నేపాల్ కూడా భారత్ భూభాగాలను ఆక్రమించింది
పార్లమెంట్ లో ప్రకటించిన ఆ దేశ ప్రధాని
ఖాట్మాండు : చర్చల ద్వారానే భారత్ తో సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా అన్నారు. భారతదేశం నేపాల్ భూభాగాలను ఆక్రమించినట్లే, నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ పార్లమెంట్ లో బాలేంద్ర షా ఆదివారం స్వయంగా ప్రకటించారు. నేపాల్, భారతదేశం మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపాని ప్రాంతంపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు షా సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ‘ మీకు ఇది వింతగా అనిపించవచ్చు, కానీ నేను ప్రధాన మంత్రి అయిన తర్వాతే ఈ విషయం తెలుసు కున్నాను. కేవలం భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా అనేక చోట్ల భారత భూభాగాలను ఆక్రమిం చుకుంది` అని షా తెలిపారు. లిపులేఖ్, లింపి యాధుర, కాలాపాని వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటా మన్నారు. నేపాల్ అధికార పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధ్యక్షులు రబీ లమిచానే భారత్ పర్యటనకు ఒక రోజు ముందు షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏంటి వివాదం?
కాలాపాని ప్రాంతంపై భారత్, నేపాల్ మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. లిపులేఖ్ మార్గం ద్వారా మానస సరోవరానికి యాత్రను భారత్ ప్రకటించడంతో ఇటీవల ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై నేపాల్ భారత్, చైనా రెండింటికీ లేఖలను పంపిందని, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్(యుకె) లతో కూడా దౌత్యపరమైన చర్చలు జరిపిందని షా వెల్లడించారు. ఈ వివాదంపై నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్ట్ – లెనినిస్ట్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ నాయకురాలు పద్మా ఆర్యల్ అడిగిన వేరే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఈ విషయాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరిస్తామని షా స్పష్టం చేశారు. సరిహద్దు వివాదంపై నేపాల్ చైనా, యుకెలను కూడా సంప్రదించామని షా తెలిపారు. “మేము భారత్, చైనాలతో పాటు యుకె ప్రభుత్వంతో కూడా మాట్లాడాము. బ్రిటిష్ ఇండియా కాలం నాటి సమస్య కాబట్టి, యుకె కూడా దీనిపై జోక్యం చేసుకోవాలన్నది మా అభిప్రాయం,” అని షా అన్నారు. నేపాల్ ప్రభుత్వం లిపులేఖ్‌తో సహా భారత్ ఆక్రమించిన భూభాగాల సమస్యను ప్రస్తావిస్తూ భారత్‌కు అధికారిక దౌత్య నోట్‌ను పంపిందని, దానికి భారత్ నుండి ప్రతిస్పందన కూడా వచ్చిందని షా నేపాల్ పార్లమెంటుకు తెలిపారు. దౌత్య మార్గాల ద్వారా చరిత్రకారులు, సర్వేయర్లు, సంబంధిత నిపుణుల సహాయంతో కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. భారత్‌కు మాజీ నేపాల్ రాయబారి నీలంబర ఆచార్య కాంతిపూర్ మీడియాతో మాట్లాడుతూ, నేపాల్ ప్రధానికి “భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు ఎటువంటి సమాచారం లేదు” అని అన్నారు. రెండు దేశాల మధ్య 97 శాతం సరిహద్దు వివాదాలు ఇప్పటికే పరిష్కారమైందని తెలిపారు.








కామెంట్‌లు (0)