test1
శనివారం, 13 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​సెక్యూరిటీ గార్డుల సమస్యలపై సంఘటిత ఉద్యమం

5 రోజుల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 08, 2026, 12:56 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం


ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా):  సమస్యల పరిష్కారం కోసం సెక్యూరిటీ గార్డులు సంఘటితమై ఉద్యమించాలని నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ అలైడ్ వర్కర్స్ యూనియన్స్‌ (‌సిఐటియు) జాతీయ కన్వీనర్ ఎం.సాయిబాబా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సిఐటియు కార్యాలయంలో ఎపి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సదస్సు ఆదివారం జరిగింది. సదస్సుకు యూనియన్ రాష్ట్ర గౌరవాధక్షులు ముజఫర్ అహ్మద్ అధ్యక్షత వహించారు. సాయిబాబా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారని, సరళీకరణ విధానాల వల్ల వలసలు పెరిగిన నేపథ్యంలో సెక్యూరిటీ గార్డుల రంగం విస్తరిస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ రంగంలోనే సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారని ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం అయిందని చెప్పారు. ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటలు డ్యూటీ చేయాల్సిన దుస్థితి నెలకొందని, చాలీచాలని వేతనాలతో బతకాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌‌లు తేవడం వల్ల కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా పోయిందని, గతంలో పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులూ పోయాయని తెలిపారు. కనీస వేతన చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో 2008లోనే చేయగా ఇప్పటికీ సవరించలేదని విమర్శించారు. సెక్యూరిటీ గార్డులకు రూ.10-16 వేలు ఇస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పరిధి సంస్థలలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి ప్రాంతాన్ని బట్టి రోజుకు రూ.893 నుండి రూ.1065 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాల కోసం ఉద్యమించాలని కోరారు. ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ...ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలని, అదనపు పని గంటలకు డబల్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఇఎస్ఐలను అమలు చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు, ఆ హాస్పిటల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు హెల్త్ కార్డులు ఇచ్చి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలు మారినా పాతవారినే కొనసాగించాలని, ఏజెన్సీలు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని, మహిళలకు చట్టపరమైన భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి హాజరైన సెక్యూరిటీ గార్డులు స్థానికంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను సదస్సు దృష్టికి తెచ్చారు. సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, మంగళగిరి ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ కార్యదర్శి కె.బుజ్జిబాబు, సిఐటియు సీనియర్ నాయకులు జెవి రాఘవులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్