test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిగ్రీ ఉంది.. ఉద్యోగం లేదు!

5 రోజుల క్రితం

unemployment
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 11:02 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ప్యూన్‌ ‌పోస్టులకూ గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, పిహెచ్‌‌డి అభ్యర్థుల క్యూ

  • భారత ఉద్యోగ మార్కెట్‌‌లో సంక్ష‍ోభం బట్టబయలు

  • సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో చర్చనీయాంశంగా మారిన వైనం

  • కేంద్ర ప్రభుత్వ విధానాలపై 
తీవ్రమైన విమర్శలు

న్యూఢిల్లీ : ‘డిగ్రీ ఉంటే భవిష్యత్తు బాగుంటుంది’ అన్నది ఒకప్పటి మాట. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆ డిగ్రీలు కూడా యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో చదువుకున్న యువతలో నిరుద్యోగం, ఉద్యోగాల కొరత, ఉపాధి విధానాల వైఫల్యం మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. దేశంలోని మోడీ పాలనలో చదువుకున్న యువత అనుభవిస్తున్న కఠిన పరిస్థితులకు ఇది అద్దం పడుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ఏమిటి సుప్రీంకోర్టు తీర్పు?
తక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉద్యోగాలకు అధిక విద్యార్హత కలిగిన వారు పోటీ పడకూడదని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక బ్యాంక్‌ అటెండెంట్‌ ఉద్యోగం కోసం తన డిగ్రీని దాచిపెట్టిన అభ్యర్థి కేసులో ఈ తీర్పు వెలువడింది. ఇలా చేయడం ద్వారా నిజంగా అర్హులైన వారికి అవకాశాలు దూరమవుతాయని కోర్టు పేర్కొంది. నియామకాల పరంగా ఈ తీర్పు సమంజసంగానే కనిపించినప్పటికీ.. ఇది మరో కీలక ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఇంజినీర్లు, ఎంబిఎలు, పిహెచ్‌‌డిలు చేసిన వారు ఎందుకు ప్యూన్, స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు? అనేదే అసలైన ప్రశ్న.

భయంకరమైన స్థాయిలో చదువుకున్న నిరుద్యోగం
స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 నివేదిక ప్రకారం... 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగుల్లో దాదాపు 67 శాతం మంది గ్రాడ్యుయేట్లు. అంటే ఉద్యోగాలు దొరకకపోవడంతోనే అధిక విద్యార్హతలు కలిగిన యువత తక్కువ అర్హతల ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇది భారత్‌‌లో యువత అనుభవిస్తున్న నిరుద్యోగ భారాన్ని తెలియజేస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.

ప్యూన్‌ పోస్టులకు లక్ష‍ల దరఖాస్తులు
గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వెలువడిన పలు ఉద్యోగ నియామక ప్రకటనలు ఈ వాస్తవాన్ని బయటపెట్టాయి. గతేడాది ఏప్రిల్‌‌లో రాజస్తాన్‌‌లో 53,749 ప్యూన్‌ ‌పోస్టులకు గానూ 24.76 లక్ష‍లకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పిహెచ్‌‌డి హోల్డర్లు, ఎంబిఎ, లా గ్రాడ్యుయేట్లు, సివిల్‌ ‌సర్వీసులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఉన్నారు. ఎస్‌ఎస్‌‌సీ ఎంటిఎస్‌ పోస్టులకు 55 లక్ష‍లకు పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇందులోనూ గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, పోస్టుగ్రాడ్యయేట్లు ఉన్నారు. ఇక బీహార్‌, తమిళనాడు, యూపీ, పశ్చిమ బెంగాల్‌‌లో కూడా ఇంజినీర్లు, పిజి విద్యార్థులు.. స్వీపర్‌, వాచ్‌‌మన్‌, పారిశుధ్య కార్మికుల పోస్టులకు దరఖాస్తు చేసిన సందర్భాలూ ఉన్నాయి.

డిగ్రీ విలువ తగ్గుతోందా?
ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో డిగ్రీకి ఉన్న విలువపై అనేక చర్చలు నడుస్తున్నాయి. డిగ్రీ పూర్తిగా విలువ కోల్పోయిందని చెప్పలేమని విద్యావేత్తలు అంటున్నారు. డిగ్రీ ఒక్కటే ఉద్యోగానికి హామీ ఇవ్వడం లేదన్నది స్పష్టమవుతోందని చెప్తున్నారు. నేటి ఉద్యోగ మార్కెట్‌‌లో నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ ‌సామర్థ్యాలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని వివరిస్తున్నారు. సమస్యంతా నైపుణ్యాల లోపమే కాదని నిపుణులు చెప్తున్నారు. దేశంలో డిగ్రీ పట్టాలు అందుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్న వేగానికి తగిన విధంగా నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించబడటం లేదనేది ప్రధాన ఆందోళనగా వారు ఆరోపిస్తున్నారు. ఇది దేశంలో మోడీ సర్కారు వైఫల్యాన్ని బయటపెడుతోందని అంటున్నారు.

సర్కారుపై విమర్శలు
దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో కేంద్రంలోని మోడీ సర్కారు పూర్తిగా విఫలమైంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే దానిని విస్మరించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ‘స్కిల్‌ ఇండియా’, ‘మేకిన్‌ ఇండియా’, ‘స్టార్టప్‌ ఇండియా’ వంటి కార్యక్రమాలను ప్రచారం చేసినప్పటికీ... పెద్ద సంఖ్యలో స్థిరమైన ఉద్యోగాల సృష్టిలో ఆశించిన ఫలితాలు కనిపించలేదని వారు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ... చదువుకున్న యువతలో నిరుద్యోగం కొనసాగుతుండటం ఉపాధి విధానాల ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు ప్రభుత్వంలోని గ్రూప్-డి ఉద్యోగాల కోసం పోటీ పడటం ఉద్యోగ మార్కెట్లో ఉన్న అసమతుల్యతకు సంకేతమని మేధావులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు విఫలం
సుప్రీంకోర్టు తీర్పు నియామక నిబంధనలను కాపాడినప్పటికీ.. అది దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద వాస్తవాన్ని బయటపెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్య చదివిన యువతకు ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలను సృష్టించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పలువురు విమర్శిస్తున్నారు. డిగ్రీలు సంపాదించిన లక్షలాది మంది యువకులు తాము కలలు కన్న ఉద్యోగాల కోసం కాకుండా బతుకు దెరువు కోసం ఏదో ఒక ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారన్నది ఒక కఠినమైన వాస్తవమని విశ్లేషకులు వివరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్