test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

CIA – మాజీ గూఢచారి అధికారి ఇంట్లో భారీ బంగారం.. !

29 మే, 2026

Huge gold found in former spy officer's house..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 29, 2026, 12:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికాకు చెందిన ప్రముఖ గూఢచర్య సంస్థలో పనిచేసిన మాజీ అధికారి డేవిడ్ రష్ వ్యవహారం సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా నిఘా సమాచార సేకరణలో పేరొందిన ఈ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఇంట్లో భారీగా బంగారం, నగదు బయటపడటంతో అధికారులు విస్తుపోయారు. దర్యాప్తులో భాగంగా అతని నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌బిఐ అధికారులు ఒక్కొక్కటి కిలో బరువున్న 300 బంగారు బిస్కెట్లను గుర్తించారు. వీటితో పాటు 35 ఖరీదైన విలాసవంతమైన గడియారాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అత్యంత ఖరీదైన నమూనాలు ఉన్నట్లు వెల్లడించారు. అదనంగా సుమారు 20 లక్షల డాలర్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డేవిడ్ రష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రజా ధనం దుర్వినియోగం …
దర్యాప్తు సంస్థల వివరాల ప్రకారం …. డేవిడ్ రష్ గూఢచర్య సంస్థలో పనిచేసిన సమయంలో అధికారిక అవసరాల పేరుతో 2025-26 మధ్య ప్రభుత్వ వనరుల నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదు పొందినట్లు గుర్తించారు. అయితే ఆ నిధులు, ఆస్తులు ఎక్కడ వినియోగించబడ్డాయన్న వివరాలు అధికారిక లెక్కల్లో కనిపించలేదని ఎఫ్‌బిఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలపై అతనిపై కేసు నమోదు చేశారు. అధికారిక కార్యక్రమాల కోసం కేటాయించిన ఆస్తులను రహస్యంగా తన వ్యక్తిగత ఆధీనంలో ఉంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు.

అమెరికా నౌకాదళంలో డేవిడ్ రష్ …
డేవిడ్ రష్ గతంలో అమెరికా నౌకాదళంలో కూడా సేవలందించాడు. తాను అక్కడ వైమానిక సిబ్బందిగా పనిచేశానని చెప్పుకున్నప్పటికీ, అందుకు సంబంధించిన వివరాలు సరిపోలలేదని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. నౌకాదళంలో పనిచేసిన కాలానికి సంబంధించిన కొన్ని అక్రమాలపై కూడా పరిశీలన కొనసాగుతోంది.
అలాగే గూఢచర్య సంస్థలో అతను నిర్వహించిన కచ్చితమైన బాధ్యతలపై కూడా అధికారులు స్పష్టత కోసం విచారణ జరుపుతున్నారు.

అలెగ్జాండ్రియాలో విచారణ …
వర్జీనియా రాష్ట్రంలోని అలెగ్జాండ్రియా నగరంలో ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగనుంది. అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 4 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.382 కోట్లకు సమానం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సంస్థలో నిధుల వినియోగం,వ్యయాల నిర్వహణపై సమగ్ర అంతర్గత సమీక్ష చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై సంస్థ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్