ప్రజా పాత్రికేయుడు, న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై పెట్టిన కేసులను రద్దు చేస్తూ, ఈనెల పదో తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. ఈ కేసుల బనాయింపు, కొనసాగింపూ "చట్ట ప్రక్రియ దుర్వినియోగం"గా మారిందని కోర్టు వ్యాఖ్యానించటం మోడీ ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ. మూడు సంవత్సరాలకు పైగా సాగిన దర్యాప్తులు, దాడులు, అరెస్టులు, కోర్టు విచారణల అనంతరం వచ్చిన ఈ తీర్పు ఒక వ్యక్తి విముక్తి మాత్రమే కాదు. మోడీ-అమిత్ షా ప్రభుత్వపు అణచివేతపై ప్రజాస్వామ్య విలువలు సాధించిన విజయం. ప్రజా పాత్రికేయం ఎగురవేసిన గెలుపు పతాకం! ప్రబీర్ పుర్కాయస్థకు ఈ నిర్బంధమూ, అధికార దురహంకారం చేసే దాడీ కొత్త కాదు. 1975 ఎమర్జెన్సీ కాలంలో జెఎన్‌యు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన్ని దురుద్దేశపూర్వకంగా అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మీసా చట్టం కింద అరెస్టు చేసింది. వేరొక విద్యార్థి నాయకుడిని వెతుక్కుంటూ వచ్చిన ఢిల్లీ పోలీసులు తోటి విద్యార్థులతో ఉన్న ప్రబీర్‌ను బలవంతంగా ఎత్తుకుపోయారు. అప్పటికప్పుడు తప్పుడు కేసులు బనాయించి జైలులో నిర్బంధించారు. తరువాత జనతా ప్రభుత్వం నియమించిన జస్టిస్ షా కమిషన్ ఈ ఉదంతంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "అపరిమితమైన అధికార దురహంకారం, అధికారుల వెన్నెముకలేనితనం కలిస్తే ఏమి జరుగుతుందో ఈ ఘటన తెలియజేస్తుంది" అని చీవాట్లు పెట్టింది. "ప్రధాని నివాసంలో ఎవరినో సంతృప్తిపరచడానికే ఈ అరెస్టు జరిగింది" అని కూడా పేర్కొంది. అధికార దుర్వినియోగం, అధికారుల లొంగుబాటు కలిసి ప్రజాస్వామ్య వ్యవస్థపై శాశ్వత మచ్చ వేస్తాయని హెచ్చరించింది.
దాదాపు 48 ఏళ్ల తరువాత 2023లో మళ్లీ అదే జరిగింది. ఏ ఆధారాలు లేకుండానే ఆరోపణలు గుప్పించి ప్రబీర్‌ను 220 రోజులకు పైగా జైల్లో ఉంచింది మోడీ-షా ప్రభుత్వం. పాలకుల కనుసన్నల్లో దర్యాప్తు సంస్థలు ప్రబీర్ మీద చేసిన కేసుల బనాయింపులు, ఆరోపణలు చాలా దారుణం. ఆయన విదేశీ నిధులు పొంది జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలు చేపట్టారని దుర్మార్గమైన కేసులు పెట్టారు. ప్రబీర్ ప్రజాపక్షాన తన జీవితాన్ని అంకితం చేసుకున్న గొప్ప మేధావి, ఇంజనీరు. ఉద్యోగాన్ని వదులుకొని న్యూస్‌క్లిక్ వెబ్ పోర్టల్ ద్వారా ప్రజా జర్నలిజం వైపు నిలిచారు. ప్రధాన స్రవంతి మీడియా విస్మరించిన అనేక ప్రజా సమస్యలను, ఉద్యమాలను వెలుగులోకి తీసుకొచ్చారు. 2020-21లో నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన మహోద్యమాన్ని అనేక క్షేత్రస్థాయి కథనాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. కార్మికులు, రైతులు, నిరుద్యోగం, ప్రజారోగ్యం, విద్య, ఆర్థిక అసమానతల వంటి అంశాలపై కథనాలు ప్రచురించారు. ప్రధాన మీడియాలో అత్యధిక భాగం తమ కాళ్ల ముందు సాగిలపడుతున్న దశలో, ప్రబీర్ పోర్టల్ ద్వారా ఎదురు నిలవడం మోడీ ప్రభుత్వానికి కంటగింపుగా తయారైంది. ఎలాగైనా అణచివేయాలని 2021 నుంచే వివిధ రూపాల్లో ప్రయత్నించి, విఫలమైంది. 2023లో ఓ అమెరికా పత్రిక ప్రచురించిన తాడూ బొంగరం లేని ఒక కథనాన్ని నెపంగా తీసుకొని, న్యూస్‌క్లిక్ కార్యాలయంపైనా, అందులో పనిచేసే జర్నలిస్టులు, రచయితలు, పరిశోధకులు, కార్యకర్తల ఇళ్లపైనా దాడులకు తెగబడింది. ప్రబీర్ పుర్కాయస్థ, సంస్థ హెచ్‌ఆర్ విభాగం అధిపతి అమిత్ చక్రవర్తిపై ఉపా చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేసింది. 2024 మే 15న సుప్రీంకోర్టు ఆయన అరెస్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇది కేసుకు మొదటి పెద్ద ఎదురుదెబ్బ. ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు ఆ కేసునే కొట్టిపారేసింది.
భారతదేశంలో దిగజారిన పత్రికా స్వేచ్ఛకు న్యూస్‌క్లిక్‌పై దాడి ఒక ఉదాహరణ. సిద్ధిక్ కప్పన్, మహ్మద్ జుబైర్ వంటి జర్నలిస్టులపైనా కేసులు బనాయించి జైల్లో బంధించటం, ప్రజాపక్షాన నిలిచే మీడియా సంస్థలపై దాడులు జరపటం వంటి పాలకుల కక్షపూరిత చర్యలు ఇంకెన్నో ఉన్నాయి. 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాల మధ్య భారత్ స్థానం 157లో ఉండడం సిగ్గుచేటు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను హామీ ఇస్తోంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రజా ఉద్యమాల వార్తలను ప్రజలకు చేరవేయడం ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ. జాతీయ భద్రత పేరుతో ఆ హక్కులను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు చట్టాన్ని రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్న మోడీ ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తన కక్షపూరిత వైఖరిని, నిరంకుశ ధోరణులను విడనాడాలి. లేకుంటే ఇలాగే పరాభవాలు ఎదురవుతాయి.
ప్రజా పాత్రికేయ విజయం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 12, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)