“శత సోదర సంసేవిత సదనా!
అభిమాన ధనా! సుయోధనా!”
గాంధారి పుత్రుడని రేపిస్టులను తీవ్రంగా విమర్శించే కవిత్వాలు చదివాం. “ఈ దుర్యోధన, దుశ్శాసన దుర్వినీతి లోకంలో…” సినిమా పాట కూడా విన్నాం. కానీ, నిజంగానే దుర్యోధనులు దాదాపు ఊరూరా కనిపించే గ్రామాలు ఉన్నాయంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడో కాదు, శ్రీకాకుళం జిల్లాలోనే ఈ గ్రామాలు ఉన్నాయి. మహాభారతం చిత్రీకరించిన పాత్ర స్వభావాలు వీరికి లేవు. వీరంతా సామాన్య రైతులు, విద్యావంతులు, ప్రజా ఉద్యమ నాయకులు, పాత్రికేయులు. ఎక్కడైనా సహజంగా కథానాయకుల పేర్లు బిడ్డలకు పెట్టుకుంటారు గానీ, ప్రతినాయకుల పేర్లు పెట్టరు. ఇక్కడ నామకరణ సంస్కృతి భిన్నంగా ఉంది. ‘దుర్యోధన’ పేరు పెట్టడం ఆసక్తికరమైన వారసత్వ సంప్రదాయం. ఇది ఒక కులానికి మాత్రమే పరిమితం కాదు. కాళింగ, రెడ్డిక, యాదవ, సొండి, మత్స్యకార, ఒరియా మైనారిటీ కులాల్లోనూ కనిపిస్తుంది.
2024 ఓటర్ల జాబితా ప్రకారం, దాదాపు రెండు, మూడు గ్రామాల్లో కనీసం ఒక దుర్యోధనుడున్నాడు. ఈ నామధేయుల సంఖ్య ఉద్దానంలో ఎక్కువ. ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో మరీ ఎక్కువమంది! ఇచ్చాపురం మండలంలోని ఒక్క మశాఖపురం గ్రామంలోనే 21 మంది దుర్యోధనులు ఉన్నారు. కేదారిపురంలో 11 మంది, పురుషోత్తమపురంలో ఏడుగురు, ముచ్చింద్ర, అమీన్‌సాహెబ్‌పేటలో నలుగురేసి — ఇలా చాలా గ్రామాల్లో కనిపిస్తారు. పాతతరం వారే కాదు, 22–24 సంవత్సరాల మధ్య వయస్కులు కూడా ఉన్నారు. “ఎందుకు, నీకు ఈ పేరు పెట్టారని?” అడిగితే, చెప్పలేని వారే ఎక్కువమంది! ఆసక్తికరమైన ఈ నామ మమకార సంస్కృతి పొరుగునే ఉన్న ఒడిశాలోనూ ఉంది. సాహూ, పాత్ర, బొయితాయి, బెహరా, తరాయి వంటి కుటుంబాల్లో దుర్యోధనులు ఎక్కువగా కనిపిస్తారు. పూరి జిల్లాలో దుర్యోధన ముదిలి గొప్ప టెర్రాకోట (ఎర్రమట్టి) బొమ్మల కళాకారుడు. కలహండి ప్రాంతంలో దుర్యోధన సరాఫ్ ఇంకొక చేతివృత్తి కళాకారుడు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే, పిల్లల పేర్లకు, తండ్రుల పేర్లకు భారత సంబంధిత బాంధవ్యాలు లేవు. కేదారిపురం గ్రామంలోని చుక్కా దుర్యోధన తండ్రి పేరు బలరాం. బొడ్డపూడి గ్రామంలో 61 ఏళ్ల దుర్యోధన సాహు తండ్రి పేరు సుగ్రీవ. యువకుడు మిట్టాన దుర్యోధన తండ్రి గిరిధర. తర దుర్యోధన తండ్రి కృష్ణ. మిత్తన దుర్యోధన రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి. దుర్యోధన రౌళో తండ్రి పేరు శత్రుఘ్న. మశాఖపురంలో పి. దుర్యోధన రెడ్డి తండ్రి గోపాలరెడ్డి. మండపల్లి గ్రామంలో దుర్యోధన పాడి తండ్రి గణపతి.
దేశంలో మరెక్కడా కనిపించని ఈ అరుదైన నామ సంస్కృతి ఈ ప్రాంతంలోనే ఎందుకు కనిపిస్తుంది? ఇంకా ఎందుకు జీవిస్తుంది? అనే ప్రశ్నకు ప్రముఖ పురాణ శాస్త్రవేత్త దేవదత్ పట్నాయక్ జవాబు వెతికే కార్యక్రమం చాలావరకు చేశారు. (కల్చర్ — 50 ఇన్‌సైట్స్ ఫ్రం మైథాలజీ, 2017) క్రీ.పూ. 900–1000 మధ్యకాలంలో కురు–పాండవుల యుద్ధం జరిగిందని చాలామంది చరిత్రకారులు అంచనా. ఆనాటికి మహాజనపదాలు (16) లేవు. సమాజం గోత్రాల పేరుతో చీలిపోయి, వృత్తులపరంగా స్వయం పోషకంగా, బలహీనులపై బలవంతులు పెత్తనం చెలాయిస్తున్న కాలం. ఇరుగు, పొరుగు తెగలు కష్టసుఖాలను పరస్పరం పంచుకున్న కాలం కూడా కావొచ్చు. కొద్దిపాటి వాస్తవ చరిత్ర పునాదుల మీద పురాణాల రచనా నిర్మాణాలు ఆరంభమయ్యాయి. కల్పితాలు కదం తొక్కాయి. కాలక్రమంలో పునాదులనే పూర్తిగా విస్మరించిన ఇతిహాసాలు వచ్చాయి. ఇవన్నీ తాళపత్ర గ్రంథాల్లో నమోదు చేసే కార్యక్రమం కొన్ని శతాబ్దాల తరువాతే జరిగింది.
ఈ కాలక్రమణికను చాలావరకు ‘ది హిందూస్: అనాల్టర్నేటివ్ హిస్టరీ’ రచనలో చూపించే ప్రయత్నం చేశారు షికాగో ప్రొఫెసర్ వెండీ డోనిగర్. (తెలుగు సేత: టంకశాల అశోక్). క్రీ.పూ. 400 నుంచి క్రీ.శ. 400 మధ్య వ్యాసభారతం చాలా చేర్పులకు, మార్పులకు గురైందని చరిత్రకారుల భావన. ఉత్తర, దక్షిణ భారత అనువాదాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయని పండితులు చెబుతారు. మూల మహాభారతంలో (గీతా ప్రెస్ ప్రచురణ – గోరఖ్‌పూర్) దుర్యోధనుడికి చాలామంది భార్యలు ఉన్నారు. కానీ, మహాభారతంలో వారి ప్రస్తావనలు తక్కువ. ఒక్క భానుమతి పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తుంది. గీతా ప్రెస్ భారతం ఆమెను కాశీరాజు పుత్రిక అని చెప్పింది. కొన్ని అనువాదాలు కాంభోజ (కంబోడియా) రాజకుమార్తె అని చెప్పాయి.
కళింగ అల్లుడు దుర్యోధన!
మహాభారతంలోని శాంతిపర్వం మాత్రం భానుమతి కళింగరాజు చిత్రాంగదుని కుమార్తె అని చెప్పింది. అతని రాజధాని రాజపురం. ఒడిశా చరిత్రకారులు తమ రాష్ట్రంలోని జాజ్‌పూర్ అనేదే రాజపురం అని అంటారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోనూ ఒక రాజపురం ఉంది. ఈ నిర్ధారణాల వైరుధ్యం పక్కన పెడితే, రాజపురంలో భానుమతి స్వయంవరానికి కర్ణుడు తోడుగా దుర్యోధనుడు వచ్చాడు. భానుమతికి అతడు ఎందుకో నచ్చలేదు. అహం దెబ్బతిని, కర్ణుడి సహకారంతో ఆమెను ఎత్తుకుపోయి వివాహం చేసుకున్నాడు. భానుమతి అసాధారణ సౌందర్యవతి. నారదుడు ఒక సందర్భంలో ఆమెను “వర్ణవర్ణిని” అని దుర్యోధనుడికి చెప్పాడు. అల్లుడైన దుర్యోధనుడి కోసం కళింగ రాజులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పాల్గొన్నారు. భీష్మపర్వం ఈ విషయం స్పష్టంగా తెలిపింది. 60 వేల రథాలు, పదివేల ఏనుగులతో వెళ్లి యుద్ధంలో తలపడ్డారని చెప్పింది. భీముని చేతిలో కళింగ సేన నాశనమైందని కూడా చెప్పింది.
ఒడిశాలోని మహానది = ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి మధ్య ప్రాంతమే కళింగ. కురుక్షేత్రానికి, కళింగకు మధ్య రాకపోకల మార్గం ఉండేదని డాక్టర్ విజయవర్ధన్ అనే హర్యానా ఐఏఎస్ అధికారి తన పరిశోధనా గ్రంథం ‘కురుక్షేత్ర’లో రాశారు. కళింగపై మహాభారత ప్రభావం ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం కావొచ్చు. ఈ ప్రాంతంలో ఒక దుర్యోధనుడి పేరు తప్ప, ఇతర కౌరవుల పేర్లు కనిపించవు. భీష్మ, కర్ణ పేర్లు గలవారు కూడా ఉన్నారు. దుర్యోధనుడు తమ అల్లుడనే అభిమానమో, అభిమాన ధనుడనే గర్వమో తెలియదు. ప్రస్తుత తరం వారికి కూడా ఆ పేర్లు పెడుతుంటారు. దుర్యోధనుడు అంటే దుర్భేధ్యమైన వాడు. జయించడం సాధ్యం కాని యోధుడు అని అర్థం. సుయోధనుడు అంటే మంచి యోధుడు అనే అర్థమని కొన్ని నిఘంటువులు చెప్పిన మాట. (ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’లో శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి పాత్రలు రెండూ వేశారు. ఆయనకు ఇష్టమైన పదం “సుయోధన”. అందుకే ఆ సినిమాలో “దుర్యోధన” అనే మాట ఎక్కడ వినిపించదు. ‘దానవీరశూరకర్ణ’లో కూడా సుయోధనుడే హీరో.) ఉద్దానంలో మరో ఆసక్తికరమైన జంట పేర్లు ఉన్నాయి. ఇచ్చాపురం మండలంలోని పురుషోత్తమపురం గ్రామంలో సుగ్గు దుర్యోధన భార్య పేరు భానుమతి. మరో గొప్ప విశేషం – గాంధారి పేరు కూడా ఇక్కడ ఉంది. 1968–70 శ్రీకాకుళం గిరిజన, రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఒక ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన దళ సభ్యురాలు పేరు గాంధారి.
(పార్వతీపురం కుట్ర కేసు ఎఫ్‌ఐఆర్‌లో)
సమాజంలో విద్యావంతుల శాతం పెరుగుతోంది. పిల్లలకు చిత్రవిచిత్రమైన (అరుదైన) పేర్లు పెట్టడానికి తాపత్రయపడుతున్నారు తల్లిదండ్రులు. రెండు, మూడు అక్షరాల పేర్ల పట్ల ఒక ఫ్యాషన్! చరిత్ర, సంస్కృతి, పూర్వీకుల పట్ల విశ్వాసాలు, వారి జ్ఞాపకాలు దాదాపు అనవసరమవుతున్నాయి. ఇటువంటి ఆధునిక నేపథ్యంలోనూ ఆంధ్రా–ఒడిశాలో ఈ “దుర్యోధన” నామకరణ సంస్కృతి సజీవంగా ఉండటం చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. పాండవులతో వైరం తప్ప, దుర్యోధనుడి పాలనలో ప్రజలు దోపిడీకి, అణచివేతకు గురైనట్టు మూల మహాభారతం ఏ ఒక్క పర్వంలోనూ ఒక్క నిందారోపణ చేయకపోవడం కూడా విశేషమే! కళింగంలో ‘దుర్యోధన’ నామ సంప్రదాయం ఇంకా సజీవంగా ఉండటం ఒక విశేషమైతే, రెండు ప్రాంతాల్లో అతనికి ఆలయాలు నిర్మించి, దైవ సమానంగా భావించి ఆరాధించడం మరో విశేషం. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని ‘పొరువాజి’ గ్రామం దగ్గర ఒక కొండపై ‘పరువిరతి మలనాడ’ ఆలయం ఉంది. ఇదే దుర్యోధనుడికి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ఆలయం. ఇక్కడ ఆయనను ‘అప్పూప్పన్’ (తాత లేదా దైవం) పేరుతో పూజిస్తారు. సోదరి దుశ్శల, మిత్రుడు కర్ణుడితో పాటు కౌరవులను కూడా వారు ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలో కూడా రెండు దుర్యోధన దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని ‘మోరి’ గ్రామం సమీపంలోని జఖోల్ ప్రాంతంలో ఉన్న ‘దుర్యోధన దేవ్’ ఆలయం ప్రధానమైనది. స్థానికంగా నాలుగు గ్రామాల ప్రజలు తమను కౌరవ సైనికుల వారసులుగా భావిస్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ప్రాణాలతో మిగిలిన సైనికులు టోన్స్ లోయగా పిలిచే ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని స్థానిక గాథలు చెబుతాయి. ఇదే ప్రాంతంలోని ‘నెట్వార్’ గ్రామంలో మరో దుర్యోధన ఆలయం ఉంది.
– నల్లి ధర్మారావు,
76609 67313








కామెంట్‌లు (0)