test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యక్తిత్వం లేని హీరోయిన్‌ పాత్రలు ఇంకెన్నాళ్లు?

2 గంటల క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 06:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఇటీవల విడుదలైన 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌ జాన్వీ కపూర్ పోషించిన పాత్రపై విస్తృత చర్చ మొదలైంది. పాత్రకు కథలో స్వతంత్ర ప్రాధాన్యం లేదని, ఆమెను ప్రధానంగా గ్లామర్ ఆకర్షణగా మాత్రమే ఉపయోగించారని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ- ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, వచ్చిన సూచనలను పరిశీలిస్తామని తెలిపారు. అవసరమైన మార్పులు చేస్తామని కూడా ప్రకటించారు. భారతీయ సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి చాలా కాలంగా కొనసాగుతున్న ప్రశ్నలను ఈ వివాదం మరోసారి ముందుకు తెచ్చింది. మన సినిమాల్లో హీరోయిన్ పాత్ర కథలో ఎందుకు ఉంటుంది? కథను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండటానికా? లేక హీరో చుట్టూ తిరిగే అలంకారంగా ఉండటానికా? అన్నది పెద్ద ప్రశ్న.

భారతీయ వాణిజ్య సినిమాల్లో హీరో సాధారణంగా కథకు కేంద్రంగా ఉంటాడు. ఆ పాత్రకు లక్ష్యం ఉంటుంది. ఆ పాత్రే కథ గమనాన్ని నిర్ణయిస్తుంది. హీరోయిన్ పాత్ర మాత్రం తరచుగా ప్రేమకు, కుటుంబానికి, అందానికి పరిమితం అవుతుంది. కథలో ఉంటుంది; కానీ కథను నడిపించే శక్తిగా చాలా సినిమాల్లో కనిపించదు. సమస్య ఏమిటంటే, ఒక పాత్రను ఆమె వ్యక్తిత్వం కంటే ఆమె రూపానికి పరిమితం చేయడం. ఆమె పాత్ర ఏమనుకుంటోంది, ఏమి కోరుకుంటోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది అనే దానికంటే, ఆమె ఎలా కనిపిస్తోంది అనే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. ఫలితంగా మహిళను స్వతంత్ర వ్యక్తిగా కాకుండా, చూడాల్సిన వస్తువుగా చిత్రీకరిస్తారు. ఆమె ఆలోచనలు, సంఘర్షణల కంటే ఆమె అందానికే ఎక్కువ స్థలం ఇస్తారు. అప్పుడు ఆమె కథలో పాల్గొనే మనిషిగా కాకుండా, ప్రేక్షకుడి చూపును ఆకర్షించే దృశ్యంగా మారిపోతుంది. మహిళ వ్యక్తిత్వానికి విలువనివ్వని సినిమాల్లో కనిపించే సర్వసాధారణ చిత్రీకరణ ఇదే!

పితృస్వామ్య ప్రతిబింబం

సమాజంలో మహిళలను ఎలా ఊహిస్తున్నామన్న ప్రశ్నకు సినిమాల్లోని పాత్రలే నిదర్శనాలు. మహిళల స్థానం, స్వేచ్ఛ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన ఆలోచనాపరురాలు సిమోన్ ద బోవార్ చెప్పినట్లుగా, పితృస్వామ్య సమాజాల్లో మహిళ తరచుగా స్వతంత్ర వ్యక్తిగా కాకుండా ఆధారపడే వ్యక్తిగా నిర్మించబడుతుంది. అంటే, తనకంటూ ఒక అస్తిత్వం ఉన్న వ్యక్తిగా కాకుండా, పురుషుడికి సంబంధించిన వ్యక్తిగా నిర్వచించబడుతుంది. మనుస్మృతిలో పేర్కొన్నట్టు - బాల్యంలో తండ్రి, వివాహానంతరం భర్త, తరువాత కుమారుడి సంరక్షణలో ఉండాల్సిన వ్యక్తిగా మలచబడుతుంది. భారతీయ సినిమాల్లో కూడా ఇదే ధోరణి అనేక రూపాల్లో కనిపిస్తోంది. చాలా సినిమాల్లో హీరో చుట్టూనే కథను అల్లుతారు. అతనికి స్నేహాలు ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి. వైఫల్యాలు ఉంటాయి. కానీ హీరోయిన్ చాలా సందర్భాల్లో హీరో ప్రేమించే యువతి, హీరో భార్య, హీరో కోసం ఎదురుచూసే వ్యక్తి అనే పరిమితుల్లోనే కనిపిస్తోంది. ఆమె ఎవరు అనే ప్రశ్న కంటే, ఆమె హీరోకి ఏమవుతుంది అనే ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంది. తెలివితక్కువగా ఉండడం, హీరో చుట్టూ తిరగటం, తీవ్రంగా భయపడడం, ఊరకనే ప్రమాదాల్లో చిక్కుకుపోయి, హీరో రక్షణ కోసం ఎదురుచూడడం ... చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ ‌స్వభావంగా ఇలాగే చిత్రీకరించటం విచారకరం.


స్వతంత్ర పాత్రలు
అయితే మన సినిమాలన్నీ ఇలాగే లేవు, ఉండవు. మహిళా పాత్రలను లోతుగా, సంక్లిష్టంగా చిత్రీకరించిన వారసత్వం కూడా భారతీయ సినిమాకు ఉంది. సత్యజిత్ రే చిత్రాల్లో చారులత, అరతి వంటి పాత్రలు తమ కోరికలు, అంతర్మథనాలు, పరిమితులతో జీవించే వ్యక్తులుగా కనిపిస్తాయి. శ్యామ్ బెనెగల్ చిత్రాల్లో మహిళలు కథలో భాగాలు కాదు; కథను మలిచే శక్తులు. ఆదూర్ గోపాలకృష్ణన్, గిరీష్ కాసరవల్లి వంటి దర్శకుల చిత్రాల్లో కూడా మహిళా పాత్రలు జీవిత సంక్లిష్టతలతో కనిపిస్తాయి. తెలుగు సినిమాలో కూడా కొన్ని ఇటీవలి మంచి ఉదాహరణలు ఉన్నాయి. 'గోదావరి'లో సీత పాత్రకు స్వంత దృష్టికోణం ఉంటుంది. 'ఆనంద్'లో రూప, 'ఫిదా'లో భానుమతి, 'మహానటి'లో సావిత్రి పాత్రలు తమకంటూ ఆలోచనలు, నిర్ణయాలు కలిగిన వ్యక్తులుగా నిలుస్తాయి. ఈ సినిమాలన్నీ విజయం సాధించాయి. మహిళా పాత్రకు వ్యక్తిత్వం ఇవ్వడం వాణిజ్య విజయానికి అడ్డంకి కాదని నిరూపించాయి.

వ్యక్తిత్వ నిర్మాణం ఉండాలి!

సినిమాలో మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా జరిగే చర్చల్లో తరచుగా ప్రస్తావించే ఒక ప్రమాణం "బెక్డెల్ టెస్ట్". అమెరికన్ రచయిత్రి, కార్టూనిస్ట్ అలిసన్ బెక్డెల్ ప్రతిపాదించిన పరీక్ష ఇది. సినిమాలో మహిళా పాత్రలకు ఎంత స్వతంత్ర స్థానం ఉందో అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. సినిమాలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు పురుష పాత్ర గురించి కాకుండా మరేదైనా అంశంపై మాట్లాడుతున్నారా? అనేది ఆ ప్రశ్న. ఈ పరీక్ష పరిపూర్ణమైనది కాకపోయినా, మహిళా పాత్రలకు కథలో ఎంత స్వతంత్ర స్థానం ఉందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక విజయవంతమైన సినిమాలు కూడా ఈ సాధారణ పరీక్షలో విఫలమవుతాయి. తెలుగులో పెద్ద హీరోల చుట్టూ అల్లిన కథల్లోని హీరోయిన్ల పాత్రలు వ్యక్తిత్వం లేనివాటిగానే మిగిలిపోతున్నాయి. ఈ విషయంలో కాస్తో కూస్తో కొన్ని మధ్యస్థ, చిన్న సినిమాల్లోనే హీరోయిన్ల పాత్రలకు కాస్తయినా విలువ దక్కుతోంది. సినిమా సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో సమాజాన్ని ప్రభావితం కూడా చేస్తుంది. తెరపై మహిళలు పదేపదే అలంకారాలుగా, ప్రేమకు ప్రతీకలుగా, పురుష పాత్రల చుట్టూ తిరిగేవారిగా మాత్రమే కనిపిస్తే, అది సామాజిక ఊహపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే మహిళల ప్రాతినిధ్యం గురించి జరిగే చర్చ ఒక సినిమా గురించినది మాత్రమే కాదు. సమాజం మహిళలను ఎలా చూస్తుందనే ప్రశ్నకు సంబంధించినది. హీరోయిన్ పాత్ర ఎలా ఉండాలో నిర్ణయించేది ఆ పాత్రధారి కాదు; దర్శకుడు, రచయిత మాత్రమే! దీనిపై జాన్వీ కపూర్‌ను ట్రోల్ చేయటంలో అర్థం లేదు. ఆ నటిని మరింత అవమానించడం తప్ప! అందుకనే నటులు జగపతిబాబు, జయాబచ్చన్ తదితరులు జాన్వికి మద్దతుగా నిలిచారు. హీరోయిన్‌ను మరింత లోతుగా, మరింత స్వతంత్రంగా, మరింత మానవీయంగా చూపాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలది. రచయితలది. మహిళ పాత్ర ఒట్టి అలంకారం కాదు. ఆమె కూడా కథకు కేంద్రంగా ఉండగల మనిషే అని భావిస్తే- మన సినిమాలు ఇంకా బాగుంటాయి. బలపడతాయి!
- శాంతిమిత్ర

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్