు. తన డిప్రెషన్‌ను ఎదుర్కొన్న తీరును బహిరంగంగానే పంచుకున్నారు. ధైర్యంగా, స్వతంత్రంగా వుండటం ఎలాగో కోట్స్ పెడుతుంటారు. వృత్తిపరంగానూ ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. అన్నిటినీ మించి 2020లో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీపై నిర్బంధం విరుచుకు పడినప్పుడు ధైర్యంగా సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఇది బిజెపి వర్గాలకు అసలు నచ్చలేదు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్ ఆర్మీ గట్టిగానే దాడి చేస్తున్నది. కొన్నాళ్ల కిందట దీపిక ‘కల్కి 2’ నుంచి తప్పుకోవడం సంచలనమైంది. ఇక తాజాగా తన భర్త, నటుడు రణవీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ను దీపిక ప్రశంసించలేదని కూడా ట్రోల్స్ రావడం మరీ విపరీతంగా కనిపిస్తుంది. భారత్-పాకిస్తాన్ ఘర్షణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం రణవీర్‌కు చాలా పేరు తీసుకొచ్చింది. దీనిపై దుమారం నడిచాక దీపిక ఆలస్యంగా, క్లుప్తంగా స్పందించారు. ‘ఆయన నా నెచ్చెలి. మీ అందరి కంటే ముందు ఆ చిత్రం చూశాను’ అని పేర్కొన్నారు. ఇంటర్‌నెట్ మరీ అతిగా ఆలోచిస్తున్నదని కూడా చురకలంటించారు. అన్నట్టు షూటింగులు వేళాపాళా లేకుండా సాగదీసే బాలీవుడ్‌లో మహిళలే అధికంగా ఇబ్బంది పడుతున్నారని కూడా ఆమె విమర్శ. అందుకే ఖచ్చితంగా ఎనిమిది గంటల షెడ్యూలు కోసం పట్టు పడతారని కూడా కొందరికి కోపం, ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట గట్టిగా నిలబడితేనే కదా…మార్పులు వచ్చేది?
సెర్చి ఇంజన్లను మర్చిపోనివ్వరా?
కాలం మారుతుంది. చేసిన గాయాలు మాన్పుతుంది…అని మనోహరమైన ఘంటసాల పాట. అయితే కాలం మారినా, మానినా మేం మాననివ్వమని సెర్చి ఇంజన్లు అనడం సరైంది కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎవరి మీదైనా ఒక ఫిర్యాదో, పితూరినో వస్తుంది. కోర్టులకు వెళుతుంది. కింద నుంచి పై దాకా కోర్టులన్నీ తిరిగి ముగుస్తుంది. చాలా కేసులు కొట్టివేయబడుతుంటాయి. ఆ వ్యక్తులు విడుదలవుతారు. కానీ ఆ ఆరోపణలు, ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలు పరిణామాలు గూగుల్ సెర్చి వంటి వాటిలోనూ కోర్టుల రికార్డులలోనూ నిక్షిప్తమై వుంటాయి. ప్రత్యర్థులు, గిట్టనివారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని ప్రచారంలో పెడుతుంటారు. వాటి ఆధారంగా దాడి చేస్తుంటారు. ఒక వ్యవహారం పరిష్కారమైన తర్వాత కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆ పత్రాలను తీసి దాడి చేస్తుంటే ఎలా? మరుపు హక్కు వుండాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఒక వ్యవహారం ముగిసి సంబంధిత నిందితుడిపై ఆరోపణ కొట్టివేశాక అంతకు ముందరి వివరాలన్నీ తొలగించాల్సిందేనని, లేకుంటే వ్యక్తుల గోప్యత హక్కుకు భంగం కలిగించి వారి పరువు ప్రతిష్టలకు నష్టం చేస్తుందని స్పష్టం చేసింది.
అహో రాత్రులూ అదే ధ్యాస?
బిజెపి, ఆరెస్సెస్‌లకు అహోరాత్రులూ ఎన్నికల ధ్యాసే. ఇది చాలా గొప్ప లక్షణమని పొగిడేవారు పొగుడుతుంటారు సరే. నయాన భయాన సామదాన భేద దండోపాయాలతో త్రిశూల వ్యూహాలతో కుల మత పాచికలతో గెలవడమే రాజకీయ పార్టీలకు ఏకైక లక్ష్యం కావడం గొప్ప విషయమేమీ కాదు. అయితే బిజెపి భక్తులకు మాత్రం అదే గొప్ప. 10 వేల కోట్ల వ్యయంతో బిజెపి ఎన్నికల యంత్రాంగం నిరతం పని చేస్తూ మీడియాను ముంచెత్తుతూ వుంటుంది. 2027లో వచ్చే యు.పి శాసనసభ ఎన్నికలను జీవన్మరణ సవాలుగా భావించిన బిజెపి అప్పుడే ఆ దిశలో అడుగులేస్తున్నది. తాజాగా నాగేంద్రనాథ్ త్రిపాఠి అనే ఆయనను ఆరెస్సెస్ నుంచి యు.పి ఎన్నికల కోసం కేటాయించింది. ఈయన గతంలో బీహార్, జార్ఖండ్ లలో పని చేశారు. ఇప్పుడు ఈయనను జాతీయ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా నియమించారు. చేసే పని ఏమంటే సీనియర్ కార్యకర్తలకు అందుబాటులో వుండటమే. ఆరెస్సెస్ కుదురు గనక హిందూత్వ భావజాలంలో దిట్ట అయిన త్రిపాఠి బ్రాహ్మణ ఓటర్లలో తమపై పెరిగిన అసంతృప్తిని దూరం చేయడంపై కేంద్రీకరిస్తారట. త్వరలో ఎన్నికలు జరిగే పంజాబ్‌తో సహా నాలుగు రాష్ట్రాల బిజెపి శాఖల అధ్యక్షుల నియామకం వెనువెంటనే ఈయను తెచ్చి పెట్టారంటే చూడండి మరి! అందరికీ అంత డబ్బు, మీడియా హైప్ వుండాలంటే వుంటాయా?
– పీపీ








కామెంట్‌లు (0)