అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.యల్.ఓ) ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ (ఐపెక్) కార్యక్రమం 1992లో ఏర్పాటు చేయబడింది. బాల కార్మిక వ్యవస్థ క్రమ నిర్మూలన లక్ష్యంతో, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న అతి పెద్ద కార్యక్రమం ఇది. ఐ.యల్.ఓ ఎజెండాలో ఐపెక్ ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రధానాంశం. కార్మికులుగా ఉన్న బాలలకు విద్యను అందించడం, వారి కుటుంబాలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలతో సహాయం చేయడం ద్వారా వయోజనులకు ప్రత్యక్షంగా మంచి పని వాతావరణాన్ని సృష్టించవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా గ్రామీణుల్లో 22 శాతం మంది బాలలున్నారు. పుస్తకాలు పట్టుకోవలసిన చేతులు ఇటుకలు మోస్తున్నాయి. కాఫీ హోటళ్లలో కప్పులు కడుగుతున్నారు. మద్యం దుకాణాలలో సేవలు అందిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అనేక కుటుంబాలవారు తమ పిల్లలనను డబ్బు సంపాదించడానికి పనిలో పెడుతున్నారు.
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ అత్యంత సాధారణంగా కనిపిస్తోంది. కర్మాగారాలు, గనులు, వ్యభిచారం, తోటలు, వ్యవసాయం, తల్లిదండ్రుల వ్యాపారాల్లో సాయం చేయడం, చిన్న వ్యాపారాలు, ఆహార పదార్థాల విక్రయం లేదా తాత్కాలిక ఉద్యోగాల్లో బాలలు పని చేస్తున్నారు. కొంత మంది బాలలు పర్యాటకులకు గైడ్లుగా, దుకాణాలకు, రెస్టారెంట్లకు వెయిటర్లుగా పని చేస్తున్నారు. వ్యాపారాలను నడపడానికి ఉపయోగపడుతున్నారు. బూట్లు పాలిష్ చేయడం, అంగడి ఉత్పత్తులను మోయడం లేదా శుద్ధి చేయడం వంటి దుర్భరమైన పనులు చేయాల్సివచ్చే ఉద్యోగాలకు పురామాయించ బడుతున్నారు.
ఆసియాలో 61 శాతం, ఆఫ్రికాలో 32 శాతం, లాటిన్ అమెరికాలో 7 శాతం, అమెరికా, కెనడా, యూరప్, ఆసియాలోని ఇతర సంపన్న దేశాల్లో 1 శాతం బాలలు కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ దేశాల్లోని మొత్తం శ్రామిక సంఖ్యలో 17 శాతం మంది బాలలు ఉన్నారు. సంపన్న దేశాలు ఇప్పుడు బాలలను కార్మికులుగా ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనగా, చట్ట వ్యతిరేకంగా పరిగణిస్తున్నాయి. అయితే కొన్ని పేద దేశాలు మాత్రం బాల కార్మిక వ్యవస్థను అనుమతించడం లేదా ఉపేక్షించడం చేస్తున్నాయి. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడాన్ని చట్టం నిషేధించింది.
ఐ.ఎల్.ఒ సర్వే ప్రకారం ప్రపంచంలోని మొత్తం 30 కోట్ల మంది 5 నుండి 15 సంవత్సరాల లోపు బాలలు పూర్తి స్థాయిలో కార్మికులుగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో ఈ సంఖ్య దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మన రాష్ట్రంలో అత్యధికంగా దాదాపుగా 16 లక్షల 60 వేల మంది బాల కార్మికులు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి - అంటే నూటికి ఏడుగురు. బాల కార్మికులుగా పనిచేస్తున్న చిన్నారుల సగటు వయస్సు 6 నుండి 14 సంవత్సరాల మధ్య ఉంటుంది. కడుపు నింపుకోవడానికి విద్యకు దూరమై పనిచేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్, గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో బాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంది. బాల కార్మిక నిరోధక యంత్రాంగ అధికారుల, ప్రచార మాధ్యమాల కన్ను పడకుండా చూసేందుకు...ఎక్కువ మంది బాల కార్మికులను అనధికారిక రంగంలో ఉపయోగిస్తున్నారు. వీధుల్లో అనేక వస్తువులను విక్రయించేందుకు ఉపయోగించుకోవడం, రహస్యంగా ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో పనులకు ఉపయోగించుకోవడం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వారి చేత పని చేయించుకుంటున్నారు. కొన్ని పరిశ్రమలలో పని చేయడం వలన బాల కార్మికులకు వివిధ రకాల చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ బాల కార్మికులు పెరిగి పెద్దయ్యాక వారు శారీరకంగా బలహీనులు కావచ్చు. అందుకోసం కొన్ని పరిశ్రమలలో బాల కార్మికులను పెట్టుకోరాదని చట్టం పేర్కొంటోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని కోరుతున్నాం.
- నరవ ప్రకాశరావు,
బాల వికాస్ ఫౌండేషన్, సెల్ : 9032477463








కామెంట్‌లు (0)