డబ్ల్యుహెచ్ఒ : ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రస్తుతం కాంగో, ఉగాండ, దక్షిణ సూడాన్‌లలో వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
మరోవైపు భారత ప్రభుత్వం కూడా బుండిబుగ్యో ఎబోలాపై అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు ప్రయాణించవద్దని హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. శనివారం నాటికి కాంగోలో మొత్తం 867 మందికి ఈ వ్యాధి వ్యాపించగా.. 204 మరణాలు నమోదయ్యాయి.
చరిత్రలో మూడో అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా..
కేవలం వారాల వ్యవధిలోనే మూడు దేశాలకు పాకిన ఎబోలా వందల మందికి సోకింది. భౌగోళికంగా కూడా ఈ వ్యాధి వ్యాపించిన ప్రదేశంలో కట్టడి చేయడం చాలా కష్టమని అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు ….
ఈశాన్య కాంగోలోని యుద్ధ ప్రభావిత ప్రాంతమైన ఉగాండా సరిహద్దుల్లో తొలి ఎబోలా కేసు నమోదైంది. అక్కడ ఒక హెల్త్ వర్కర్ వాంతులు, జ్వరంతో చికిత్స తీసుకొని కొన్ని రోజుల్లోనే మరణించారు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించారు. దానిని తాకిన చాలా మందికి కొన్నాళ్లకే ఎబోలా లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ సోకిన వారికి కొన్ని వారాలపాటు వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం కలుగుతోంది. వ్యాధి వ్యాపించిన ప్రదేశం కాంగోలో ప్రధాన మైనింగ్ కేంద్రం కావడంతో జనాభా రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో 2018లో ఎబోలా వ్యాపించిన సమయంలో దానిని కట్టడి చేయడానికి ఏకంగా రెండేళ్ల సమయం పట్టింది.
అరుదైన రకం ….
మనుషులకు సోకే నాలుగు రకాల ఎబోలా వైరస్‌ల్లో బుండిబుగ్యో ఒకటి. దీనిని ఉగాండాలోని ఓ పర్వత ప్రాంతంలో తొలిసారి కనుగొన్నారు. గతంలో రెండుసార్లు మాత్రమే వ్యాపించడంతో అధికారులు పెద్దగా దృష్టిపెట్టలేదు. ఫలితంగా తాజాగా వ్యాపించిన ప్రదేశంలోని ల్యాబ్ పరీక్షల్లో దీనిని గుర్తించే సౌకర్యం లేకపోవడంతో.. గుర్తించేందుకు జాప్యం జరిగింది. మొదటి దీనిని గుర్తించేందుకు నమూనాను వేల మైళ్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ రీసెర్చి ల్యాబ్‌కు పంపాల్సి వచ్చింది.
నెమ్మదిగా ఎబోలా వైరస్ ….
ఎబోలాలో జైర్ అనే స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్ కొంచెం నెమ్మదిగానే తన సంఖ్యను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పశ్చిమాఫ్రికా ప్రాంతంలో 2014లో 11,300 మంది ప్రాణాలు తీసింది జైర్ వేరియంట్. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తి. దీంతో పోలిస్తే బుండిబుగ్యో వేరియంట్ సోకిన వారిలో 30% మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. కాకపోతే దీనికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్, చికిత్స లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.








కామెంట్‌లు (0)