కాకినాడ : కృష్ణ, గోదావరి బేసిన్ లో లభ్యమవుతున్న చమురు, గ్యాస్ లో సగం వాటా రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ …. నేడు కేజీ బేసిన్ ప్రాంతంలో వామపక్ష పార్టీలు పర్యటించాయి. చమురు, గ్యాస్ ధరలు పెరిగి, మార్కెట్లో కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో 12వ ఫైనాన్స్ సిఫార్సు ప్రకారం కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాస్లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 వామపక్ష పార్టీల నేతలు కేజీ బేసిన్ గ్యాస్ ప్రాంతం (కాకినాడ జిల్లా)లో పర్యటించారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మధు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి ప్రసాద్, జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్బాబు, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు రామకృష్ణ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ఎ సూర్యనారాయణ, జె పాండవులు ఇతర వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ …. కృష్ణా గోదావరి డి6 బేసిన్లో లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును రిలయన్స్ కంపెనీ ఇక్కడ నుండి మహారాష్ట్ర, గుజరాత్ కు తరలించి వేలకోట్ల రూపాయలు గాలివాటంగా సంపాదిస్తోందన్నారు. ఆయిల్ డ్రిల్లింగ్, ఇతర కార్యకలాపాల వల్ల నిత్య కాలుష్యంతో పాటు బ్లోఅవుట్లు, ఇతర ప్రమాదాల్లో రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తుల్లో 50 శాతం రాష్ట్రానికివ్వాలని 12వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినప్పటికీ అమలు కాలేదని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో గ్యాస్ దొరక్క సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక వ్యాపారాలు మూతపడి వందలాది మంది ఉపాధి కోల్పోయి వీధుల్లో పడ్డారని, నిత్యావసరాలు, తినుబండారాల ధరలు పెరిగాయని చెప్పారు. అందువల్ల కేజి బేసిస్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో 50 శాతం రాష్ట్రానికివ్వాలని, చట్టబద్ధంగా రావాల్సిన చమురు, గ్యాస్ వాటా పొందేలా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కేజి బేసిస్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో 50 శాతం రాష్ట్రానికివ్వాలి : వామపక్ష పార్టీలు
06 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 06, 2026, 01:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)