test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పల్లె వీధుల్లో ప్రవహించిన సంగీత-సమాచార స్రవంతి

3 గంటల క్రితం

radio
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

నాకు రేడియో అంటే బాగా గుర్తుకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. మా ఊర్లో మంచినీళ్ల కోసం అర మైలు వెళ్లి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది. అలా వెళ్లినప్పుడు ఊర్లో ఉండే మూడు, నాలుగు రేడియో సెట్లు ఒకే సినిమా పాటను లయ తప్పకుండా వినిపిస్తుంటే, ఆ సంగీతంలో నేను ప్రవహిస్తున్నట్టు అనిపించేది. స్కూలుకు వెళ్లేటప్పుడు కూడా అంతే! అలాగే మా అయ్య తెలుగు వార్తలను శ్రద్ధగా వినడం కూడా గుర్తుంది. నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు రేడియో కడప ఆకాశవాణి రూపంలో పరిచయమైంది. అనంతపురంలోని మా కొనతట్టుపల్లికి ధార్వాడ, మైసూరు, బెంగళూరు వంటి కేంద్రాలు తగిలేవి గానీ, మరో తెలుగు ఆకాశవాణి కేంద్రం కలిసేది కాదు. కనుక నా వరకు రేడియో అంటే కడప; ఆకాశవాణి అంటే కడప. నేను గోవాలో ఆకాశవాణి ఉద్యోగంలో చేరినప్పుడు కూడా తెలుగు కావాలంటే కడపనే వినేవాడిని. ఎందుకంటే మరో తెలుగు రేడియో కేంద్రం వినబడేది కాదు. నిజానికి, కడప ఆకాశవాణి ట్రాన్స్‌మిటర్ ఉన్న లొకేషన్ కారణంగా ఢిల్లీ, అండమాన్ వంటి ప్రాంతాలకు కూడా కడప ప్రసారాలు చేరేవి. 63 ఏళ్ల క్రితం, 1963 జూన్ 17న మొదలైన కడప ఆకాశవాణికి ఇప్పుడు 63వ వార్షికోత్సవం.
​1938 జూన్ 16న బ్రిటిష్ ప్రభుత్వం దక్షిణాదిలో మద్రాసు పట్టణంలో ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పటికి ఆ రేడియో కేంద్రంలో ప్రసారాలు ప్రధానంగా తెలుగులోనే నడిచేవి. దీనికి సంబంధించి అప్పట్లో కొంత వ్యతిరేకత కలగడమే కాదు, సంవత్సరంలోపే మరో కేంద్రాన్ని తిరుచ్చిరాపల్లిలో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే, 1948 డిసెంబర్ 1న విజయవాడలో పూర్తిస్థాయి తెలుగు రేడియో స్టేషన్ మొదలైంది. మరోవైపు, పోలీస్ యాక్షన్ కారణంగా నిజాం ప్రభుత్వం లొంగిపోవడంతో, హైదరాబాద్‌లోని నిజాం రేడియో 1950 ఏప్రిల్ 1న ఆల్ ఇండియా రేడియోగా మారి తెలుగులో ప్రసారాలు ప్రారంభించింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రారంభమైన తొలి ఆకాశవాణి కేంద్రం కడపయే.
​కడప ఆకాశవాణి స్వర్ణోత్సవ సంవత్సరమైన 2012–13లో కొన్ని నెలలు మాత్రమే అక్కడ ప్రోగ్రామ్ హెడ్‌గా పని చేశాను. అయినా, ఎంతో తృప్తి కలిగించే కార్యక్రమాలు చేయగలిగే భాగ్యం లభించింది. రాయలసీమ ప్రాంతపు అస్తిత్వానికి సృజనాత్మక సాహిత్య కేతనమైన విద్వాన్ విశ్వం రచించిన ‘పెన్నేటి పాట’ కావ్యాన్ని గానం చేయించే ప్రణాళిక రూపొందించాను. 1956లో ఈ రచన ప్రచురితమైనా, దానిపై అంతవరకు మా ఆకాశవాణి అధికారుల దృష్టి పడలేదు. అంతేకాదు, తులసీకృష్ణ రచించిన ‘పెన్నేటి కతల’ను వారి గళం ద్వారానే రికార్డు చేసి ప్రసారం చేయించాము. సింగమనేని నారాయణ సంపాదకత్వం వహించిన ‘సీమ కథలు’ సంకలనానికి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా, ఆ కథలన్నింటినీ మా కడప అనౌన్సర్ల చేత చదివించి ప్రసారం చేశాం. ఆకాశవాణి అధికారి సత్యం శంకరమంచి సృజించిన అజరామరమైన ‘అమరావతి కథల’ను అపురూపంగా గొల్లపల్లి మంజులాదేవితో మళ్లీ చదివించాం. ఆ ప్రాంతపు తాత్విక బావుటాగా నిలిచిన సాహిత్య సంపదను ‘బ్రహ్మంగారి తత్వప్రభ’ ధారావాహికగా ప్రారంభించినా, అది ఎంతోకాలం కొనసాగలేదు.
​రాయలసీమ అప్పటి నాలుగు జిల్లాలకే కాకుండా, దరిదాపుల్లోని నెల్లూరు, పల్నాడు, కోలారు, బళ్లారి వంటి అనేక ప్రాంతాలకు కడప కేంద్రం వినబడేది. వార్తాపత్రికలు స్థానిక వార్తలను కేవలం ఆయా జిల్లాల వరకే పరిమితం చేయడం తెలిసిందే. కడప ఆకాశవాణి స్వర్ణోత్సవ సందర్భంగా, అప్పటి నాలుగు రాయలసీమ జిల్లాల నుంచి ప్రతివారం ఆకాశవాణి ప్రతినిధుల వాయిస్ ఓవర్లను టెలిఫోన్ ద్వారా రికార్డు చేసి, ‘ఈ ప్రాంతం – ఈ వారం’ పేరుతో వార్తా సమాహార కార్యక్రమాన్ని ప్రారంభించాం. వర్తమాన కాలపు అవసరాలను, అదే సమయంలో ఆకాశవాణికున్న అదనపు సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కార్యక్రమం విజయవంతంగా దశాబ్దానికి పైగా శ్రోతలను అలరించింది. అన్నిటికీ మించి, అచ్చతెలుగుకు, స్వచ్ఛమైన కవిత్వానికి ఆలవాలమైన అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి మహామహుల విశ్లేషణలతో రూపొందించిన ‘అన్నమయ్య పదగోపురం’ బ్రహ్మాండంగా నడిచింది. కడప ఆకాశవాణి నాకు ఎప్పటికీ మధురమైన అనుభవం.

- డా. నాగసూరి వేణుగోపాల్
ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు
94407 32392

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్