ట్రంప్ వెల్లడి
నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు
పిచ్చోడివంటూ ఆగ్రహం
లెబనాన్ పై దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు : ఇరాన్
వాషింగ్టన్ : లెబనాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు కొనసాగిస్తుంది. కీలకమైన బ్యూఫోర్ట్ కోటను స్వాధీనం చేసుకుంది. దక్షిణ లెబనానీస్ నబాటియా నగరాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటూ మంగళవారం ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరించింది. మర్వానియే గ్రామంలోని నివాసాలపై దాడులకు తెగబడింది. ఈ దాడిలో ఆరుగురు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయిల్ దాడులు ఆపేంత వరకూ చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దిక్కు తోచని ట్రంప్.. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ లో చర్చలు జరిపారు. అనంతరం ‘నేను ఈ రోజు నెతన్యాహూతో మాట్లాడాను. బీరుట్‌పై దాడి చేయొద్దని కోరాను. ఆయన తన దళాలను వెనక్కి రప్పిస్తున్నారు. ధన్యవాదాలు’ అని ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు. హిజ్బొల్లా నాయకుల ప్రతినిధులతో కూడా మాట్లాడానని, ఇజ్రాయిల్ పైన, దాని సేనల పైన కాల్పులు ఆపడానికి వారు అంగీకరించారని తెలిపారు. ఇజ్రాయిల్ కూడా కాల్పులు ఆపడానికి అంగీకరించిందని అంటూ ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూద్దామని అన్నారు. ట్రంప్‌తో సంభాషణను నెతన్యాహూ ధృవీకరించారు. ఈ సంభాషణ తనకు ఓ హెచ్చరిక వంటిదని చెప్పారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సైన్యం ఓ ప్రణాళిక ప్రకారం పనిచేస్తుందని తెలిపారు. ఇజ్రాయిల్‌పై హిజ్బొల్లా దాడులు ఆపకపోతే తాము బీరుట్‌పై దాడి చేసే అవకాశం లేకపోలేదని ముక్తాయింపు ఇచ్చారు. ‘మా వైఖరి కొనసాగుతుంది’ అని అన్నారు. తాజా పరిణామాలపై హిజ్బొల్లా ఇంకా స్పందించలేదు.
నెతన్యాహు పిచ్చోడు : ట్రంప్
లెబనాన్‌లో ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో జరుపుతున్న శాంతి చర్చలను ఇజ్రాయిల్ ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. నెతన్యాహూతో జరిపిన వాడీవేడి టెలిఫోన్ సంభాషణలో ట్రంప్ ఆయనపై ఆగ్రహించినట్లు సమాచారం. ‘నీకు పిచ్చి పట్టింది. ఇప్పుడు నిన్ను, ఇజ్రాయిల్‌ను అందరూ ద్వేషిస్తున్నారు. నీకు కృతజ్ఞత లేదు. నువ్వు జైలుకు పోకుండా సాయపడ్డాను. కాపాడుకుంటూ వస్తున్నాను. లేకపోతే జైలులో ఉండేవాడివి’ అంటూ నెతన్యాహూను తూర్పార పట్టినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులు సహా అన్ని రకాల దాడులను నిలిపివేస్తేనే శాంతి ఒప్పందం సాధ్యపడుతుందని ఇరాన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా ట్రంప్, నెతన్యాహూ మధ్య ఉద్రిక్తపూరితమైన సంభాషణలు జరిగినప్పటికీ ఇరాన్, ఇతర సమస్యలపై వారిద్దరి మధ్య సన్నిహిత సమన్వయం కొనసాగుతూనే ఉంది. బీరుట్‌పై బాంబు దాడులు జరుపుతామని ఇజ్రాయిల్ చేస్తున్న హెచ్చరికలు ఆ దేశాన్ని ప్రపంచంలో మరింత ఒంటరిని చేస్తుందని నెతన్యాహూను ట్రంప్ హెచ్చరించారని తెలుస్తోంది.
ఆగ్రహానికి కారణం ఇదే..
బీరుట్‌లోని దహియెహ్ జిల్లాలో హిజ్బొల్లాల నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై దాడులు చేయాలని, 70 శాతంపైగా లెబనాన్ ను ఆక్రమించాలని నెతన్యాహూ, ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ తమ దళాలను సోమవారం ఆదేశించారు. అనంతరం జరిగిన దాడుల్లో సామాన్య పౌరులు మృతి చెందారు. అయితే కాల్పుల విరమణను హిజ్బొల్లా పదేపదే ఉల్లంఘిస్తోందని, మా భూ భాగంపై దాడులు చేస్తోందని ఇజ్రాయిల్ ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరగవచ్చునన్న భయాందోళనలతో బీరుట్(లెబనాన్) దక్షిణ శివారు ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అమెరికాతో జరిగే ఏ ఒప్పందంలో అయినా లెబనాన్‌లో కాల్పుల విరమణ కీలక అంశం కావాల్సిందేనని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ట్రంప్.. ఇజ్రాయిల్ ప్రధానికి ఫోన్ చేసి హెచ్చరించారు. కానీ, ట్రంప్ ప్రకటనపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ లెబనాన్ పై దాడులను ఇజ్రాయిల్ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘ఇరాన్, అమెరికా మధ్య జరిగిన ఒప్పందం లెబనాన్‌తో సహా అన్ని రంగాలకు వర్తిస్తుంది.








కామెంట్‌లు (0)