“అడుగుజాడ గురజాడ”. ఈ మాట అన్నది గురజాడను సాహిత్య గురువుగా భావించిన విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ వేసిన మార్గాన్ని విస్తృతం చేసిన విశ్వమానవ కవి శ్రీశ్రీ. గురజాడ మానస పుత్రిక అయిన "ముత్యాలసరాలు" పుట్టిన 1910వ సంవత్సరంలోనే శ్రీశ్రీ పుట్టడం కాకతాళీయం కావచ్చు గానీ, ఆధునిక తెలుగు కవితా ప్రభంజనానికి అడుగులు పడింది మాత్రం అప్పుడేనని చెప్పవచ్చు. ఆధునిక కవిత్వానికి ఆద్యుడు గురజాడ అప్పారావేనని నిస్సందేహంగా ప్రకటించిన శ్రీశ్రీ, గురజాడ భావజాల వ్యాప్తికి కొనసాగింపుగా నిలిచాడు. తను పుట్టిన ఊరు తర్వాత అమితంగా ఇష్టపడే ప్రదేశం గురజాడ నడయాడిన నేల కావడం వల్ల శ్రీశ్రీ తరచుగా విజయనగరం వచ్చి సాహిత్య చర్చల్లో పాల్గొనేవాడు. చాసో, శ్రీరంగం నారాయణబాబు, రోణంకి అప్పలస్వామి వంటి సాహితీవేత్తల సాంగత్యం శ్రీశ్రీని అభ్యుదయ కవిగా మలచడంలో కీలకపాత్ర పోషించింది.
దేశమును ప్రేమించమంటూ గురజాడ జాతీయ దృక్పథాన్ని ప్రజలకు అందించాడు. గురజాడ దృష్టిలో దేశమంటే భౌగోళిక సరిహద్దులు కాదు; మానవ సమూహం. ఆ జాతీయతను ఆకళింపు చేసుకున్న శ్రీశ్రీ ఒక అడుగు ముందుకేసి అంతర్జాతీయ దృక్పథాన్ని తన కవిత్వంలో పలికించాడు. సరిహద్దులు లేని మానవ సమాజాన్ని కోరుకున్నాడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సామాజిక ధర్మాన్ని నిలదీశాడు. చైనాలో రిక్షావాలా, ఐర్లాండులో ఓడ కలాసి, రష్యన్ విప్లవం వంటి అంశాలు అతని కవితా వస్తువులయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న పీడన అతని భావవేశానికి కారణమైంది. ఆరుద్ర చెప్పినట్లు, “గురజాడ జాతీయత పదాన్ని నేర్పితే, అంతర్జాతీయ తత్వాన్ని మప్పింది శ్రీశ్రీ” అన్నది అక్షరసత్యం. గురజాడ సంస్కరణవాది. వ్యవస్థలో మార్పును ఆశించి, అందులోని అసమానతలను, సామాజిక దురాచారాలను మన కళ్ల ముందుంచాడు. శ్రీశ్రీ మాత్రం అన్యాయాన్ని చూపడమే కాకుండా, ప్రశ్నించే ధైర్యాన్ని, తిరుగుబాటు చేయాలన్న ఆలోచనను కలిగించాడు. దారిపక్కన చెట్టు కింద అవ్వ మరణిస్తే ఆ పాపం ఎవరిదని ప్రశ్నించాడు. “మాకు గోడలు లేవు; గోడలు పగలగొట్టడమే మా పని” అంటూ తిరుగుబాటు బావుటా ఎగరవేశాడు. మనిషిని మనిషి పీడించడం వెనకనున్న సామాజిక అసమానతలను సహించలేక “మరో ప్రపంచం” కోసం పరుగులు తీశాడు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రమజీవుల చెమటచుక్కకు కావ్యగౌరవం కల్పించిన తొలి కవి గురజాడ అప్పారావు. “నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్” అంటూ శ్రమ ప్రాముఖ్యాన్ని చాటిచెప్పాడు. దీనికి కొనసాగింపుగా శ్రీశ్రీ కర్షకజీవుల ఘర్మజలానికి ఖరీదు లేదంటూ, శ్రమజీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని ప్రపంచానికి తెలియజేశాడు. కార్మిక వీరుల విషాదాశ్రువులకు ఖరీదు కట్టే షరాబు లేడని వాపోయాడు. “దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్” అంటూ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా మట్టి స్థానంలో మనిషిని నిలబెట్టినవాడు గురజాడ. ఈసురోమని మనుషులుంటే దేశం అభివృద్ధి చెందదని సుతిమెత్తగా హెచ్చరించాడు. మనుషులంతా అన్నదమ్ముల వలె చెట్టపట్టాలు వేసుకొని నడవాలని పిలుపునిచ్చాడు. శ్రీశ్రీ కూడా “మానవుడా” అనే గేయంలో సమస్త మానవ సమూహాన్ని ఒకే చోట దర్శింపజేస్తాడు. “పతితులారా! భ్రష్టులారా! బాధాసర్ప దష్టులారా!” అంటూ దగాపడిన మనుషులకు చైతన్యం కలిగించేందుకు జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటూ దారి చూపించాడు. స్వేచ్ఛ, సమభావం, సౌభ్రాతృత్వం మానవాళికి అందాలని కాంక్షించాడు.
తెలుగు సాహిత్యంలో పండితభాషను పక్కన పెట్టి వ్యవహారభాషకు ప్రాముఖ్యమిచ్చిన కవి గురజాడ. భాషా విషయంలో కూడా గురజాడను ఆదర్శంగా తీసుకున్న శ్రీశ్రీ ప్రజల భాషకు తన కవిత్వంలో పట్టం కట్టాడు. కవిత్వం ప్రజల కోసమని నిలబడిన కవి శ్రీశ్రీ. వ్యాకరణాల సంకెళ్లను, ఛందస్సుల కట్టుబాట్లను అధిగమించి భాషా స్వేచ్ఛతో సృష్టించిన "మహాప్రస్థానం" కావ్యమంతా ప్రజల గొంతే వినబడుతుంది. వ్యవస్థలో మార్పు రావాలన్న ఆరాటం గురజాడలో కనిపిస్తుంది. ఆ మార్పు కోసం పోరాటం చేయాలనే తపన శ్రీశ్రీలో కనిపిస్తుంది. రాచరిక వ్యవస్థలో స్త్రీల దుస్థితిని గురజాడ చూపిస్తే, ఆధునిక సమాజంలో స్త్రీ తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకతను శ్రీశ్రీ తెలియజేశాడు. కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామికలోకపు సౌభాగ్యానికి తన కవిత్వాన్ని అంకితం చేశాడు. “నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను” అని ప్రతి పౌరుడు ప్రతిన పూనిన నాడు దేశ పురోగతికి అవరోధాలు ఉండవని విశ్వసించినవాడు శ్రీశ్రీ. కష్టజీవికి రెండువైపులా నిలుచున్నవాడే కవియని నమ్మినవాడు. “మానవుడే నా సందేశం” అంటూ మానవ విముక్తి స్వప్నాన్ని ప్రకటించాడు.
(నేడు శ్రీశ్రీ వర్థంతి)
- డాక్టర్ బొద్దూరు విజయేశ్వరరావు
94905 44551









కామెంట్‌లు (0)