దొంగలపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు
ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి వేళ రైలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగలు సృష్టించిన బీభత్సం తీవ్ర కలకలం రేపింది. బాపట్ల–అప్పికట్ల రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణిస్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చోరి చేశారు. బాపట్ల నల్లమడ వాగు వంతెన సమీపంలో రైలు వెళ్తుండగా, ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళల నుంచి ఏడు సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అయితే, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దొంగలను గట్టిగా ప్రతిఘటించారు. దీంతో దుండగులు వెంటనే రైలును చైన్ లాగి ఆపారు. అనంతరం రైలు నుంచి కిందకు దూకి, చీకట్లోనే పొలాల మీదుగా బాపట్ల–గుంటూరు రోడ్డు వైపునకు పరుగులు తీశారు. రైలులో దొంగతనం యత్నాన్ని గమనించిన రైల్వే ఎస్కార్ట్ పోలీసులు తక్షణమే స్పందించారు. పారిపోతున్న దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్, బాపట్ల గ్రామీణ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.








కామెంట్‌లు (0)