నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టిన బిడ్డను కాపాడుకోవడం కోసం ఆ చిన్నారి కుటుంబం ఎంతో తాపత్రయపడుతుంది. బిడ్డకు సరిపడా పాలు ఇచ్చేందుకు ఒత్తిడిలో ఉన్న తల్లి ఆరోగ్యం సహకరించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ ప్రాణాలు దక్కాలంటే మిల్క్ బ్యాంకులకు దాతలు ఇచ్చిన పాలే శరణ్యం. అయితే ఎంతమంది తల్లులు ఈ మిల్క్ బ్యాంకులకు పాలను దానం చేస్తున్నారు! చాలామంది అమ్మలకు ఈ విషయంపై అవగాహనే ఉండదు. అలాంటి అమ్మలందరూ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుప్తా ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ కథనం గురించి తప్పక తెలుసుకోవాలి.
జ్వాలా గతేడాది పాపకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన ఈ ఏడాదిలో జ్వాల తన చిన్నారి తాగగా మిగిలిన తల్లి పాలను మిల్క్ బ్యాంకుకు దానం చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్, చెన్నై ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎన్ఐసియు కేర్‌లలో చికిత్స తీసుకుంటున్న పిల్లల కోసం నేను 60 లీటర్ల తల్లి పాలను దానం చేశాను’ అన్న వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది కూడా!
తాను ఎందుకు ఈ సాయం చేశానో కూడా జ్వాల ఈ సందర్భంగా వివరించారు. “నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఎన్‌ఐసియు)లో చికిత్స తీసుకునే పిల్లలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటారు. కేవలం 100 మిల్లీలీటర్ల పాలు కిలో బరువున్న చిన్నారిని కొన్ని రోజుల పాటు రక్షిస్తాయి. ఈ సాయం ఎన్ఐసియులో ఉన్న డజన్ల కొద్దీ బిడ్డలకు అండగా నిలుస్తుంది. సురక్షిత పరీక్షల తరువాత ఈ పాలు సేకరిస్తారు. కాబట్టి విరాళం చేయడం చాలా సులభం. ఇది అత్యంత ఆవశ్యకం కూడా!” అని ఆమె రాశారు.
నెలలు నిండకుండా పిల్లల్లో తరచూ సంభవించే నెక్రోటైజింగ్ ఎంటెరోకోలైటిస్ (ప్రాణాంతకమైన పేగు వ్యాధి) ప్రమాదాన్ని దాతల పాలు గణనీయంగా తగ్గిస్తాయని నిరూపించబడిన విషయాన్ని కూడా జ్వాల ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్థానిక ఆస్పత్రులు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ద్వారా అందుబాటులో ఉన్న తల్లి పాల దాన కార్యక్రమాల గురించి బిడ్డకు పాలిస్తున్న ప్రతి తల్లీ తెలుసుకోవాలని కూడా ఆమె కోరారు. డబుల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన జ్వాల వ్యక్తపరిచిన ఈ అభిప్రాయాలు అక్షరసత్యాలు. ఈ విషయాలు ఎన్నోసార్లు రుజువయ్యాయి కూడా.
2025లో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక కథనం ప్రకారం, 28 వారాలకే పుట్టిన శిశువు కిలో బరువు మాత్రమే ఉన్నాడు. చికిత్స కోసం ఆ బిడ్డను ఎన్ఐసియులో చేర్చారు. బిడ్డకు ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంది. ఒత్తిడిలో ఉన్న తల్లి బిడ్డకు పాలివ్వలేని స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో మిల్క్ బ్యాంకుల్లో భద్రపరిచిన తల్లి పాలను బిడ్డకు పట్టించారు. కొన్ని వారాల తరువాత చిన్నారి బరువు పెరిగింది. ఇన్ఫెక్షన్లు తగ్గాయి. వెంటిలేటర్ నుండి చిన్నారి బయటపడ్డాడు. దాత ఇచ్చిన పాల వల్లే బిడ్డ ప్రాణాపాయం నుండి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మొత్తం కథనం ‘వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్’లో భాగంగా ప్రముఖ పత్రికలో ప్రచురించారు.
మరో సంఘటన ఈ ఏడాది మేలో బెంగళూరుకు చెందిన వానీ విలాస్ హాస్పిటల్ వారు ప్రకటించారు. ఆ కథనం ప్రకారం 900 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డకు ఎన్ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా పాప తల్లి బిడ్డకు పాలివ్వలేకపోయింది. మిల్క్ బ్యాంకు నుండి సేకరించిన పాలను వైద్యులు బిడ్డకు పట్టించడం మొదలుపెట్టారు. రెండు నెలల ప్రత్యేక సంరక్షణ తరువాత బిడ్డ ఆరోగ్యం కుదుటపడింది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడింది. ఎన్ఈసి వంటి ప్రమాదకర పేగు వ్యాధి రాలేదు. బరువు కూడా పెరిగింది. ఈ సందర్భంగా ‘ఫార్ములా మిల్క్ కంటే హ్యూమన్ మిల్క్ బ్యాంకుల నుండి సేకరించిన పాలు చిన్నారుల ప్రాణాలు కాపాడుతాయని’ ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు ఓ పత్రికలో ప్రచురించారు.
ఈ ఏడాదిలోనే వచ్చిన మరో కథనంలో 2019లో ప్రారంభించిన కింగ్ జార్జ్ మిల్క్ బ్యాంక్ ఇప్పటివరకు 1700 మందికి పైగా చిన్నారులను కాపాడినట్లు వచ్చింది. 2022లో వానీ విలాస్ హాస్పిటల్ ప్రారంభించిన మిల్క్ బ్యాంకు ద్వారా 3600 మంది ఎన్ఐసియు చిన్నారుల ప్రాణాలు రక్షించబడ్డాయి. మన దేశంలో ప్రతి ఏడాది ముందస్తు ప్రసవాల వల్ల సుమారు 35 లక్షల మంది చిన్నారులు జన్మిస్తున్నారు. వీరిలో చాలామందికి ఎన్ఐసియు చికిత్స అవసరం. దేశవ్యాప్తంగా ఏడాదిలో దాదాపు 10 లక్షల మంది నవజాత శిశువులు చికిత్స నుండి కోలుకుంటున్నారు. దేశంలో సంభవించే నవజాత శిశు మరణాల్లో 48 శాతం ముందస్తు జననాల వల్ల, తక్కువ బరువు ఉండడం వల్లే జరుగుతున్నాయి.
బిడ్డ ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో కీలకమని అందరికీ తెలుసు. అయితే కన్న బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మరెంతోమంది అనారోగ్య బిడ్డల ప్రాణాలను తన పాలతో రక్షించవచ్చని ప్రతి తల్లీకీ అవగాహన రావాలి. అప్పుడే దేశంలో ఎన్‌ఐసియుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల మరణాలు ఆశాజనకంగా తగ్గుముఖం పడతాయి.








కామెంట్‌లు (0)