- సిలిండర్‌కు రూ.29 పెంపుపై సర్వత్రా ఆగ్రహం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలపై మరోసారి గ్యాస్ భారం వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నా, సమర్ధించుకునేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధరను రూ.29 ఆదివారం నుంచి పెంచింది. మూడు నెలల్లో రెండోసారి పెంచినట్లయింది. మార్చి 7న గ్యాస్ సిలిండర్ ధరను రూ. 60 పెంచారు. మూడు నెలల్లోనే రెండోసారి వంటగ్యాస్ ధరలు పెరగడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో పుండు మీద కారం జల్లేలా పెంపును సమర్ధించుకుంటూ ప్రకటన చేసింది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ఎల్‌పిజి ధరలు తక్కువేనంటూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఒక సిలిండర్‌ను సప్లై చేసేందుకు ప్రస్తుతం రూ.1,600లకు పైనే ఖర్చవుతోందని పేర్కొంది. ఢిల్లీలోని ఒక సాధారణ కస్టమర్ ఒక సిలిండర్ కోసం రూ.942 చెల్లిస్తుంటారని, భారత్‌లోని ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో ముడి పడి ఉంటాయని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కారు చౌకగా క్రూడాయిల్ లభ్యమైనప్పుడు కూడా వినియోగదారులకు తగ్గించకుండా ఆ లాభాలను చమురు కంపెనీలు తమ ఖాతాలో వేసుకుని, ధరలు పెరిగినప్పుడు ఆ భారాలను సామాన్యులపై వేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఇలా బుకాయింపునకు దిగడం గమనార్హం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను మరింత అడ్డగోలుగా పెంచుతున్న కేంద్రం… వాటి ధరలను నెలనెలా సవరిస్తునే ఉంటామని పేర్కొంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఈ ఏడాది మే 1న రూ. 993, జూన్ 1న రూ.42 పెంచడంతో రూ.3,113.50కు పెరిగిపోయింది. మరోవైపు మే మధ్య నుండి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మొత్తం రూ. 7.50 పెరగగా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్‌జి) ధరలు కిలోకు సుమారు రూ. 6 పెరిగాయి.








కామెంట్‌లు (0)