test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ బస్సులొస్తున్నాయ్‌.. వెళ్లిపోండి

4 గంటల క్రితం

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 15, 2026, 06:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- బెదిరించి మరీ పంపించేసిన ఆర్‌‌టిసి అధికారులు
- మిగిలిన డిపోల్లోనూ బదిలీల భయం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కష్టపడి నిలబెట్టుకున్న ఎపిఎస్‌ఆర్‌‌టిసికి గతంలో కొత్త బస్సులు వచ్చాయంటే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం వచ్చేది. వారింటికి కొత్త పండగ వచ్చినంత ఆనందపడేవారు. తాము చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తుందని, కొత్త బస్సులతో సంస్థ ఆదాయం పెరుగుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని రెట్టించిన ఉత్సాహంతో పనిచేసేవారు. బస్సులోని ప్రయాణికులకు పదే పదే చెప్పుకుని బస్సును కన్నబిడ్డలా చూసుకుంటూ సంస్థను కాపాడుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో కొత్త బస్సు అంటే కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల పిఎం ఇ-బస్ సేవా పథకం కింద ఎపిఎస్‌ఆర్‌‌టిసికి 1,050 విద్యుత్ బస్సులు కేటాయించారు. తొలిదశలో 750 బస్సులు కొంటున్నారు. వీటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. తొలిదశలో వస్తున్న బస్సులకు వీలుగా డిపోలను ఖాళీ చేయిస్తున్న అధికారులు ఆయా డిపోల్లో ఉన్న బస్సులను వేర్వేరు డిపోలకు పంపించడంతోపాటు ఉద్యోగులనూ బదిలీ చేశారు. గతంలో బస్సులు వస్తుంటే ఉద్యోగులను పెంచాలనుకునే స్థితి నుండి ఉద్యోగులను పంపించేయాలనే స్థితికి ఆర్‌‌టిసిని చేర్చారు. దీనివెనుక ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం తమ ప్రణాళికను అమలు చేస్తున్నాయి. విద్యాధరపురం, గుంటూరు-2, నెల్లూరు-2 డిపోల్లో కలిపి సుమారు 1,500 మంది సిబ్బందిని వేర్వేరు డిపోలకు మార్చారు. విద్యాధరపురం సిబ్బందిని ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉయ్యూరు, గవర్నరుపేట డిపోలకు బదిలీ చేశారు. గుంటూరు సిబ్బందిని మంగళగిరి, తెనాలి, గుంటూరు-1 వంటి ఇతర డిపోలకు బదిలీ చేశారు. నెల్లూరు-2 డిపో సిబ్బందిని ఉదయగిరి, ఆత్మకూరు, కావలి వంటి డిపోలకు బదిలీ చేశారు. వెళ్లకపోతే తొలగించాల్సి ఉంటుందని బెదిరించి మరీ పంపిచేశారు. బదిలీ కోరుకునే ఫారంలో వెళ్లే ప్రాంతం తప్ప ఆప్షన్ లేకుండా చేశారు. అంటే కచ్చితంగా ఎక్కడో ఒకచోటకు వెళ్లిపోవాల్సిందేనని షరతు విధించారు. దీంతో ఉద్యోగులు వేర్వేరు డిపోలకు వెళ్లిపోవాల్సి వచ్చింది. వచ్చే జీతాలతో పిల్లలను చదివించుకుంటూ జీవితాలను నెట్టుకొస్తున్న ఉద్యోగులు బదిలీ అంటే అక్కడ జీవనం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసినా కనికరించలేదు. అద్దెలు కట్టుకుని కుటుంబాలను పోషించుకోవడం అంటే మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని ఆర్‌‌టిసి ఉద్యోగ సంఘమైన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తెలిపారు. వచ్చిన బస్సులు నిర్వహించే సామర్థ్యం ఆర్‌‌టిసికి ఉన్నా ప్రభుత్వం ప్రైవేటు ఆపరేటర్‌‌కు కట్టబెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే తిరుపతిలో నడుస్తున్న విద్యుత్ బస్సులు నిరంతరం తిప్పలు పెడుతున్నాయి. అవి మధ్యలో ఆగిపోతే వాటి టెక్నీషియన్ వచ్చి మరమ్మతు చేసిందాకా అవి కదిలే పరిస్థితి లేదు. మరలా డీజిల్ బస్సులు వెళ్లి ప్రయాణికులను తీసుకురావాల్సి వస్తోంది. కొద్దికాలంగా ఈ సమస్య మరింత పెరిగింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చే బస్సుల్లో కొన్ని మంగళం డిపోకు కూడా వెళుతున్నాయి. ఇక సిబ్బంది విషయానికొస్తే విద్యాధరపురంలో 500, గుంటూరు 500, నెల్లూరులో 500 మంది మొత్తం 1,500 మందిని బదిలీ చేశారు. సంస్థ కోసం అహర్నిశలూ కష్టపడ్డ తమను అదే బస్సులు వస్తున్నాయనే పేరుతో బదిలీలు చేయడం, లేకపోతే వెళ్లిపోవాలని చెప్పడాన్ని భరించలేకపోతున్నామని డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్