కాల గర్భంలో ఒక విద్యా సంవత్సరం కరిగిపోయింది. ఒక తరం పిల్లలు సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రాథమిక సెకండరీ స్థాయి పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయారు. వారే రేపటి పౌరులుగా తయారవుతారు. మనం నేర్పిన నడవడిక, మనం తీర్చిదిద్దిన అక్షరాలు వారి జీవిత గమ్యానికి బాటలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. కొద్దిమంది మనం నేర్పిన అంశాలను మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న మంచిని స్వీకరించి ముందుకు పోతూ ఉంటారు. కొద్దిమంది మనం చెప్పిన అంశాల కంటే సమాజంలో ప్రతిబింబించే అంశాల పట్ల ఆకర్షితులై కొంత చెడు మార్గం పడతారు. పిల్లలు ఎలా ఎదిగినా ఫలితాలు ఉపాధ్యాయులకు, ఆ బడికి చెందేలా మాట్లాడతారు. అది సహజం. అవలక్షణాలను పక్కన పెట్టి సమాజాభివృద్ధికి ఉపయోగపడే లక్షణాన్ని పిల్లలు పుణికి పుచ్చుకునేలా పునాది వేయాల్సింది ప్రభుత్వ బడిలోనే. మరో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. గత అనుభవాలను మననం చేసుకుంటూ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడి పట్ల సమాజానికి నమ్మకం కలిగేటట్లు బోధన చేద్దాం.
ప్రభుత్వ బడి
ప్రభుత్వ బడి బతకటమంటే సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం బతకటం. ప్రభుత్వ బడిని కాపాడుకోవడం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశాన్ని కాపాడుకోవడం. ఎంతో విశాలమైన లక్ష్యం కలిగిన ప్రభుత్వ బడి బతికి తీరాలి. అందుకు ఉపాధ్యాయులే నడుం బిగించాలి. 19,000 బేసిక్ ప్రైమరీ పాఠశాలలు, 5,000 ఫౌండేషన్ స్కూళ్లు, 9,620 మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ఇవి కాకుండా యు.పి పాఠశాలలు, ఉన్నత పాఠశాలలన్నింట్లో 31 లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరం ఉన్నారు. మరి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే నమోదు పెరుగుతుందని ఒక ఆశాజనక వాతావరణం ఉంది. చూద్దాం. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడి పట్ల నమ్మకం కలిగిన తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులకు నాలుగు అక్షరాలు, నైతిక విలువలు నేర్పే బాధ్యతను ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాల్సిందే. ఆటంకాలు ఎన్నొచ్చినా ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఉపాధ్యాయులను తిప్పినా...అవసరమైతే వాటి కోసం పోరాటం చేస్తూనే, పిల్లలకు తగు న్యాయం చేయటం మన బాధ్యత. వారికి సామాజిక న్యాయం పట్ల, ఈ రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, లౌకికవాదం పట్ల ఒక సమగ్ర దృక్పథాన్ని ఏర్పరిచే బాధ్యత ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాలి. ప్రశ్నించే తరాన్ని, ప్రశ్నించే యువతని, ప్రశ్నించే లక్షణాన్ని సజీవంగా నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
భౌతిక వాదులుగా..
విద్యార్థులకు చుట్టూ వున్న ప్రకృతిని, సమాజాన్ని పరిశీలించే దృక్పథం నేర్పాలి. ఇప్పటివరకు ఆచరణలో, శాస్త్రీయంగా నిరూపించబడిన వాదం భౌతిక వాదమే. భౌతికవాద పద్ధతిలో చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని, పరిస్థితులను పిల్లలకు నేర్పాలి. భౌతికవాద ఆలోచన కలిగిన వాళ్ళని సమాజంలో తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి.
ప్రతి అంశానికి హేతువు ఉంటుందని, ఆ హేతువును విశ్లేషణ, పరిశోధన చేయటం ద్వారా వాస్తవాలు తెలుస్తాయని, అలా చేయకపోతే అదొక నమ్మకంగా భవిష్యత్తులో మూఢనమ్మకాలుగా మారుతాయని పిల్లలకు అర్థమయ్యేలా నిత్యజీవిత సైన్సు బోధించాలి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే మార్గంలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడతాయని, అవి గ్రహణాలు కాదని, ఆ సందర్భంలో ప్రత్యేక కిరణాలు ఏమీ వెలువడవని శాస్త్రీయంగా పిల్లలకు బోధించాలి.
ప్రభుత్వం వైపు నుంచి...
పిల్లలకు బోధన చేసే ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఏర్పరచాలి. ఒత్తిడి లేకుండా ఉపాధ్యాయులు బడిలో పిల్లలకు బోధన మాత్రమే చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఉపాధ్యాయుల వైపు నుంచి బలహీనత కనిపిస్తే దాన్ని సరిచేసే పద్ధతులు, పర్యవేక్షణ ఉండేలా చూడాలి. దండించడం, శిక్షించడం వల్ల పిల్లలకు బోధనకు ఇబ్బంది ఏర్పడుతుంది తప్ప ఒరిగేదేం లేదు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలతో పోల్చడం, ర్యాంకులు, 100 శాతం పాస్ లాంటి టార్గెట్లు పెట్టడం వల్ల పిల్లలలో సృజనాత్మకత దెబ్బ తింటుంది. బట్టీయ పద్ధతి వల్ల సృజనాత్మకంగా ఆలోచించటం మరచి భవిష్యత్తు అంతా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం తప్ప తనంతట తను బతకడం అలవాటు లేని పరిస్థితులలోకి నెట్టివేయబడతారు.
పిల్లల కేంద్రంగా...
రేపటి పౌరులు, సమాజ నిర్దేశకులైన పిల్లలకు చదువు చెబుతున్నామనే భావన ఉపాధ్యాయులకు ఉండాలి. సమాజం పట్ల బాధ్యతగా మెలిగే పౌరులను తయారు చేయాలి. అందుకోసమే మనల్ని సమాజం నియమించుకొంది. అందుకోసమే మనకు కొద్ది మొత్తాన్ని ఇస్తుందన్న ఆలోచన ఉపాధ్యాయులకు ఉండాలి.
ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని నిరంతరం నేర్పుతూ ఉండాలి. రెక్కలు రాని చిన్నారి పక్షికి గూటిలో తల్లి రక్షణ కల్పించినట్టే బడిలో పిల్లలకు రక్షణ అందించే తల్లి పక్షుల్లా ఉపాధ్యాయులు మారాలి. పాఠ్యపుస్తకాలలో అక్షరాలు, పదాలు, వాక్యాలు, కూర్పుల వరకు నేర్పటమే చదువు కాదు. అది ఒక భాగం మాత్రమే. సమాజాన్ని చదవటం ఎలాగో, సమాజంలో నిజాయితీగా ఎదగడం ఎలాగో కూడా నేర్పాలి. చెప్పింది, చూసింది నమ్మడం కాదు. నిరూపించిన దానిని, ఆచరణలో నిగ్గు తేలినదాన్ని నమ్మాలనే జ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వాలి. నిరంతర శ్రమ, కృషి, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరవచ్చనే సత్యాన్ని చెప్పాలి. సత్యం, నిజం నిష్టూరంగా అనిపించినా ఆ నిజం చెప్పే వాళ్లే చనిపోయినా సమాజంలో సజీవంగానే బతికి ఉంటారని, అలా ఉన్న నాయకుల జీవిత చరిత్రలు వెతికి చదివి, పిల్లలకి స్ఫూర్తి నివ్వాలి. భవిష్యత్తులో అలాంటి నాయకులు తయారయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి.
విద్యార్థులకు చిన్ననాడే కాలం విలువ చెప్పాలి. చెమట చుక్క గొప్పతనం చెప్పాలి. వస్తువు విలువకు చెమట చుక్కకూ మధ్య సంబంధాన్ని చెప్పాలి. మనిషికి జంతువుకి తేడా బోధించాలి. అందరితో కలిసి ఉండటం అందరి క్షేమంలో తన క్షేమాన్ని చూసుకోవటం మానవత్వపు లక్షణమని వివరించాలి. ఇవన్నీ పాఠ్యాంశాలలో భాగంగా బోధించి తనకు, తన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులు తయారు చేయాలి.
కులం, మతం పేరుతో విభజన చేస్తూ ఈ పండుగ నీది, ఆ పండగ నాది అని కాకుండా...పండుగ ఏదైనా ఊరంతా చేరి ఒకరికి ఒకరు సహాయ పడుతూ శ్రమైక సౌందర్యానికి పట్టం కట్టే నాటి గ్రామ సీమల గురించి చెప్పాలి.
ప్రభుత్వ బడి బతకాలంటే అవరోధాలను అధిగమించి...సమాజ సహకారంతో పిల్లలకు నాలుగు అక్షరాలు, నైతిక విలువలు నేర్పుతూ...భవిష్యత్ తరాన్ని తయారుచేసే కర్మాగారంగా బడిని మార్చాలి.

- వ్యాసకర్త : ఎన్.వెంకటేశ్వర్లు, యుటియఫ్ రాష్ట్ర అధ్యక్షులు








కామెంట్‌లు (0)