ఇంట్లో ఉన్న వాళ్లకే తెలియని విషయాలు సైతం ఎక్కడెక్కడో ఉన్న ఇతరులకు తెలిసిపోవడం సోషల్ మీడియా కాలపు లక్షణంగా మారిపోయింది. తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ సామాజిక మాధ్యమాల్లో ప్రదర్శించాలన్న తపన చాలామందిలో పెరిగిపోతోంది. ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏమి కొంటున్నాం, ఇంట్లో ఏం ఉందనే వివరాలు కూడా ప్రపంచానికి చెప్పేయాలనే ఆరాటం కనిపిస్తోంది. ఈ అలవాటు ఒక్కోసారి చేదు అనుభవాలకు, అనూహ్యమైన ప్రమాదాలకు దారితీస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఓ యూట్యూబర్‌కు ఎదురైన అనుభవం ఇందుకు తాజా ఉదాహరణ..
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన యూట్యూబర్ రచనా గుర్జర్ తన ఇంట్లో ఉన్న బంగారం, నగలు, ఖరీదైన వస్తువులు, ఇంటి గదులు, అలంకరణలు అన్నీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది. వేలాది మంది ఆ వీడియోలు చూశారు. గత శనివారం అర్ధరాత్రి ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు కుటుంబ సభ్యులను ఒక గదిలో బంధించి, బంగారం, నగదు దోచుకుపోయారు. దొంగలకు ఈ సమాచారం సోషల్ మీడియా ద్వారానే దొరికిందా అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఒక్క కుటుంబానికి జరిగిన దురదృష్టకర అనుభవం మాత్రమే కాదు. సోషల్ మీడియాలో అతిగా పంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి ఆలోచింపజేసే హెచ్చరిక కూడా.
ప్రదర్శనల యుగం
ఒకప్పుడు మనిషి తన వ్యక్తిగత జీవితాన్ని తన దగ్గరే ఉంచుకునేవాడు. కుటుంబ విషయాలు, ఆస్తి వివరాలు, ఇంటి సంగతులు కొద్దిమందికే తెలిసేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక చిన్న టీవీ ఛానల్‌లా మారిపోయారు. ఏం తిన్నాం, ఎక్కడికి వెళ్లాం, ఏమి కొన్నాం, ఎవరితో ఉన్నాం అన్నీ వెంటనే ప్రపంచానికి చూపిస్తున్నారు. ఒకప్పుడు పది మందికి చెప్పే విషయాన్ని ఇప్పుడు వేల మందికి చెబుతున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఒక ఫొటో పెడితే లైక్‌లు వస్తాయి. ఒక వీడియో పెడితే వ్యూస్ వస్తాయి. మనల్ని గుర్తిస్తున్నారనే ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం కోసం మరిన్ని విషయాలు బయటపెట్టాలనిపిస్తుంది.
అలా క్రమంగా వ్యక్తిగత జీవితం, బహిరంగ జీవితం
మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది. ఇంటి లోపలి విషయాలు, కుటుంబ సమస్యలు, పిల్లల సంగతులు, ఆర్థిక పరిస్థితులు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు హోమ్ టూర్ వీడియోలు ఒక ఫ్యాషన్‌గా మారాయి. ఇంట్లోని ప్రతి గది, ప్రతి అల్మరా, ఖరీదైన వస్తువులు, భద్రతా ఏర్పాట్లు కూడా వీడియోల్లో కనిపిస్తున్నాయి. ప్రేక్షకులకు అది సరదాగా అనిపించవచ్చు. కానీ నేరస్థులకు మాత్రం అది సిద్ధంగా దొరికిన సమాచారం. అలాగే "మేమంతా వారం రోజుల టూర్‌కు వెళ్లాం", "ఇప్పుడు విదేశాల్లో ఉన్నాం" అంటూ రియల్‌టైమ్ పోస్టులు పెట్టడం కూడా ప్రమాదకరం. అది కొన్నిసార్లు "ఇల్లు ఖాళీగా ఉంది" అని ప్రకటించినట్టే! మనకు చిన్న విషయంలా అనిపించే సమాచారం కూడా నేరస్థులకు ఉపయోగపడే కీలక సమాచారంగా మారవచ్చు. అందుకే సోషల్ మీడియాలో పంచుకునే ప్రతి వివరాన్ని ఒకసారి ఆలోచించడం అవసరం.
గోప్యత చాలా అవసరం!
పిల్లల విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. పుట్టిన రోజు నుంచి స్కూల్‌లో చేరే రోజు వరకు ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. పిల్లల ఫొటోలు, పాఠశాల పేర్లు, రోజువారీ అలవాట్లు కూడా బయటకు వెళ్తున్నాయి. ప్రేమతో చేస్తున్న పని అనుకున్నా, అది భవిష్యత్తులో భద్రతా సమస్యలకు కారణం కావచ్చు. కొన్నిసార్లు పిల్లల డిజిటల్ గుర్తింపును తల్లిదండ్రులే అనుకోకుండా ప్రపంచానికి అందిస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది.
సోషల్ మీడియా మరో మార్పును కూడా తీసుకొచ్చింది. మనం ఎలా జీవిస్తున్నామన్న దానికంటే ఇతరులకు ఎలా కనిపిస్తున్నామన్నదే ముఖ్యమవుతోంది. ఆనందంగా ఉండటం కంటే ఆనందంగా కనిపించడం కీలకం అవుతోంది. ప్రయాణాన్ని ఆస్వాదించడం కంటే ఫొటోలు తీయడం ప్రధానం అవుతోంది. పని చేయడం కంటే చేస్తున్నట్టు చూపించడం మీదనే ధ్యాస ఎక్కువవుతోంది. ఈ ప్రదర్శన సంస్కృతి క్రమంగా ఒక వ్యసనంలా మారుతోంది. కొందరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయాన్ని చిత్రీకరిస్తూ, ప్రతి అనుభవాన్ని పోస్టుగా మార్చేస్తున్నారు. క్రమంగా జీవితం కంటే దాని ప్రదర్శనే ముఖ్యమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
సాంకేతికత తప్పు కాదు. సోషల్ మీడియా శత్రువు కాదు. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే అసలు విషయం. శివపురి ఘటన మనకు ఒక సాధారణ సత్యాన్ని గుర్తు చేస్తోంది. ప్రతి విషయం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం పోస్టు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు గోప్యతే భద్రతను ఇస్తుంది. కొన్ని విషయాలు మన దగ్గరే ఉండడం అవసరం. "ఏం పోస్ట్ చేయాలి?" అని ఆలోచించే ముందు "ఏం పోస్ట్ చేయకూడదు?" అని ఆలోచించడం ఇంకా ముఖ్యం. కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా పంచుకున్న చిన్న సమాచారం కూడా పెద్ద సమస్యకు దారి తీయవచ్చు. మన జీవితాన్ని ప్రపంచానికి చూపించే అవకాశం సోషల్ మీడియా ఇచ్చింది. అదే సమయంలో వివేకంతో వ్యవహరించడం, అవసరమైనదానినే పంచుకోవడం, మిగతాదాన్ని గోప్యంగా ఉంచుకోవడం కూడా అంతే అవసరం.
ఒక సాధారణ నియమం: రోడ్డుమీద నిలబడి చెప్పలేని విషయాన్ని సోషల్ మీడియాలో కూడా చెప్పకపోవడమే మంచిది.
సోషల్ మీడియాలో కాస్త జాగ్రత్త!
l కుటుంబ కలహాలు, వ్యక్తిగత వివాదాలు, భావోద్వేగ ఉద్రిక్తతలకు సంబంధించిన విషయాలను బహిరంగ చర్చగా మార్చకండి.
l బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవద్దు.
l ఆధార్, పాన్, పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్‌లు వంటి పత్రాల ఫొటోలను పోస్టు చేయడం ప్రమాదకరం.
l లైక్‌లు, కామెంట్ల కోసం ప్రమాదకర విన్యాసాలు, స్టంట్లు, నిర్లక్ష్య ప్రవర్తనకు దూరంగా ఉండండి.
l కోపం, ఆవేశం, ఉద్వేగంలో చేసే పోస్టులు తర్వాత ఇబ్బందులకు కారణం కావచ్చు. స్పందించే ముందు ఆలోచించడం అవసరం.
l ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలను విచక్షణ లేకుండా పంచుకోవడం భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలు చూపవచ్చు.
l పిల్లల ఫొటోలు, వీడియోలు వారి భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
l నిర్ధారణ లేని వార్తలు, పుకార్లు, సందేహాస్పద సమాచారాన్ని ఫార్వర్డ్ చేయడం సామాజిక బాధ్యతకు విరుద్ధం.
l సోషల్ మీడియాను వ్యక్తిగత డైరీగా మార్చకుండా, ఏది పంచుకోవాలి, ఏది గోప్యంగా ఉంచుకోవాలి అనే వివేకాన్ని అలవర్చుకోవాలి.







కామెంట్‌లు (0)